కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
శ్రీకృష్ణుఁడు పారిజాత వృక్షమును గొని పోవుట
క. హరి యపుడు పారిజాతా
హరణోద్యోగమున నందనారామము ని
ర్భరగతిఁ జొచ్చె విహగవర
పరివృఢుపై నెక్కి సత్యభామయుఁ దాను\న్‌.
50
చ. సకల సురైక వంద్యుఁడగు చక్రధరుం డిదె నేఁడు దన్ను ను
ర్వికిఁ గొనిపోవ వచ్చెనని వెక్కసమైన మనః ప్రభూత కౌ
తుకమునఁ బోలె సంభ్రమముతో నటియించె నభీష్ట వస్తుదా
యక తరుచక్రవర్తి యపు డాతత వాత విధూత శాఖమై.
51
క. సౌరి యిదె పారిజాతముఁ
గోరికఁ గొని చనుచు మనలఁ గొనిపోఁడని లోఁ
గూరిన నెవ్వగఁ దక్కిన
భూరుహములు మధు రసాశ్రు పూరము నించె\న్‌.
52
మ. సురలోకాభిమత ప్రదాన సమతాసూయ న్బలెం గంస ఘ
స్మరుఁ డత్యుద్ధతిఁ బారిజాతధరణీజాతంబు గోవర్ధనో
ద్ధరణ ప్రస్తుతమైన హస్తమున నుత్పాటించి లీలాగతి\న్‌
గరుడ స్కంధముమీఁద నిల్పె, నిలిపెం గౌతూహలం బింతికి\న్‌.
53
చ. జలరుహనాభుఁ డిట్లు రభసంబున నందనపారిజాతముం
బలిమిఁ బెకల్చి యెత్త విటపంబుల వ్రేలు దుకూల పల్లవం
బులు వడిఁ బట్టి యీడ్చుఁ గొనిపోవఁగనీక పెనంగులీలఁ గ
ల్పలతిక లెల్ల వల్లభలు ప్రాణవిభుం బెడఁబాయ నేర్తురే!
54
చ. గరుడుని ఱెక్కలం బొడము గాడ్పుల సోఁకునఁ దక్కు వేలుపుం
దరువులుఁ బెల్లగిల్లి గగనంబునఁ దోడన వెంటనంటి రా
నరిగెడు పారిజాత మహిజా హరణ వ్యసనైకలోలు నా
హరిఁ గని యడ్డమై పలికి రచ్చటి నందనపాలు రందఱు\న్‌.
55
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )