కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
అదితి హరి యవతారములను స్తుతించుట
క. మే నిమిరి శిరసు మూర్కొని
దానవపరిపంథి! యెంత ధన్యనొ! నియత
ధ్యానపరు లయిన మునులుం
గానని నినుఁ గంటి మంటి గతకల్మష నై.
26
ఉ. సర్గమొనర్తు బ్రహ్మయన, సత్కృపఁ బెంతు జనార్దనుండు నా,
భర్గుఁడనంగఁ గ్రమ్మఱఁగఁ బారణ సేయుదు విజ్జగంబు నై
సర్గికలీల నొక్కమఱి సౌఖ్యము నొందుదు, కేవలంబు దో
రర్గళ భూషణీకృత రథాంగ! నినుం గొనియాడ నేర్తునే!
27
ఉ. వాలముతాఁకున న్గిరులు వజ్రనిపాతము సంస్మరింపఁ, బె
న్వాలుగవై మహార్ణవమునం దొలుఁబల్కుల దొంగరక్కసు\న్‌
వాలిక వంక వాఁడిగఱి వ్రచ్చి వెస న్నిగమాలిఁ దమ్మిపూ
చూలికిఁ దెచ్చి యీవె! త్రిదశుల్గొనియాడ మురాసురాంతకా!
28
చ. సురనికరంబు రక్కసులుఁ జుట్టములై యమృతాభిలాష మం
దరగిరిఁ జిల్వరాచ తరిత్రాట బిగించి పయఃపయోధి ని
ర్భరగతిఁ ద్రచ్చుచో నడుగువట్టిన తద్గిరి నెత్తవే ఢులీ
పరివృఢమూర్తివై! కపట పద్మముఖీత్వ విమోహితాసురా!
29
క. విలయోల్బణ జలనిధి ప
ల్వలమున నిల మునుఁగ నేకలమవై దంష్ట్రాం
చలమునఁ దాల్పవె! నీ వా
బలిసద్మము దూఱి, భుజగ పర్యంక శయా!
30
చ. పెకలి యజాండ కర్పరము బీఁటలు వాఱఁగ మేనుపెంచి యా
మకరనికేత నోదర నిమగ్న మహీ మహిళాలలామఁగే
తక ముకుళాగ్ర సంగత మదభ్రమరీ సమరీతి గాఁగఁ గొ
మ్ముకొనఁ దగిల్చి యెత్తఁ గిటిమూర్తిని దాల్చితిగా జనార్దనా!
31
చ. సటలిట మానురోరి! హరి సర్వమయుం డటె యంచుఁ బట్టితోఁ
జిటచిట లాడి యిందుఁ గనఁజేయుము నీవని దైత్యుఁ డాడినం
బటపట ఱాతికంబ మిరువాయలుగా నరసింహమూర్తివై
కుటిల నఖాగ్ర కుంచికల గ్రువ్వవె! వానియురః కవాటము\న్‌.
32
మ. నను నాకశ్యపకామినీ మణులలోన న్ధన్యఁగాఁ జేయ మ
త్తనయ వాజ్యము దాల్చి వామనుని చందాన న్బలి న్మట్టవే!
ఘనమార్గోన్నమితాంఘ్రిపద్మమునకుం గంజాప్తుఁ డంశువ్రజం
బను కింజల్కపరంపర ల్మెఱయ నుద్య త్కర్ణికం బోలఁగ\న్‌.
33
మ. ఘన దోర్దండ నట త్కుఠారమున వీఁక న్రాజహంసాలిఁ దు
త్తునియ ల్సేసియుఁ గ్రౌంచరంధ్రమునఁ దోడ్తో రాజహంసాలి మే
దినికిం దెచ్చితి, కార్తవీర్య భుజపంక్తిం జక్కు గావించి తం
బునిధిం గ్రొత్తగ నాశ్రమంబునకు నిమ్ముంగొంటివీ వమ్మున\న్‌.
34
మ. అరవిందాననఁ గోలుపోయిన యవజ్ఞావాప్తిచే వీరవా
సర సైన్య ప్రకరంబు నేలి జలధి న్బంధించి లంకాపురీ
శ్వర కంఠాటవి నేర్చి, రౌప్యగిరి లజ్జాపంకముం గీర్తిని
ర్ఝర పూరంబులచేఁ దొలంచితిగదా! రామాభిధానంబున\న్‌.
35
చ. అలుకఁ బ్రలంబదానవుని ప్రాణము గొంటి, కళిందనందనా
సలిలభర ప్రవాహ రభసంబు మరల్చితి, పట్టిఁ బ్రోవ నాఁ
గలిమొన హస్తినాపురి పెకల్చితి కౌరవవీరు లెల్ల బె
గ్గిల, నల రేవతీరమణికిం బతి వై యదువంశమౌక్తికా!
36
మ. త్రిపుర స్త్రీలఁ బతివ్రతామణుల సారెం బుంశ్చలీ వర్తనం
బుపదేశిం బొనరించి బేల్పఱిచి వధ్యుల్గాని తద్భర్తల\న్‌
ద్విపచర్మాంబరు చూపు టింగలమున\న్‌ వే త్రోచి పాటింపవే!
కపట శ్రీజినరూపము\న్‌ భువనరక్షా జాగరూకేక్షణా!
37
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )