కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. సమ్మర్ద క్షమ! ధీనిబంధన విధా సంక్రందనాచార్య! శూ
రమ్మన్యాచల వజ్రపాత! జగతీ రక్షాంబుజాక్షా! శర
ధ్యమ్మార్గస్థ దశాస్య రాజ్యసమ సహ్యప్రోద్భవా తీరభా
గుమ్మత్తూరి శివంసముద్రపుర వప్రోన్మూల నాడంబరా!
104
క. తిరుమల దేవీవల్లభ!
కరుణామయ హృదయ! రాజకంఠీరవ! యీ
శ్వర నరస భూపురందర
వరనందన; బాసదప్పవర గండాంకా!
105
స్రగ్విణీ. నాగమాం బాధిభూ నారసింహాత్మజా!
భోగలీలా పరాభూత సంక్రందనా!
త్యాగ విద్యా నిషద్యాయిత ప్రాభవా!
సాగరాంత క్షమా సంప దేకాస్పదా!
106
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార
సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక
గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన
పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ ద్వితీయాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )