కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
శ్రీకృష్ణుఁ డమరగణముల నుగ్గునూచము సేయుట
వ. మఱియు నమ్మధుమథను సముద్దండ దోర్దండ మండలీకృత శార్ఙ్గ
కోదండ నిర్ముక్త నిర్భర క్రూర నారాచ ధారానిపాతంబున
గవాక్షితవక్షు లగు యక్షులును, జక్ర నిర్వక్ర విక్రమ క్రీడలం
బరిచ్ఛిన్న కర్ణ నాసాధరు లగు విద్యాధరులును, గౌమోదకీ
ప్రహరంబులం జూర్ణీకృత శిరోమధ్యులగు సాధ్యులును, నంద
కాసిధారా విదారణంబునం బ్రత్యవయన శిథిలితానువిద్ధులగు
సిద్ధులును, బతంగ పుంగవ పక్షవిక్షేప ణాహతిం దూలి జర్జరులగు
నిర్జరులును, ధైర్యంబులతోడన కంకటంబులు వ్రస్సినం జులుకఁదనంబు
నొంది సాధ్వసోద్రేకంబున భద్రదంతావళంబుల డిగ్గ నుఱికి
మేరుశిఖరంబులు వ్రాఁకియు, రథ్య సారథి సహితంబుగా
శతాంగంబులు పొడిపొడియైనం జొర మఱు వెఱుంగక మాతంగ
శవంబుల క్రింద నీఁగియు, భగ్నచరణంబులై తలకెడవుగం
ద్రెళ్ళిన తురంగ కళేబరంబులం గౌఁగిలించుకొని నిర్జీవులుం
బోలె గ్రుక్కు మిక్కనక పక్కెరలు పైఁ ద్రోచుకొనియును, సంత్యక్త
హేతి వర్గంబును సర్వతః ప్రధావన మార్గంబును, బ్రవర్తిత
ప్రార్థ నాలాపంబును బరిధూయమాన కేశ కలాపంబునుం గాఁ,
గాందిశీకత్వంబు నొంది తిరుగుడువడి పాంచజన్య ఘోషంబు
మున్నుగా దిగంతంబు లంటం బఱచుటయుఁ, బ్రహార మూర్ఛా
పరవశులగు జయంత నలకూబర చిత్రసేనాదులం గనక
కమలదళపుటానీయ మానంబులగు నభ్ర గంగా పానీయంబుల
సేదదేర్చి ఫలకగర్భంబులకుం దార్చి నిజ నివాసంబులకుం
జేర్చికొను నాప్త సేవక వర్గంబులవలనను, విలూన దండంబులై
పడిన ధవళ చ్ఛత్రంబులఁ బ్రఫుల్లపుండరీకంబు లని
పరిభ్రాంతి నొడియ నఱ్ఱాడుచు నిపాతిత వరుణంబై నింగిఁ
బేరెంబు వాఱు వాహన హంసంబువలనను, మేదుర మేదఃపంక
సంకులంబులగు రుధిర పల్వలంబులు దఱిసి మజ్జనక్రీడా
పరాయణం బై చండివడిఁ గదలమిం గృతాంతుఁడు విడిచిపోయిన
జిఱకొట్టుచుఁ దిరుగు నున్మత్తలులాయంబువలనను, మూర్ఛిత
క్షపాకర మండల నిర్గతం బై నిర్గళిత శృంగంబగు
లాంఛనమృగంబుం గురంగీ శంకం దఱిమికొని వెనువెంటం
దిరుగు పలాయిత పవమాన విముక్త కురంగంబు వలనను,
వైనతేయ చరణ నఖ ముఖాఘాత నిపాతితంబులై
రణధూళి ధూసరితంబులగు రుద్రజటామండల మండన
శశిఖండఖండంబులఁ గర్ణపూరంబులుగా నిడుకొను వేడుకం గూడ
నొండొరులఁ గడవం గేరి కొను బేతాళ బాలికా
జనంబులవలనను, గదనరంగం బభిరామం బయ్యె నయ్యవసరంబున.
13
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )