కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
చంద్రాభ్యుదయము
ఉ. యామవతీ కళత్రు నుదయావసరంబునకంటెఁ బాండిమ
శ్రీ మునుదోఁచెఁ దూర్పుదెస, సిద్ధము కృష్ణుఁడు పారిజాతము\న్‌
భామినికై హరించు నని పాయని నెవ్వగ నింద్ర రాజ్యల
క్ష్మీ ముఖ మండలంబున వసించిన వెల్లఁదనంబు కైవడి\న్‌.
38
సీ. కెరలి చీఁకటి మ్రాను గెడపంగ నిక్కిన - సమయ గజంబు దంతము లనంగఁ,
జదలు గేదఁగి తూర్పు తుదకొమ్మ నరవిరి - యై కానిపించు పూ రేకు లనఁగఁ,
బొడుపు గుబ్బలి నేల పురిటింటి యిడుపునఁ - జఱచిన గందంపుఁ జట్ట లనఁగ,
మరుని ముందఱ బరాబరిసేయు కంచుకి - కులము చేతుల వెండిగుదె లనంగఁ,
 
తే. గైరవములకు వెన్నెల నీరు పఱవఁ
బూని చేర్చిన పటికంపు దోను లనఁగఁ,
గ్రమముతో శీతకర మయూఖములు గగన
భాగమునఁ గొన్ని యల్లనఁ బ్రాకుఁదెంచె.
39
తే. అమరు లమృతాంబునిధిలోని యమృత రసము
వెండి చేరులఁ బటికంపుఁ గుండ కట్టి
చేఁదుకొనియెదరో! నాఁగ శీతరోచి
మెఱుఁగు మెయితోన యల్లన మిన్ను ప్రాఁకె.
40
చ. అమరుల బోనపుట్టిక, సహస్రమయూఖుని జోడుకోడె, సం
తమసము వేరువిత్తు, కుముదంబుల చక్కిలిగింత, పుంశ్చలీ
సమితికిఁ జుక్కవాలు, నవ సారస లక్ష్మి తొలంగు బావ, కో
కములకు గుండె తల్లడము, కైరవమిత్రుఁడు తోఁచెఁ దూర్పున\న్‌.
41
ఉ. పొందుగఁ బశ్చిమాబ్ధి తట భూస్థలి నంశుమ దంశుమత్ఫలా
కందము వాసరాంత హలిక ప్రవరుం డిడ సాంధ్య వారిభృ
త్కందళముల్‌ తమోదళ యుతంబులు నైగెల పండి వ్రాలెఁ బూ
ర్ణేందునిపేరఁ బ్రాచి నది హేతువు వెన్నెలకల్మి కల్మికి\న్‌.
42
చ. సమయ విలాసి శోణమణి సంగత మౌక్తిక చారు హారము\న్‌
గ్రమమున గూర్చుచో నరుణరత్నము దా మును సాంధ్య రశ్మి సూ
త్రమునఁ బొసంగఁ గ్రుచ్చియెడతప్పునఁ ద్రోచి పిఱుందఁజేర్చు ము
త్తెము క్రియఁ దోఁచె నయ్యమృతదీధితి లాంఛన రంధ్ర సంగతి\న్‌.
43
చ. దిన పరిణామ లక్ష్మికిఁ బ్రతీచి తగం గయిసేయు వేడుక\న్‌
వనరుహమిత్రబింబ మను వర్తుల లాక్షిక పట్టికం బయో
ధి నడుమఁ దోఁచి సాంధ్య నవదీప్తి రసంబు హరించె, పాఱవై
చిన వెలిదూదియో యనఁగ శీతకరుం డుదయించె నత్తఱి\న్‌.
44
మ. కడఁక\న్‌ రేచలిగట్టు పట్టిఁ దను వేడ్కం గూర్ప నేతెంచి వై\న్‌
జడిగాఁ జుక్కలతూపు లేయఁ గినుక\న్‌ జాబిల్లి ముక్కంటి తాఁ
బొడుపుం గెంపను వేఁడికంట నిరుల న్పూవిల్తు మేనేర్చి చొ
ప్పడఁ దద్భూతి యలందెనా!నపుడు బింబం బొప్పెఁ బాండుద్యుతి\న్‌.
45
చ. తొలుమలఱాతితో నొరయు తూరుపుఁ దొయ్యలి ముత్తియంపుఁగుం
డలమున మానికంబు పడినం గనుపట్టెడు లక్కగూఁడు నాఁ
జలువలఱేని యప్పొడుపుఁజాయఁ దొఱంగిన కందు తోఁచె రే
చెలువ కనుంగవం గమియఁ జెందిన కాటుక కప్పు కైవడి\న్‌.
46
మ. అమృతం బాసవ, మంగరాగ ముదయోద్యత్కాంతి, చేలంబు చి
హ్నమునుంగా శశి రేవతీరమణుఁ డున్మాదంబుమీఱం దమో
యమున న్భంగమునొంది పాఱఁ గర సీ రాలోడితం జేయ వ
చ్చె మరుద్వాహిని దానిఁదేర్పనన మించెం జంద్రికా పూరముల్‌.
47
తే. తారకాధీశు కిరణ కదంబకంబు
చిలికెఁ బలుచని వలిపంపు జిలుఁగు మంచుఁ
గైరవశ్రీ వధూ కరగ్రహణ వేళ
వెలికిఁ గ్రమ్మిన సాత్త్విక స్వేద మనఁగ.
48
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )