కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
సత్యభామ ప్రగల్భోక్తులు
ఉ. నా విని సత్యభామ వదనంబున లేనగ వంకురింప, నే
మే వచియింపఁ బూను హృదయేశ్వరునిం గనుసంజ్ఞ మాన్చి, చ
న్గ్రేవల జాఱుకొంగు సవరించుచు, వీడినకొప్పుఁ బల్మఱుం
జే వెడ దోఁపుచుం, బలికెఁ జెందొవచూపులు క్రేళ్ళుదాఁటగ\న్‌.
58
సీ. వినుఁడు! సురేశ్వరు వనపాలకులు! వార్ధిఁ - బొడమిన యీ దివ్యభూరుహమున
కింద్రాణి యెవ్వతె? యింద్రుండు నెవ్వఁడు? - తోడి యిందిరను గౌస్తుభము నెవ్వఁ
డధిపుఁ డై ధరియించె నతఁడె చేకొనుఁగాక - తెకతేర యిది యేమి యొకరి సొమ్మె?
యిదె నాదు విభునిచే నీవదాన్య నగంబు - నొడియించుకొని యేఁగుచున్న దానఁ
 
తే. బలుకు లేటికిఁ, దా వీరపత్ని యేని
మీ శచీదేవి తనదుప్రాణేశుఁ డైన
మఘవు నిటఁ బంపి సత్యభామావిధేయు
వలన మరలంగఁ గొనుటె పో వాసితనము.
59
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )