కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
కోప వివశయై సత్య శ్రీకృష్ణుని బరుషోక్తులాడుట
ఉ. ఈ నయగారపుం బ్రియములీ పస లీ మెర మెచ్చు మాటలే
లా నిను నమ్మి యుండిన ఫలంబిదె తోడన నాకు గల్గె నీ
యాన జుమా ననుంజెనకి యాఱడి బెట్టిన నవ్వు వారలం
గాన వెఱుంగునే పసుల కాపరి భావజ మర్మ కర్మముల్‌?
125
ఉ. ఇంకిటు నిన్ను నమ్మ నను యేమిటికిం కెరలించె దెంతయున్‌
పొంకము కాని నీ వలని బొంకులు మా చవి గావు రుక్మిణీ
పంకజ పత్ర నేత్రకును ప్రాణ పదంబులు గాని వల్లకీ
కింకర చాలుజాలు యుడికింపకు నింపకు లేని కూరుముల్‌
126
ఉ. గట్టివ చేతలుం పసలు కల్లతనంబులు నీవు పుట్టఁగాఁ
బుట్టినవెందు లేని పలు పోకల మాయలు నీకు వెన్నతో
పెట్టినవౌ టెఱింగియును బేల తనంబున నిన్ను నమ్మి నా
గుట్టును తేజమున్‌ మిగుల కోల్పడి పోయితినేమి జేయుదున్‌
127
చ. మునిపతి వచ్చి పూవొసఁగి మోదము తోడ భవత్ప్రియాంగనన్‌
వినుతి యొనర్పఁగా వినిన వీనులు మా చవిగాని మాటలన్‌
విన వలసెంగదా యిపుడు నీవిట వచ్చుట పారిజాత వా
సన ప్రకటించి నాకు నెకసక్కెము చేయన కాదె జెప్పుమా?
128
క. మానంబె తొడవు సతులకు
మానమె ప్రాణాధికంబు మానమఖిల స
మ్మానములకు మూలంబగు
మాన రహితమైన బ్రతుకు మానిని కేలా?
129
తే. తనదు కోడండ్రలోనఁ బెద్దయుఁగ నన్ను
దేవకీ దేవి మన్నించు; నీవు నాకుఁ
జనవు లిచ్చుటఁజేసి; యా సాధ్వి సేవ
సేయఁ బోవంగ నా కింక సిగ్గు కాదె!
130
సీ. ఉవిద యెవ్వతె నోఁచి యున్నదో! యీ శమం - తక రత్న మింక నౌఁదల ధరింప?
నీ రైవతక శైల చారు కూట విటంక - కేళి కిం కెవ్వతె పాలుపడునొ?
యెవ్వతె కబ్బునో! యీ వసంతారామ - కర్పూర కదళి కాగార వసతి?
లీల నీ మణి సౌధ జాలకంబుల నిన్నుఁ - గూడి యెవ్వతె వార్ధిఁ జూడఁ గలదొ?
 
తే. యకట! నేఁ బెంపఁ బెరిఁగిన శుక మయూర
శారికా బృంద మెవ్వతెఁ జేరునొక్కొ!
నన్ను నాతోడి సవతులు నగక మున్న
పంత మలరంగ నిన్ను మెప్పింతుఁ గాన
131
క. నను యెవ్వతె గాఁ జూచితి
వని యంతర్బాష్ప యగుచు యవనత ముఖియై
ఘనతర గద్గదికా ని
స్వనమున మఱి మాటలాడ శక్యము కామిన్‌
132
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )