కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు వైజయంతమున విడియుట
చ. అని కొనియాడి విశ్వ భువనైక ధురంధర! నేఁడు రేపు నీ
వనితయు నీవు నిచ్చట నవశ్యము మజ్జన భోజనాది పూ
జనములు గైకొన న్వలయు సమ్మతిమై నని పల్క, దేవతా
జననికి మ్రొక్కి యియ్యకొని జంభవిరోధి మొగంబుఁ జూచిన\న్‌.
39
చ. అమరవిభుండు సేరి వినయానతుఁ డై విడిపట్టు వైజయం
తమునను జిత్తగింపు మన నవ్వుచుఁ ద ద్బలదైత్యవైరి హ
స్తముఁ గయిదండ కొంచు గిరిశ ప్రముఖాఖిల లోకపాలకుల్‌
క్రమమునఁ జేరి కొల్వఁజని కాంచెఁదదుజ్జ్వల సౌధరాజము\న్‌.
40
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )