కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
కృష్ణుఁ డింద్రుని నొప్పించుట
ఉ. ఱింగను మ్రోఁత మ్రోఁగుచును ఱెక్కలపాములువోలె శౌరిచే
సింగిణివింట వెల్లిగొను చిత్రశరంబులు సూతు నొంచి ర
థ్యాంగకము ల్దళించుచు నిజావయవంబులఁ దూల్ప దేవతా
పుంగవుఁ డోసరించుటయు బోరన నడ్డము సొచ్చె సైన్యముల్‌.
16
మ. మది నొక్కించుక శంక లేక సమరోన్మాదంబునం బేర్చి బె
ట్టిదమైతాఁకిన దేవతా రథిక కోటిం గిట్టి తూలించె ను
న్మద మాతంగ ఘటా తమశ్చయ నిశమ్మన్యంబుఁ దత్సైన్యము\న్‌
గదచే శార్ఙ్గముచే రథాంగకముచేఁ గంసారి హింసారతి\న్‌.
17
ఉ. సైనికు లెల్ల నంత రణసన్నహనం బెడలించి పాఱిన
న్నానయు నచ్చలంబు మది నాటుకొనంగఁ గపోల మండలీ
దాన మిళద్ద్విరేఫ నినదంబుల ఘీంకృతి సందడింప వె
ల్లేనుఁగుమీఁద డీకొలిపి యింద్రుఁ డుపేంద్రునిఁ దాఁకె నుద్ధతి\న్‌.
18
క. పునరాగతుఁడగు మఘవునిఁ
గనుఁగొని తన మ్రోలనున్న కామిని నెమ్మో
మున దృష్టి నిలిపి మురమ
ర్దనుఁ డిట్లను హాస గర్భిత ప్రౌఢోక్తి\న్‌.
19
ఉ. అచ్చరలేమ లెల్ల నగ నాహవ భూస్థలిఁ దానుఁ దోడుగా
వచ్చిన తద్దిశాపతి వర్గములుం దల లూడఁ బాఱియు
న్మ చ్చటు లాస్త్ర ఘట్టన మనంబున నెంచక నానగండయై
వచ్చినవాఁడు చూచితివె! వాసవునిం గమలాయతేక్షణా!
20
ఉ. చూడుము నన్నటంచు మధుసూదనుఁ డమ్మరిఁబోసి తద్భుజా
క్రోడము గాఁడ నేసిన నకుంఠితుఁడై సురరాజు కృష్ణు నీ
రేడుశరంబుల న్ఖగకులేశ్వరు ముప్పదిరెంట నేసెఁల్‌; బే
ర్వాడి తదన్యదిక్పతులు గ్రక్కున గంధగజాధిరూఢు లై.
21
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )