కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
సత్యాకృష్ణుల జలకేళి
క. అపుడు జగత్పతి సత్యా
చపలాక్షియుఁ దాను వెడలె జలకేలికి న
య్యుపవన తరు కుసుమ లతా
తపత్రములు పూని వేల్పుఁ దరుణులు గొల్వ\న్‌.
24
చ. చనుఁగవ వ్రేఁకము\న్‌ జఘనచక్ర భరంబును మోవ లేక మొ
య్యనఁ బదపంకజంబు లలసాలస వైఖరి మార్చుచు\న్‌ జనా
ర్దను భుజ మూఁతఁగాఁగ వనితామణి యేఁగెఁ బరస్ప రాంగమే
శనమున రోమహర్ష ముకుళవ్రజ మొండొరు మేన నిండఁగ\న్‌.
25
చ. ఇనకర తాప వేదన సహింపఁగ లేక నిజోదకంబుల\న్‌
మునిఁగి వినీలకుంతల సమూహము నారఁగ విచ్చె నాఁగ వీ
చి నికర చాలనం దరులఁ జేరిన జొంపపు నాఁచుఁదీఁగలం
దనరు నభోనదిం గనియె దానవలోక విరోధి యత్తఱి\న్‌.
26
తే. కాంచి చేరంగఁ జని మధుకైటభారి
రత్నసోపాన కలిత మార్గముల డిగ్గి
కులసతియుఁ దాను వేలుపుఁగొలను దఱిసె
నొండొరుల కేలుఁదమ్ముల నూఁతఁ గొనుచు.
27
చ. తొడవులు పుచ్చి నిర్జరవధూటులు వేలుపుమ్రాని చీనిపా
వడలు ధరించి దేహరుచి వైభవము ల్నవమల్లికా రుచిం
దొడర నితంబ చక్రములతో నెఱి వాలు మెఱుంగుఁ గప్పుఁ బె\న్‌
జడ లొరయంగఁ దద్గగన శైవలినిం దగఁ జొచ్చి రందఱు\న్‌.
28
మ. మరు దంభోరుహనేత్ర లంబర ధునీ మధ్యంబున న్నిల్వ, ని
ష్ఠుర తత్పీనపయోధ రాహతి జలస్తోమంబు నల్వంకలం
దెరల న్నాభిచయంబు లోఁ గొనియె దానిం జాల గాంభీర్యశీ
లురు సంక్షోభమునొందువారి నెచట\న్‌ లోఁగొంచు వర్తింపరే!
29
చ. ఘన కుచకుంభము ల్బయలుగా విబుధాలయ వారభామినీ
జన కరిణీ సమూహములు సల్లె యదూద్వహ కుంజరంబుపై
వనజవనీ పరాగ పరివాసిత మైన నభస్తరంగిణీ
ఘనతర భంగ తోయ కణికా చయముల్గరపుష్కరంబుల\న్‌.
30
క. వారణయానలు కరముల
నీ రడిచిన రవము మురజ నిస్వనముగఁ జె
న్నారఁగఁ బద్మిను లాడెను
వారిజ హస్తముల మధుప వలయము లులియ\న్‌.
31
క. ప్రోడతనంబులు మీఱఁగఁ
జేడియ లడుగులును మొగముఁ జేతులు మెఱయ\న్‌
వేడుక నీఁదఁగ నపు డా
మ్రేడిత జలజాత మయ్యె మిన్నే ఱెల్ల\న్‌.
32
తే. తామరల వ్రేటులాడుచోఁ దరుణు లెత్తు
కరరుహాంకిత బాహు వల్లరులు వొలిచె
బిరుద వర్ణావళీ పరిస్ఫురిత మైన
పల్లవాస్త్ర జయస్తంభ పటలి యనఁగ.
33
చ. దానవవైరి దివ్యవనితా నికురంబముతోడ జహ్నుక
న్యా నవపంకజాత నివహంబులఁ గందుకకేళి సల్పుచు
న్మేనఁ దదబ్జపత్రములు నిండఁగ నంటిన నొప్పు నెంతయు
దాను నుపేంద్రుఁ డౌట నయనంబులు పెక్కులు దాల్చెనో యన\న్‌.
34
తే. తన మనోవల్లభుని భుజా స్తంభ మూఁది
సలిలవిహరణ మొనరించె సత్యభామ
యలసవైఖరి వీచి డోలాంతరా వి
హార సంగత నవరాజహంసి యనఁగ.
35
క. అవతంసిత శైవల యై
వివల ద్వేణియయి, కోక విస్ఫుటకుచ యై,
దివిష న్నది నాకపురీ
ధవళాక్షులలోన నన్యతమ యనఁ బొల్చె\న్‌.
36
చ. పెరిఁగిన హారరత్నముల పెల్లున నొక్కెడఁ దామ్రపర్ణి యై,
నెరసిన సోగపెన్నెఱుల నిగ్గున నొక్కెడ భానుకన్య యై,
గురుకుచ కుంభ లిప్త నవకుంకుమ నొక్కెడ శోణ యై, నభ
శ్చర నది యొప్పె దివ్య జలజాతముఖు ల్జలకేళి సల్పఁగ\న్‌.
37
చ. అలకలు నాసికామణియు నన్నువకౌనుఁ గుచద్వయంబుఁ గుం
డలములుఁ జంచలింప జతనంబున హస్తము లూఁది జీర్కుబం
డల దిగజాఱి రొండొరుకడం దరలాక్షులు దోనివింటఁ బిం
జలు గొన నేయు పుష్పశరు సంపెఁగ వాలిక తూపులో యన\న్‌.
38
మ. బలివిధ్వంసియుఁ బెక్కుభంగులు మరుత్పద్మాకరాంతంబున\న్‌
సలిలక్రీడ యొనర్చి నిర్భర మద స్తంబేరమ ప్రక్రియ\న్‌
వెలలె న్సత్యయుఁ దాను మజ్జనవిధా విభ్రాంత కౌటిల్య కుం
తల సంక్రాంత నితంబలై దివిజ కాంతారత్నము ల్గొల్వఁగ\న్‌.
39
తే. నెఱుల తడి యార్చి క్రొవ్విరు ల్దుఱిమి మేనఁ
గలపము లలంది తొడవు లంగములఁ బూని
కల్పవృక్ష దుకూలాంశుకములు గట్టి
రంగనలు మారు నొఱతోడి యలుఁగు లనఁగ.
40
చ. జలరుహపత్రనేత్రుఁడును, సత్యయుఁ దాను ననర్ఘ దివ్యభూ
షలు ధరియించి నిర్జర నిశాకరబింబముఖు ల్భజింపఁ ద
ద్బల పరిపంథి బాహుపరిపాలిత మైన పురంబు సొచ్చె ని
శ్చలతర నేత్ర పౌరజన సంతతి హర్మ్యము లెక్కి చూడఁగ\న్‌.
41
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )