కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
అప్సరసలు హర్మ్యము లెక్కి శ్రీకృష్ణుని దర్శించుట
ఉ. అప్పుడు శౌరిఁ జూచు ప్రమదాతిశయంబు హృదంతరంబులం
జిప్పిల సంభ్రమించి కయిసేయు తెఱం గయథాతథంబు గాఁ
గుప్పనఁగూరి యొండొరులఁ గూడఁగ నీక కడంగి వేలుపుం
గప్పురగందులెక్కిరి ధగద్ధగితోన్నత హర్మ్య రేఖల\న్‌.
11
చ. అలఁదిన చందనంబు వృథ యౌఁజెమరింపఁగ, సమ్మదాశ్రుల\న్‌
దొలఁచినయట్లు వోయెడుఁ గనుంగవ కాటుక, పేటు లెత్తుఁ జె
క్కుల మకరీవిలాసము గగుర్పొడువ, న్హరిఁ జూచువేళనో
చెలి! కయిసేయకమ్మ! యని చేడియ యొక్కతె పిల్చె నెచ్చెలి\న్‌.
12
చ. వనిత యొకర్తు మున్కొని గవాక్ష తలంబున నింతులుండుటం
గనుఁగొనఁ జోటు లేమి నొక కార్యముపేరిట బాలనోర్తు వం
చనఁ దొలఁగంగఁ బిల్చి రభసంబునఁ దత్సతిజాలకంబు చే
కొని హరిఁజూచెఁ గేకిసలు గొట్టుచు బోటులు దాని నవ్వఁగ\న్‌.
13
ఉ. కాళియభేదిఁ జూచు తమకంబున మజ్జన మాడియాడి నీ
లాలక యోర్తు గంధ సలిలార్ద్ర కచంబులు చన్నుదోయిపై
వ్రాలిన సందిటం బొదివి రాజపథంబున కేఁగుదెంచె గో
పాలకమూర్తిఁ గాన శిఖిబర్హము కానుక దెచ్చెనో! యన\న్‌.
14
ఉ. ఉన్నతసౌధ మెక్కి యనృతోదరి యొక్కతె పద్మనాభుఁ జూ
డ న్నిజదేహవల్లికఁ గడల్కొను సాత్త్వికలీలఁ జూచు నా
సన్న సఖీజనంబు గని సౌధశిఖా గమనశ్రమంబునం
గన్నియలార! మేన్బడలెఁ గంటిరె! నాకని బొంకె నేర్పున\న్‌.
15
ఉ. వేడుక నీకె కాని మఱి వేఱొక యింతికినైన లేదె? త్రో
పాడెదవేలె? మచ్చర మొకప్పుడు మానక పోయి తీవు, పె\న్‌
బ్రోడవు గాన నిన్నె కనుఁబో! యతఁ డెవ్వరిఁ జూడఁ డంచు నో
నాడె సపత్ని నొక్కతె మురారిఁ గనుంగొనువేళ నీసున\న్‌.
16
చ. అలికులవేణి యొక్కతె మురారిఁ గనుంగొని మ్రానుపాటు మై
నెలకొని యున్నచో సడలునీవిక లేఁజెమ రంటి నిల్చె నం
జలి పరిపూర్ణ లాజలను సాధ్వస కంపము దాన చల్లె న
చ్చెలువకు సాత్త్వికోదయము చేసిన మేలిఁకనేమి చెప్పుదు\న్‌.
17
క. మదవతి యొకతె పరాకునఁ
బదాంగదము కంకణముగఁ బాణిఁ దొడిగె న
య్యదువల్లభుఁ గనుగొనుచోఁ
దుది నదియును మేను వొంగి తుత్తుము రయ్యె\న్‌.
18
చ. దనుజవిరోధి మీఁద నొకతన్వి కరంబున లాజ లెత్తి చ
ల్లిన నెఱివేణి యీసున బలె న్విరిపూవులఁ జల్లెఁ, జల్లె లో
చనములు సమ్మదాశ్రువులఁ, జల్లె లలాటము ఘర్మబిందువుల్‌
చనుఁగవ చల్లె సంభ్రమవశ త్రుటితామల మౌక్తికాదుల\న్‌.
19
చ. జలరుహనేత్రుఁ గాంచి సరసత్వము మీఱఁగ నొక్క వేలుపుం
జిలుకలకొల్కి రాచిలుకచేఁ బిలిపించిన, సత్యభామ కా
కలికితెఱంగు శౌరి కడకన్నులసన్నలఁ జూపెఁ గోప కం
దళ కలుషాయి తాక్షి వలనంబుల నాసతి ద న్నదల్పఁగ\న్‌.
20
క. అనిమిషపుర జాలకములు
వనితా జనితా మయములు, వనితల హృదయం
బనురాగ రసమయం, బ
య్యనురాగము శౌరిమయము నయ్యెడ నయ్యె\న్‌.
21
చ. కనుఁగొన వేడ్కలం బొడము కాయ్వుల నచ్చర లీసడించుటల్‌
వినుచు దరస్మితం బొలయ వెన్నుఁడు రాజపథంబుదాఁటి య
య్యనిమిషనాథు గేహ బహిరంగణ భూస్థలి డిగ్గె వైనతే
యుని మణిచిత్ర వేత్రకర హుంకృతి దిక్కులు పిక్కటిల్లఁగ\న్‌.
22
క. ఆదరమున శతమన్యుఁడు
కైదండ యొసంగ యామకరి దాన ఝరీ
మేదుర కక్ష్యాత్రితయము
నా దనుజవిరోధి గడచి యటఁ జని యెదుట\న్‌.
23
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )