కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
సత్యభామకు నారదాశీర్వాదము
వ. ఇ ట్లనియె. 23
మ. పతి నీవై విహరింపఁగా, జనము సంభావింపఁగా, బంధు సం
తతి నిన్నుం గొనియాడఁగా, సవతికాంత ల్సూచి లజ్జింపఁగా,
సతుల ప్రాభవ వైభవోన్నతుల ప్రోవై యిట్లు వర్తించు నీ
కితరస్త్రీజన బుద్ధి దీవనలు నే నే మిచ్చెద న్మానినీ!
24
మ. అనికైనం బతి నిన్నుఁ బాపి చనునో! ప్రాణంబు ప్రాణంబుగా
నిను మన్నింపఁడో! నీ మనోరథముల న్నెయ్యంబుతోఁ జేయఁడో!
చనవు ల్నీవలె నెవ్వరే గఁనిరో! నీసౌభాగ్య మింతింతయే!
నినుఁబోలం గల రబ్జగంధు లన వింటే, యెందు సాత్రాజితీ!
25
క. అటు లైనను గాని మ్మో
కుటిలాలక! నీకు మగఁడు కోరిన కోర్కుల్‌
ఘటియించుఁగాక, తా నెం
తటి కార్యంబైన డించి, నాదీవనల\న్‌.
26
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )