కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ముప్పది మూడు కోటుల దేవతలు యుద్ధమునకు వెడలుట
చ. హరిహయుఁ డాహరిం గెలుచు నాసయు మోసమునాక యీ గతిం
బురి వెడలంగ నవ్విభునిమ్రోల మరు ద్వసు విశ్వ రుద్ర భా
స్వర తుషి తాదిక త్రిదశవర్గము ముప్పదిమూఁడుకోటు లు
ద్ధురగతి నేఁగుదెంచె రణధూర్వహ గర్వము లుల్లసిల్లఁగ\న్‌.
87
శా. అర్వారోహణ చాతురీ విలస నాహంకార దుర్వారత
న్సర్వాంగీణములైన మైమెఱువులు న్జంచత్కృపాణంబులు\న్‌
గర్వాలాప విడంబము ల్మెఱయ జోకం జిత్రసేనాది గం
ధర్వు ల్వజ్రికిఁ దోడుసూపిరి పురద్వార ప్రదేశంబున\న్‌.
88
ఉ. హేమధరాధరంబు చలియింప వెస\న్‌ బహుకోటిసంఖ్యలై
యామరసైన్యము ల్నడచునప్పు డనంత సితోష్ణవారణ
స్తోమ నిరోధ మందియును దోడనె దిక్కులుగప్పె నయ్యెడం
జామర వాయు నున్నములు సాంద్ర హిరణ్మయ భూపరాగముల్‌.
89
ఉ. దారుణభంగి నొండొకటి దాఁకెడు నస్త్రముఖంబుల న్ఘణా
త్కారము లుప్పతిల్ల బెడిదంబుగఁ బుట్టిన సందడిం బుర
ద్వారము నిర్గమించె సురవల్లభు సేనలు భర్గ జూట కాం
తార ముఖంబున న్వెడలు దైవత సింధు ఝరంబులో యన\న్‌.
90
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )