కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
చంద్రికలు, జారిణులు
చ. వలిపము కట్టి, హారములు వైచి, పటీరము మై నలంది, జా
దులు నెఱిగొప్పునం దుఱిమి, త్రోవనె పోయితి మేని తాఁకియుం
దలఁచెడువారు లేరని మనంబు కలంకలు దేర్చి జారకాం
తల సమయ స్థలంబులకుఁ దార్చిరి దూతిక లట్టివెన్నెల\న్‌.
52
వ. వెండియుం దుహినకరమండలంబునం గురియు నప్పండు వెన్నెలలు సాయంతన
నటన చటుల మహానట వికటాట్టహాస భాసంబుల కనుప్రాసంబులై,
పూర్వ పారావార పులిన తల విహరమాణై రావణ కర పుష్క రోద్ధూత
వాలుకా ధూళి పాళికలకుఁ బ్రత్యాదేశంబులై, యంధకార బలీంద్ర
నిర్బంధన ధురంధర సమయ మధుమథన చరణాంగుష్ఠ నిష్ఠ్యూత
గగన సరి దంబు పూరంబుల కనుబింబంబులై, చంద్రకాంత మణినిర్మిత
హర్మ్య హిమవన్మహీధర శృంగ పతితంబు లగుచుం బెను వెల్లువలు కట్టి,
యతివిషమ మానినీ మాన ప్రతీరంబు లురులం ద్రోయుచు, వియోగవేదనా
భరాక్రంద ద్రథాంగ కంఠ గుహా కుహర ముఖంబుల ముంపుకొని మెఱయుచు,
నరవిరి చెందొగ మొగడలం బడి సుడియుచుఁ, దను కరువలిం గదలు విరులం
దొరఁగు పుప్పొడి తిప్పలం బొరలి తెట్టువ గొంచుఁ, గనకడోలా విహార
లీలాయత్త మత్తకాశినీ కపోల ధాళధళ్యంబుల పెల్లునం గడలుకొని
యుప్పొంగుచుఁ, గటికి చీకఁటితరులం దెరలం జేయుచు, సకల భువనతలా
ప్లావనంబు గావించి, యజాండ కరండంబు వెండిజలపూఁత గావించిన
తెఱంగున నంగీకరించె; నప్పుడు తమయందు నెప్పుడెప్పుడు నింతురో యనుచు
నువ్విళ్ళూరు చందంబునఁ జంద్రికా కిరణ కందళికలం గరంగు రేవెలుంగు
ఱాచిప్పలం గప్పురంపుఁ గుప్పెలం గొప్పరించిన సరస మధు రసంబులు
నించి యించిన వేడ్కల నొండొరుల కెంజిగురాకుమోవి నంజలం జవి
గొనుచుఁ గ్రోలి సోలి పూఁజవికల బొంపిరివోవు కామినీ కాముకులును,
వలరాచకేలి సలుపునెడల నంగంబుల చక చకలు వెలివోవకుండ
నిండార లేపంబులు సేయు సొంపునఁ గర్పూర కస్తూరికా సంకుమద
మిళిత చందన పంకంబు లొకొళ్ళొకళ్ళ మేనులం గలయ నలందుకొని
చలువ చప్పరంబులం దీర్చిన పుప్పొడి తిన్నెల విశ్రమించు సతీపతులును,
బ్రోడలగు నెచ్చెలులు జీరాడుసిగ్గున నీడిగిలంబడ నెట్టకేలకుఁ ద్రోపు
త్రోపాడుచుం దార్చి కూర్చి మరలుటయు మరుం డొనర్పఁగల కోల్తలకుం
దివురు తమకపు ముంగలి పౌఁజులు నిగిడించు క్రొవ్వాఁడి తూపుల రూపున
నొండొరువుల మఱుపెట్టి చూచు నెలగోలు చూపుల నిత రేతర ధైర్యంబులు
గంటివడ నొంటిం బచ్చెన యోవరుల వసియించు వధూవరులును, బేరుకొను
కోరికలు దారుకొన డాయునెడం బొంగిన యంగంబులం బరస్పర బాహు
పాశంబుల బిగియారం గౌఁగిలించుకొని కరంగిన డెందంబుల రెంటి
నొక్కటిగ హత్తించు పోలిక నత్తమిల్లి పగలు తమపాసిన యెడలం బొడము
మనోజ వికారంబుల నవిరళతర కపోలంబుగాఁ జెప్పికొనుచు,
హంసతూలికా తల్పంబుల నల్పేతరానందంబులం బొరలు తరుణీ తరుణులును,
దొలుతటి పొలయలుక యెడం జనించిన వియోగ శిఖి నిండారు రేయెండ
వేఁడిమి నగ్గలించినం దాలిమి తెమలం దమక తాము తమకించి కలసికొని
నెచ్చెలుల\న్‌ బేలువెట్టి తొట్టిన వేడ్కలం బొదరిండ్ల కందువలం బొదలు
రమణీ రమణులును, మబ్బుకొను వయసు గుబ్బల నిబ్బరంబుగ నివుడు
తివుటులం బెచ్చుపెరుఁగుమచ్చరంబుల నొక రొకరి మెచ్చక
పచ్చ విలుతుండు విచ్చలవిడిం దనకైదువులు ముప్పది రెంటం దోడు సూపె
నన బహువిధ కరణాసన భేదంబులం బెనఁగుచు మణి సౌధంబులం
గ్రీడించు యువతీయువజనంబులును, గ్రిక్కిఱిసిన మక్కువల నిక్కువలఁ గమియుం
జొక్కులఁజెయ్వులఁ ద్రొక్కుడువడి రతిశాస్త్ర రహస్య తత్త్వానుభవంబున వెలి
మఱచిన వలరాచ తపసుల పోలికం దెలిఱాకట్టు నెలవులం బవ్వళించి
యున్న నాయికా నాయకులును, నెడపడని వేడుకపనుల నలసి జడియు
నవయవంబుల పై సొలయు నెమ్మనంబులతో నొయ్యనొయ్యనం గదలు
తూఁగుటుయ్యెలలం గన్ను మొగిచియున్న విలాసినీ విలాసులునుం గలిగి,
యన్నగరంబు శంబరాంతకు సామ్రాజ్యంబు ననుకరించె; నయ్యెడ
నయ్యదువల్లభుండు సత్యయుం దాను ననర్ఘ్యమణి దీపితంబును, విమల
దుకూల వితాన సందానితంబును, బ్రాలంబముక్తా గుళుచ్ఛ
చ్ఛవిచ్ఛాదిత వలభి విలసితంబును, వివిధ విచిత్ర పటఘటితస్ఫటికభిత్తిభాగ
భాసురంబును మృదులహంసతూలికాకల్పిత తల్ప సంఛన్న మణి మంచ కాంచితంబును,
ధవళ ఫణిలతాదళ క్రముకఖండ మండిత మరకతమణి భాజన విభ్రాజితంబును, మృగమద
మిళిత పటీర పంకాంకిత మౌక్తిక శుక్తి పరికల్పితంబును, దర వికచ లతాంత తాలవృంత
కాంతంబును, గోమల బిసతంతు సంతాన నిబద్ధ కుసుమదామ రమణీయంబును,
సురభి కృష్ణాగరు ధూప ధూపితంబును, పరిమళ మిళిత శిశిర సలిల
పూర్ణ కనక గళంతికా సమంచితంబును, మంజు గుంజ త్పారావత పతంగ
గళరవ భరితంబును, మాణిక్య సమున్నతాదర్శ దర్శనీయంబును నగు
శయనాగారంబున వినోదకేలిం దేలి నిద్రా ముద్రిత నేత్రుఁడై
శయనించె; నయ్యవసరంబున.
53
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )