కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
నారదుఁడు శ్రీకృష్ణ సత్యభామలఁ జూడవచ్చుట
క. చనుదెంచెఁ గలహభోజన
ముని రుక్మిణి వీడుకొల్ప మున్నీటి జలం
బున మజ్జనాది మాధ్యం
దిన కృత్యము లాచరించి నిష్ఠాపరుఁడై.
16
చ. అతనికి సత్యభామయు మురాసురవైరియు నాతిథేయ స
త్కృతు లొనరించి యుండఁగ, సఖీమణు లిద్దఱు పళ్ళెరంబు వె
ట్టితి మని విన్నవించినఁ, దటిల్లతయు న్జలదంబు యామినీ
పతి వెనుకొన్న కైవడిఁ దపస్వియుఁ దామును భుక్తిశాలకు\న్‌.
17
మ. చని గారుత్మత రత్న పాత్రికలఁ గంసద్వేషి సాంబాది నం
దనులు న్సాత్యకి ముఖ్య సోదరులు నానాబంధు సంతానముం
దలమ్రోల న్వసియింప మౌనిపతిచెంత దాను నర్హాసనం
బున నుండె న్భుజియింప వీవనల నంభోజేక్షణ ల్వీవఁగ\న్‌.
18
సీ. శాకపాకంబుల చవులు వక్కాణించు - గతిఁ గంకణంబులు గల్లుమనఁగ
నతివేగ మిడుఁడు మీ రను మాడ్కి మేఖలా - కీలిత రత్నకింకిణులు మొరయఁ,
గలమాన్న రుచితోడఁ గలహించుజాడ దు - వ్వలువ పింజలు ఫెళఫెళ యనంగ,
నారగింపుఁడు మీర లని ప్రియం బాడెడు - పొలుపున మెట్టియ ల్గిలుకరింప,
 
తే. నలరుఁ బోఁడులు వడ్డింప నచటఁ గలహ
భోజియును దాను బహు భక్ష్య భోజ్య లేహ్య
చోష్య పానీయముల మధుసూదనుండు
సారెఁ గొనియాడుచును వేడ్క నారగించె.
19
తే. వామనేత్రీ కరాంచ లావర్జ్యమాన
కనక భృంగారు కర్కరికా ముఖాగ్ర
గళిత గంధోదకంబులఁ గంసవైరి
చేతులను వార్చె బాంధవ శ్రేణితోడ.
20
క. అప్పుడు తాంబూలంబులు
కప్పురమును జాలపల్లికలఁ బడఁతులు తే
నిప్పించె బంధుకోటికి
న ప్పద్మదళాయతాక్షుఁ డంతట సతియు\న్‌.
21
తే. అంతిపురమున నుచిత కృత్యములు దీర్చి
చంద్రశాలా స్థితుం డైన శౌరికడకు
సంతసంబున వచ్చి యాసంయమీంద్రు
నడుగులకు నెఱఁగుడు, నతఁ డాదరమున.
22
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )