కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
సాయం సంధ్యా వర్ణనము
ఉ. ఆయత తేజము ల్దఱిఁగి యంబుజబాంధవుఁ డస్తసీమకుం
బోయినఁ జూచి వేచిన తమోవిభుఁ డంప దినాంతయోధుఁ డీ
చాయఁ దదీయపత్నిఁ బెలుచం బడ నీడిచికొంచుఁ బోయెడిం
గో యనుమాడ్కి నంతట శకుంత రవంబు సెలంగె నెల్లెడ\న్‌.
30
చ. ఇనుదెసఁ జూడ నోడి తల లెత్తక నీటఁ దదీయబింబముం
గని వగ జక్కవ ల్మొగ మొగంబులు సూచుచుఁ గుంది మూర్ఛఁజెం
దినదెసఁ జూడలేక జలదేవత హా! యని కన్ను మోడ్చెనా
వనరుహము ల్ముడింగె; సహవాసుల దుఃఖము నెయ్యు రోర్తురే!
31
చ. తనువున నంధకారపు మదం బల మి న్నను భద్రదంతికి
న్మొనసినఁ, జిందరేఁగి తపసుం డను మావుతుఁ గ్రుంకుమెట్టలో
యనురల వైచిన న్నొగిలి యచ్చట నెత్తురు గ్రక్కెనో! యనం
గనుఁగవ గోరగింపఁ బొడకట్టె సముజ్జ్వల సాంధ్య రాగముల్‌.
32
మ. ఒక భృంగంబు పరాళినీ మదన తంత్రోన్మాది ప్రాణేశ్వరి\న్‌
మకరం దాసవ మత్త నబ్జగృహ సీమం బెట్టి తాఁ బోయి సం
జకడ న్వచ్చి త దానమ న్ముకుళ మేజాడం జొర న్రాక, యా
మికుఁడోనాఁ దిరిగెం; గొలంకు రమకు\న్‌ మే లెంత హీనంబొకో!
33
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )