కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణునకు మ్రొక్కి యాహ్వానించుట
చ. అమరవిభుండు దూరమున నంబుజనాభుని గాంచి సంభ్రమో
ద్గమమునఁ జేతియంకుశముఖంబునఁ గుంభము లూఁది కుంచితా
గ్రిమ చరణంబున న్మదకరి\న్‌ డిగి, యంసవిలంబి కల్పచే
లము నడుమ న్బిగించుచు, నిలా నిహితాత్మ శిరఃకిరీటుఁ డై.
4
చ. జడిగొని సమ్మదాశ్రుకణజాలము లొల్కఁగ, రోమహర్షముల్‌
బడిబడి మేనఁ బాదుకొన, భక్తి నివేశ తరంగితాత్ముఁడై
యడుగులమీఁద వ్రాలె దివిజాగ్రణి తత్కుశలంబు నెమ్మితో
నడిగెడురీతి మౌళి కుసుమాగత షట్పదపంక్తి మ్రోయఁగ\న్‌.
5
ఉ. ఆ దనుజాపహర్తయు భుజార్గళము ల్వెసఁ జాఁచి యంచితా
మోద వికాసవ న్నయన ముగ్ధ సరోరుహపంక్తిఁ బూజ ల
త్యాదరలీలఁ జేయు నమరాధిపుఁ గౌఁగిటజేర్చె నూతనాం
భోదము సానుమ చ్ఛిఖరము న్రభసంబునఁ గప్పుకైవడి\న్‌.
6
మ. అనలుం డంజలిసేసె, నంతకుఁడు సాష్టాంగంబు గావించె, మ్రొ
క్కె నిశాచారి, ప్రచేతసుండు దెలచెం, గేల్మోడ్చె సారంగవా
హనుఁ డర్థేశుఁడు వందనం బిడియె, నీహారాంశు కోటీరుఁడు\న్‌
వినతుం డయ్యె, యదుప్రవీరునకు నుద్వేల ప్రమోదంబున\న్‌.
7
శా. వారిం జూచి రథాంగపాణి సరస వ్యాహార లీలన్‌ దర
స్మేరాపాంగ విలోకన క్రియల సంప్రీతాత్ములం జేసి గో
త్రారీ! రమ్ము గజమ్ము నెక్కుమని నాగారాతిపై నెక్కెఁ దా
రా రంభాకర చామరానిలము మార్గశ్రాంతిఁ దూలింపఁగ\న్‌.
8
క. తక్కిన దిశానాథులు
నెక్కిరి నిజవాహనముల, నెసఁగె హుడుక్కా
ఢక్కా పటహ ధ్వానము
లక్కజముగఁ బొంగి నింగి యఱచిన భంగి\న్‌.
9
ఉ. ఆయెడ సిద్ధ కింపురుష యక్ష వసు ప్రముఖామరావళిం
బాయఁ దొలంగుమంచు శతమన్యుఁడు సందడివో బరాబరుల్‌
సేయఁగ నల్లనల్ల నతసీ కుసుమాసిత దేహుఁ డేఁగె వై
హాయసవీథి నారదముఖామర సంయమి కీర్తనీయుఁడై.
10
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )