కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
సత్యా సౌధమున శ్రీకృష్ణుని మజ్జన భోజనాదులు
క. తలిరాకుఁబోణి యొక్కతె
జలకమునకు వేళ యనుచు శౌరికి వీణా
కలకలములఁ గలకల నగు
పలుకుల మెలపొలయ విన్నపము గావించె\న్‌.
5
ఉ. ఇంచిన వేడ్క నాత్మహృదయేశ్వరిఁ గన్గొని శౌరి మందహా
సాంచిత నేత్రుఁడై జలకమాడఁగ లెమ్మని పైఁడిచేల కొం
గించుక జాఱ నొక్క తరళేక్షణ హస్తముఁ గేల నూఁదుచుం
గంచుకి సంచయము సముఖా! యన గద్దియ డిగ్గె, డిగ్గినన\న్‌.
6
క. ప్రామినుకుల పూఁబోఁడుల
సీమంతపుఁ జెందిరంబుచే బలె నరుణ
శ్రీమించు నతని పదముల
భామామణి యోర్తు పయిఁడి పావలు తొడిగె\న్‌.
7
తే. కేళిగతి మీఱ మజ్జనశాల కరిగి
శాతమన్యవ మణిమయాసనమునందుఁ
గౌస్తుభాది విభూషణోత్కరము లెల్ల
నొయ్య నొయ్యన సడలించి యున్న యంత.
8
ఉ. కంపన లీలమై నసదుఁగౌ నసియాడఁ, గుచద్వయంబు న
ర్తింప, లలాటరేఖ చెమరింపఁగ, హారలతా గుళుచ్ఛముల్‌
తుంపెసలాడఁ, గంకణ మృదుధ్వని తాళగతిం జెలంగఁగా,
సంపెఁగ నూనె యంటె నొక చంద్రనిభానన కంసవైరికి\న్‌.
9
ఉ. తామరదోయిలోఁ దగిలి దాఁటెడు తేఁటులువోలెఁ బెన్నెఱుల్‌
వేమఱు చేతులం బిడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులం
గోమలలీల దువ్వి తెలి గొజ్జఁగి నీ రెడఁ జల్లి చల్లి గం
ధామలకంబు వెట్టె నొకయంగన కాళియనాగ భేదికి\న్‌.
10
మ. చెలువ ల్గొందఱు హేమకుంభములతోఁ జేసే నొసంగ న్విని
ర్మల దోర్మూలరుచు ల్వెలిం బొలయఁ దోరంబైన చన్దోయి సం
దొలయ న్వేనలి జాఱ నిక్కి యరమే నొయ్యారమై వ్రాలఁగా
జలకంబార్చె లతాంగి యోర్తు యదువంశ స్వామికి న్వేడుక\న్‌.
11
సీ. చంద్రిక పూవన్నె జిలుఁగు దువ్వలువను - దడియొత్తె నొక్క కాంతాలలామ,
కొనగోళ్ల నెఱులు చిక్కులు వాపి మెలపున - శిర సార్చె నొక్క లేఁజిగురుఁబోఁడి,
వెన్నెల నిగ్గులు వెదచల్లెడు మడుంగు - లందిచ్చె నొక్క పూర్ణేందువదన,
నవరత్నమయ భూషణవ్రజంబులు మేనఁ - గీలించె నొక రాజకీరవాణి,
 
తే. విరుల సరు లిచ్చె నొక యరవిందగంధి,
యలఁదెఁ జందన మొక ధవళాయతాక్షి,
సుదతి యొక్కతె కపురంబు సురటి విసరె,
నిలువు టద్దంబు నొకయింతి నిలిపె నెదుట.
12
క. కలికి నిడువాలుఁ గన్నుల
తళుకులు మణిదీప శిఖలుఁ దడఁబడ లక్ష్మీ
నిలయునకిచ్చిరి కొందఱు
నెలఁతలు మౌక్తిక విచిత్ర నీరాజనముల్‌.
13
మ. జలకం బాడి, మడుంగు కట్టి, మణిభూషా దీప్యమానాంగియై,
కలపం బెంతయు వింతగా నలఁది, చెంగల్వ ల్నెఱిన్మించ వే
నలిఁ గీల్కొల్పి, పసిండి యందె రవళి న్రాయంచ లంతంత రా
జెలులుం దానును సత్యభామ చనుదెంచె న్నాథుఁడుప్పొంగఁగ\న్‌.
14
సీ. మాత్సర్య ఘన మేఘమాలికాపగమ ప్ర - కాశిత హిమధామ కళ యనంగ,
విరహ నిశీథినీ విరమ సంప్రాపి తో - న్మీల నామోద పద్మిని యనంగఁ,
గ్రోధ దంతావళ క్షోభ విభ్రమ పున - స్సంజాత నైర్మల్య సరసి యనఁగ,
సంతాప నైదాఘ సమయ నిర్గమ కోర - కిత నవ మాలతీ లతిక యనఁగఁ,
 
తే. శాంతిఁ జెన్నారి వికసిత స్వాంత యగుచుఁ
గలఁక యెంతయు దిగఁద్రోచి చెలువ మెసఁగఁ
జేరవచ్చిన ప్రియభామ గారవించి
యున్న యత్తఱి మురవైరి సన్నిధికిని.
15
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )