కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
నందనోద్యాన సౌందర్యము
క. చందన హరిచందన మక
రంద సరి ద్బిందుశీకర ప్రమద వనేం
దిందిర పక్ష స్పందన
కందళిత మరు త్కిశోరకంబులు వొలయ\న్‌.
43
సీ. రంభా మహోరోజ కుంభ పరీరంభ - కుసుమిత ప్రత్యగ్ర కురవకంబు,
మంజుఘోషా వక్త్రకంజాత చకచక - స్తబకిత చంపక క్ష్మారుహంబు,
హరిణీ ముఖప్రసూ నాస వార్పణ కోర - కిత లతావేల్లిత కేసరంబు,
నుర్వశీ నవ యావ కోజ్జ్వ లాంఘ్రినివేశ - పుష్పిత కంకేళిభూరుహంబు,
 
తే. మేనకామోద నిశ్వాస మృదు సమీర
కుట్మలిత సింధువారంబు కుధర ధరుఁడు
ప్రేయసియుఁ దాను నల్లన డాయఁ జనియె
దైవతాధీశ నందనోద్యానసీమ.
44
మ. మహిభృద్భేదివనాంతసీమమునఁ బద్మాజాని సత్యావధూ
సహితుండై యనిమేష వారవనితా సందోహము ల్గొల్వఁగా
విహరింపం జనుదెంచినాఁ డనుచు సేవింపంగ వర్షా శర
న్మిహికా శీత వసంత ఘర్మఋతువుల్నిండెం దదుద్యానము\న్‌.
45
సీ. కనుపట్టె నొకచోట ఘనఘనా ఘనరంగ - విద్యు న్నటీ నాట్యవిలసనములు,
చూపట్టె నొకచాయ వాపికా జలజాత - జాల వాచాల హంసవ్రజంబు,
తలచూపె నొకవంక దరదళ త్సేవంతి - కా గంధి నీహారకణ భరములు,
పొడచూపె నొకచక్కిఁ బుష్పిత ఫలినీ ల - వంగ వాసిత శైత్యవైభవములు,
 
తే. నెఱసె నొకయెడఁ దామ్రపర్ణీ జలార్ద్ర
చందనాచల పవమాన కందళములు,
మొనసె నొకకడ సామి సంఫుల్ల మల్లి
పాటలీ చంపకోత్పల ప్రౌఢిమములు.
46
క. మలయానిల సంగతిఁ జూ
తలతిక లంకూరజాల దౌహృదవతు లై
యలయిక సడలించిన సొ
మ్ముల కైవడిఁ బాండుపత్రములు వెస జాఱె\న్‌.
47
క. గురివెందఁ జైత్రుఁ డొందఁగఁ
గర మలుక న్మావి యవుడు కఱచినఁ నును వా
తెరమీఁదఁ గాననగు పలు
వరుస యన న్ననలు పల్లవముపై మొనసె\న్‌.
48
క. తలిరాకు గుత్తిఁ దమిఁ గో
యిల చంచునఁ జించి క్రోల్చె నీరీతి వియో
గుల గుండియ లవియింపుదు
బలువిడి నని మరుని యెదుటఁ బచరించె నన\న్‌.
49
చ. మలయ సమీరణ చ్యుత సమంచిత పాండు పలాశ లైనపా
దుల నునుసోగ తీఁగలు యదుప్రభునిం దలపించె బాలచా
పల హృత తీరవస్త్ర లయి పంకరుహాకర మధ్యసీమల\న్‌
నిలిచిన ముగ్ధ గోపరమణీ రమణీయ విలాసరేఖల\న్‌.
50
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )