కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
అమృతాంధసుల వీరావేశము
వ. అత్తఱిం దత్తఱంబున దత్తడులం బల్లింపకయ నెప్పరంబున నెక్కంబోవువారును,
గృష్ణుండు కృష్ణుండని పౌనఃపున్యంబుగాఁ బలుకుచు నేమేమి యెక్కడెక్కడ
నని యడుగువారికిఁ దెలివిపడ నుడువం దడవు లేక పారిజాతంబు పారిజాతం
బని పలుకుచు రణసంభ్రమంబునం బరిభ్రమించువారును, గణయ కంపణ ముసల
ముద్గర పరిఘ పరశ్వథంబు లనియెడు బహువిధ ప్రహరణాహరణ విపర్యాసంబున
శస్త్రశాలాంతరంబునం గలహించు వారును, మరుదధిప మలినపథ
మహిషరథ మాంసాశన మకరాకరేశ మాతరిశ్వ మనుష్య ధర్మ
మహేశ్వరులకు మానవుం డీ డగునే యనువారును, గత్తు లంకించువారును,
రిత్త జంకించు వారును, సంగడీలం జీరువారును, సంగరభీరులం గేరువారును,
వాహనంబులఁ దఱుమువారును, సాహసంబుల నఱుమువారును నై వీరావేశంబున
రాజద్వారంబునం దొట్టి రయ్యవసరంబున,
67
తే. గళిత శృంఖల లయ్యు నకాలనిద్ర
గనుఁగవలఁ గ్రాలఁ దమయంతఁ గదల వయ్యె
దారు ణాధోరణ ప్రయత్నమునఁ గాని
నముచిమథనుని వీట శుండాల ఘటలు.
68
క. పొరిఁబొరి నెగయుచు మ్రొగ్గుచు
దరణీస్థలిఁ బొరలఁబడుచుఁ దలకొని శిక్షం
బొరసిన వయ్యు హయంబులు
భరియింపవు కొంతతడవు పల్యాణంబుల్‌.
69
ఉ. డాసి పురో హరిన్మణి విటంకమునం దన మేని నీడ ను
ల్కా సమదృష్టిఁ జూచి కినుకం బ్రతివీరుఁడ టంచు వ్రేసి బా
హాసి విభిన్నమై పడఁ దదర్ధముఁ జేకొని వచ్చెఁ గల్పవృ
క్షాసవ పానమత్తుఁ డమృతాంధసుఁ డొక్కఁడు జన్య కేలికి\న్‌.
70
తే. కారణము లేక యూరకె నారి తెగిన
విడిచిపెట్టక రణ రసావేశ మొదవఁ
బట్టి కోదండదండంబు పరిఘ గాఁగ
విసరుచు వచ్చె వేఱొండు వేల్పుజోదు.
71
క. గొనయంబు నెంత ద్రోచిన
గనయంబున కెక్కకున్నఁ గ్రమ్మిన తమకం
బున విల్లు విడిచి వేఱొక
యనిమిషభటుఁ డనికి వెడలె నడిదముఁ గొనుచు\న్‌.
72
ఉ. పట్టఁ దలంచెనేని కరపద్మయుగంబు వశంబు గాక లోఁ
బుట్టిన బాష్ప గద్గదికఁ బోకు మనం బలు కెత్త లేక పైఁ
జుట్టిన నెయ్యపుం బదను చూపులచే సతి వెంట నంటి త
న్బట్టఁగఁబట్టఁగా నొక సుపర్వుఁడు వచ్చె రణాభిలాషి యై.
73
క. సురవీరుఁ డొకఁడు సతిచే
దురమునకు ననుజ్ఞ వేఁడి తొల్లిటి యలుకం
జిరకాల దుర్లభం బగు
పరిరంభము గాంచి వెడలెఁ బ్రమదం బెసఁగ\న్‌.
74
చ. నను ననిసేయఁ బంపు ఖగనాథుని సోగ పసిండిఱెక్కలు
క్కునఁగొని కర్ణపూరమునకు న్రభసంబునఁ దెత్తు నేను నీ
కని తన కడ్డమై నిలుచు నచ్చరతొయ్యలి నూఱడించి పో
రున కరుదెంచె వేల్పుఁగొమరుం డొకరుం డురు దండ హస్తుఁడై!
75
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )