కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
వైజయంత రామణీయకము
వ. అదియును నామరసరి దుపహృత హేమ తామరస స్తోమ తోరణ దామ
రామణీయక సూచిత సౌదామినీ విలసితంబును, గనత్కనక కింకిణీ
కుల సంకుల క్వాణ ముగ్ధమధు రాలాపనృత్య న్నిజాపత్యమూర్త్యావహ
పార్శ్వ ప్రవర్తమాన విమాన సంతానంబును, నర్థిజనాభిమత
దానార్థ సంగ్రహ సంశయాపాది సమస్త వస్తుప్రతిబింబ సంభావిత
శేఖరీకృత చింతారత్నంబును, నక్షీణ సహస్రాక్షమణి గవాక్షావళీ
సాక్షాత్కృత నాకలక్ష్మీకటాక్ష వీక్షా విశేషంబును, ననర్ఘమణిస్తంభ
ప్రతిబింబిత నృత్య దప్సర స్సహస్ర ప్రదర్శ్యమాన లాస్యావలోకన
సారస్యాగత గృహ దేవతాశత సన్నిధానంబును, పులోమ నముచి
జంభ పాక వృత్ర బలప్రముఖ దైత్య విధ్వంసన సన్నద్ధ శతమన్యు
జన్య సన్నాహానుకారి చిత్రకర్మ విచిత్రిత భిత్తి భాగభాసురంబును,
వళిత రుచిర రుచి నిరంతర స్ఫాటిక కూటాంతర విశ్రాం తైరావ
తోచ్చైశ్శ్రవ స్సూచ్యమాన క్షీరసాగర స్నానక్రమంబును, దరంగిత
మణి భృంగారక వీటికాకరండ తాలవృంత చామర దర్పణ కళాచికా
పాదు కాది పరికర ప్రపంచ సంచిత కరాంచల విశ్వకర్మ నిర్మిత
కాంచనమయ యంత్రపాంచాలికా సంచయ వంచిత పరమార్థ పరిచారికా
సార్థంబును, నిరంతర సంతా నానోకహ దుకూలమయ పతాకా శతాకారి
తాకాశగంగా చటులతర తరం గావతరణంబును, సమంతత స్తంతన్యమాన
తోయకర్మాంతిక నిర్ముక్త మందారవిటపి మకరంద గంధ సలిల సేకాతిరేక
శీతల మణివేదికా ప్రదేశంబును, బహిర్ద్వార వితర్దికా ప్రకోష్ఠ
ప్రతిష్ఠాపి తాష్టాపద ఖట్వాస్తీర్ణ హరిచందన సాల బాలపల్ల
వోల్లసిత సంధ్యారాగ సంధానంబును, నవిరళ కల్పప్రసవ రజఃపటల
పటవాస పాంసువాసిత కౌశేయ వితానపటీ ప్రకటీకృత చంద్రాతప
పరిపాటికంబు నగుచుఁ, జతురతర శచీ కరవిరచితంబులై మణి
కుట్టిమ తల ప్రతిబింబిత తారకా కుటుంబంబుల విడంబించు పారిజాత
కుసుమోప హారంబుల వలనను, స్వాహా బాహాంచ లావాహితంబులై
మహారజత పాత్రంబులఁ జిత్రంబులుగా వెలుంగు నారాత్రికా దీపకళికల
వలనను, యమకామినీ ధూమోద్గూర్ణాతీర్ణంబులై విస్తీర్ణంబుగా నెగయు
మలయజ కాలాగురు ధూప ధోరణుల వలనను, యాతుధా నావరోధ వధూ
విధీయమానంబులై విలసిల్లు గృహప్రవేశ సమయ సముచిత బలివిధాన
సంవిధానంబుల వలనను, బాశధర మత్తకాశినీ సూత్రితంబులై విలోకపాత్రంబులగు
లలిత ప్రవాళ లతా చందనమాలికల వలనను, బవమాన మానవతీ
నియుక్తంబులై బాలికా జనంబుల కరతలంబులం బరిభ్రమించు కర్పూర
తాలవృంతంబుల వలనను, నరధర్మ సధర్మిణీ నిర్మితంబు లగు నిధాన
కల్పిత శంఖ పద్మ మక రాకార రంగవల్లీమతల్లికలవలనను,
నయనోత్సవం బావహిలం బ్రవేశించి వాసవ వహ్ని వైవస్వత
వాసతేయీచరణ వరుణ వాయు వసువల్లభ వాసుదేవుల వరుసన వీడ్కొల్పి
సత్యభామాసహితుండై యథోచిత కృత్యంబు లాచరించి యనంతరంబ.
41
శా. ఆ రామ ప్రియసోదరుం డపుడు దివ్యారామ మంభోరుహా
క్షీ! రమ్యం బదె చూతమే! యా ఘృతాచీ మేనకా మంజుఘో
షా రంభా హరిణీ ముఖ త్రిదివ యోషారత్నము ల్గొల్చి రా
నారూఢోత్సవ చిత్తుఁ డై గగనకుల్యా తీరదేశంబున\న్‌.
42
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )