కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
శ్రీకృష్ణావతార విభూతి
గణసమక దండకము. యదుతిలక! జగత్త్రయీ నిర్మితి ప్రక్రియా కర్మఠేందిందిరోద్భాసి
నాభీసరః పద్మ! పద్మాసతీ పాదపీఠాకృతి ప్రస్ఫుర్తత్కౌస్తు
భాంకూరి తాళీకబాలాతప ద్యోత! పద్ద్యోతరంగి
ణ్యుదక్షాళి తైణాంక భృ త్పాంసుల క్లిష్ట వేల్ల జ్జటాజాల!
జాలంధరోడ్యాణ మూలాఖ్య బంధత్రయీ బంధ సంధుక్షితస్పర్శన
స్పర్శ నిర్గ్రంథిత గ్రంథిష ట్కాంత రోన్నిద్ర కద్రూసుత
శ్రీముఖజ్వాలవల్లీ పరిస్రంసమా ణేందు నిష్యంద సర్వాంగ
నిష్పంద యోగీంద్ర హృద్వే దికావాస! యీవాసవాదు ల్సరోజాసను\న్‌
మున్నుగాఁ జేసి 'సర్వంసహా భీరు భారంబుఁ బోఁ ద్రోయవే' యంచుఁ
బ్రార్థించిన న్దేవకీదేవి గర్భంబునం దుద్భవం బంది
బాహుద్వయ ద్వంద్వము న్నందక స్యందనాంగాబ్జ కౌమోదకీ శార్ఙ్గ
ముఖ్యాయుధ వ్రాతముం బీతకౌశేయము న్వత్స భాగంబున న్మించు
శ్రీవత్సముం జూపినం దల్లి భీతిల్లుచుం 'గావు కావంగదే!' యన్న
నీవంతలోఁ గావు కావంచు నేడ్పుల్ద లిర్పం గంసుంగందవై తండ్రియత్నంబున
న్నంద గోష్ఠంబునం దున్నచో వ్రేతయై చేఁతి పాల్గ్రోల్ప నేతెంచు
నా పూతనా భూత నారీ కుచం బగ్రహస్తంబునం బట్టి తత్ప్రాణ నిర్యాణ
శంఖంబు పూరించు చందంబునం గ్రుక్కలన్నొక్కి మక్కించియు, న్బండి
రాకాసిఁ గీలూడఁగాఁ దన్నియు, న్వెన్నవేమాఱు గొల్లాడఁగా గొల్ల
యిల్లాండ్రు నందారవిందాస్యతో ఱట్టుగావించిన న్నిక్కపుం బట్టివే!
యంచు నిన్బట్టిచట్రోలితోఁ గట్టిన న్దిట్టవై కిట్టి పెన్నుద్ది మద్దు
ల్వడంద్రోచియు న్శైశవంబు న్విడంబింపవే! లేఁగలు న్గోపబృందంబు
బృందావ నారణ్యవాటి న్వసింపం జలత్కాక పక్షంబుతో బర్హిబర్హావతంసంబుతో
మంజుగుంజాఫలోద్దామదామంబుతోఁ దానమానక్రియాశంసి వంశంబుతో
నేపుదీపించు నీప్రోవు వ్రేపాపలం గ్రేపుల న్వైపరీత్యంబుగాఁ బాపి
యాపద్మజుం డొక్కచో డాఁచిన న్వానిరూపంబు లీవై పునస్సృష్టి
నాస్రష్టగర్వంబు ఖరంబుగాఁ జేయవే! తోయ వేగోచ్చల ద్వీచికా
మర్దళ ధ్వాన మాగుబ్బుగా నుబ్బునం గేళిఁ గాళిందిలోఁ గాళియాహి
స్ఫటా రంగమధ్యంబునం దాండవం బాడవే? తోడి గోపాలక శ్రేణికిన్నీకు
జన్నంబుల న్మీఁదుగా నున్న యన్నంబులన్వంచి తాత్మేశలై పంచలం జల్దు
లందీ ముని స్త్రీలకు న్లీలఁ గైవల్యముం గొల్ల యీవే! పెనుంజిల్వయై బల్విడిం
జంగిలి న్మ్రింగు దైతేయు వాతన్వ డింజొచ్చి మై వెంచి తత్కాయము న్రెండువ్రాయ
ల్వడం జించి గోపంక్తిఁ బోషింపవే! గుంపులై యింపులం గూడి యాభీరు
లా దేవతానేతకు న్జాతరల్సేయ వారించి తత్పూజన ల్నీవు గైకొన్న
మేకొన్న పేరల్కతోఁ బుష్కలావర్త కాబ్దంబులం బంపఁగా నంపజాలంబుగాఁ
గొండలుర్లంగ వర్షించినం, గాందిశీకత్వముం బొందు నామందలం బ్రోవ
గోవర్ధనం బెత్తవే! మత్తవేదండ ముద్వృత్తి నెత్తమ్మిపూ వెత్తు రీతి
న్నిలింపానిశారిష్టదారిష్ట మాయా బలీవర్దముం బట్టి మర్దించితంచు
న్వడిన్‌ శూకలాశ్వాకృతిం డాసినం గేశి జీవానిలంబు ల్భుజా
దండశూకంబునం గ్రోలి నీ యౌవ నోద్య ద్భుజాగర్వముం జూపవే!
శరదభినవసాంద్ర, చంద్రప్రభాధౌత భాస్వత్కళిందాత్మజాసైక
తోత్సంగవీథిం ద్రిభంగ్యాకృతిన్నిల్చి యాకుంచిత భ్రూవిలాసంబుతో
మోము వామాంసముం జేరఁగా శోణ దంతచ్ఛదాంతంబున న్వేణునాళంబు
సంధించి రంధ్రాంతర న్యస్త హస్తాంగుళీపల్ల వాగ్రంబు లల్లాడ
మ్రోయించిన న్ముక్త రోమంథ నిష్పంద గోబృందము న్వ్యక్త
గోవర్ధనగ్రావ నిష్యందము న్మందమం దాంశుమన్నందనావేగముం
గందళన్నీర సారణ్య జీర్ణాగముంగాఁ గదంబించు తత్పంచ
మారావమున్వించు న య్యించువిల్కానికిం జిక్కి రాధాది గోపావరో
ధాంగన ల్డాసిన న్రాస సంక్రీడ మాయాసముల్లాసి వై సౌఖ్య
వారాశి నోలార్పవే! దర్పి తా శేష దోషాచ రాధీశ
దుస్సాధమై యున్న నీవిక్రమక్రీడ వీక్షింప నక్రూరుచే మామ
పిల్పించినం బోవుచోఁ ద్రోవ భావాతిగంబైన నీదివ్యరూపంబుఁ
జూపం బరిభ్రాంతుఁ డై యున్న మన్నింపవే! వాని నీవానిఁగా,
భోజభూజాని యుద్వేజనం బందఁ ద ద్రాజధానిం బ్రవేశించి
యేతెంచుచో ముందటం జందనాలేపము న్దర్శనంబిచ్చిన న్గుజ్జు
ప్రోయాలికి న్సజ్జకంబైన యందంబు నొందింపవే! యాగపూజార్చితంబైన
కోదండము\న్‌ ఖండఖండంబుగాఁ జేయుచుం దద్ధనుర్దండ రక్షాభటస్తోమ
మస్తంబులం బెల్లుగా డొల్లఁగా వ్రేయుచున్మల్ల గర్జా భుజాస్ఫాలనాభీలమై
యుల్లసడ్డిండి మారావ వాచాలమై నిగ్రహాయాత రక్షోభటోదగ్రమై
యున్న య య్యుగ్రసేనాత్మజాస్థానిఁ జొత్తేరఁ దత్తోరణక్షోణి నాధోరణుం
డుద్ధతింబైపయిం గొల్పినం బట్ట పేనుంగుఁ జెండాడి గండ స్రవ ద్దాన
పంకంబునం బుండ్రముం గుంభ నిర్ముక్త ముక్తావళిం గర్ణదామంబును\న్‌ గట్టి
రక్తంబునం బట్టె మైపూఁతయుం బ్రాఁతిగాఁ బూసి తద్దంతకాండంబు కేల
న్గదాదండమై యుండఁగా జెట్టివై గిట్టి చాణూరు జానూరువు
న్నూఱుమాఱు ల్వడిం ద్రిప్పి నీవప్పళింప న్భయభ్రాంతుఁడై పాఱ నుంకించు
న క్క్రించుఁ గంసుం ద్రిలోకీ నృశంసున్నియుద్ధక్రియా పద్ధతిం గిక్కెస
న్గొంతు క్రోల్నొక్కి మక్కించి నల్దిక్కుల\న్‌ దేవతా దుందుభి వ్రాత ధింధింధిమి
ధ్వాన గానస్వ నోత్కర్ష హర్షంబులం గల్పకద్రుప్రసూనాతివర్ణంబులం
బెల్లుగా నెల్లలోకంబు లుల్లాసముం బొందఁగా వాని రాజ్యంబునం బూజ్యుఁగా
నుగ్రసేనుం బ్రతిష్ఠాపితుం జేయవే! దుష్టు నష్టాదశాక్షౌహిణీ వాహినీ దుర్మదాంధు
న్జరాసంధు భీమాపదేశంబునం జేసి శాసించి కౌంతేయుచే రాజసూయంబు సేయించుచో
జాత్యసూయ న్భయం బేఁది చేది క్షమావల్లభుం డెంతయు\న్‌ ద్రుళ్ళునం బ్రల్లదం బాడినం
బళ్ళెరం బెత్తి చిత్రంబుగాఁ దచ్ఛిరః కర్తన ప్రౌఢివర్తించి ధాత్రి న్వృథా
వాసుదేవ ప్రథాఛండ శౌండీరు నప్పౌండ్రుఁ జక్రాహతిం జక్కుగాఁజేసి
యీశానుఁ బోర న్మహాసేన నాగాననవ్యూహ సన్నాహము ల్వీడ వెన్నాడి
బాణాసుర స్ఫార బాహాసహస్రచ్ఛిదాకేళిమై వాని వారించి లోకంబుఁ
బాలింపవే! ఘోర భౌమాసుర గ్రామణీ శిక్షకా! కౌర వాకర్షిత
ద్రౌపదీమాన సంరక్షకా! భేద సందగ్ధ సాందీపసూను ప్రదా!
వేదశాఖా శిఖాంచత్ప్రవాళత్పదా! మాధవా! సత్యభామాధవా!
38
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )