కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఎండవేడిమి
మ. అనుచుం గాంతలు వల్లికా రచిత డోలాందోళన ప్రక్రియం
గనకాంభోరుహ కర్ణికా హృతిఁ బరాగ క్షేప లీలాగతి
న్వనకేళి పరతంత్ర వృత్తి దిరుగ న్మార్తాండ బింబంబు ని
ల్చె నభోమధ్యమునం గఠోర కిరణ శ్రేణీ దురాలోకమై.
17
చ. వదలిన నీవిబంధముల, వాడినమోముల, జాఱుకొప్పులం
జెదరిన పత్రభంగములఁ, జిక్కులుగొన్న మణీసరంబులం
బొదలిన యూర్పుఁ దెమ్మెరలఁ, బుప్పొడిఁ గెంపగు వాలుఁ గన్నులం
ద్రిదశ మృగాయతాక్షులు రతిశ్రమ ఖిన్నలఁ బోలి రందఱు\న్‌.
18
క. బెడిద మగు నెండసోఁకునఁ
దొడిమలు వసివాడి ననలు దొరఁగె లతల నె
ల్లెడ వనదేవతమేనం
బొడమిన లేఁ గమ్మఁ జెమటబొట్టు లనంగ\న్‌.
19
శా. తూఁగెం జల్లనిగాడ్పులేమి ఫణిసందోహంబు పేరాఁకట\న్‌,
లోఁగెం దప్త సరోజ శీథురసముల్గ్రోల న్మదాళిచ్ఛటల్‌,
గ్రాఁగె న్నీఱుగఁ గాంచనాచల తటీ గండోపల వ్రాతము
ల్డాఁగె న్బల్వల పంకసీమ బకజాల త్రస్తపాఠీనముల్‌.
20
చ. కనుఁగవ మ్రాన్పడంగ, నెఱక ల్విరియంబడ, బోర మోప నెం
డిన వదనంబులం దెఱచి, నిక్కిన యఱ్ఱులు తల్లడించుటల్‌
గనఁబడ, నూరుపు ల్దళముగా నిగుడ న్వడఁ గుంది యీరెలుం
గునఁ దమవానిఁ బిల్చుచు శకుంతము లయ్యెడ నిల్చె మ్రాఁకుల\న్‌.
21
చ. ఒకయెడఁ జక్రవాకము పయోరుహమిత్రుని వేడియెండచేఁ
దెకతెకఁ గ్రాఁగు తమ్మివిరి తేనియ ఱెక్కలఁ జల్లనార్చి కాం
తకుఁ దనివార నిచ్చెఁ బరితాపము వాయ మృణాళ వల్లరీ
శకలము మాటికిం గమిచి చంచుపుటంబున నంది యిచ్చుచు\న్‌.
22
తే. ఆతప గ్లాని బడలిన యభ్రమువును
నిజ కరాగ్ర జలంబుల నెఱయఁజల్లి
శ్రవణయుగ తాలవృంత సంజాత శీత
వాతములఁ దేర్చె గీర్వాణ వారణంబు.
23
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )