కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
ఆశ్వాసాంతము
మ. దయమానాక్షివిలోక! లోక హితకృత్ప్రారంభ! రంభా కుచ
ద్వయ దుర్గాధిపతి ద్విషత్పఠిత గాథా వ్యక్త దోస్సార! సా
రయశ స్సాంద్ర దిశాంత! శాంత హృదయారజ్యన్న యాచార! చా
రయుతోపాయ విచార! చారణ గణ ప్రస్తూయమానోదయా!
138
క. ప్రతివర్ష వసంతోత్సవ
కుతుకాగత సుకవి నికర గుంభిత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూ ప్రసాదన రసికా!
139
నర్కుటము. ప్రసృతి విలోచనా కుసుమబాణ! దిశా లలనా
ఘుసృణ పటీర లేపకృతి కోవిద! బాహుతటీ
విసృమర కీర్తిజాల! రణ వీక్షిత వైరినృప
త్యసృగతి పంకిలాసిముఖ! యైందవ వంశ మణీ!
140
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార
సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక
గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన
పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )