కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
ఇంద్రోపేంద్రుల భీషణ సమరము
క. మురహర బలహరు లి ట్లొం
డొరు తూపులఁ గప్పఁ బడుట నొదవించిరి త
మ్మిరువురఁ గనుఁగొనఁ దివిరెడు
గరు డోరగ ముఖుల కోరికకు విఘ్నంబుల్‌.
24
చ. అలుఁగుల దట్టమై పొడము నగ్నికణంబులు సోఁకి పైగఱుల్‌
వొలిసియుఁ దొంటివేగ ముడివోక క్రమంబున నొండొకంటిఁ బిం
జలుగొని త్రోచికొంచు శరసంఘము లక్ష్యముదాఁకు విస్మితా
ఖిల సుర సిద్ధ సాధ్యముగఁ గృష్ణుఁడు జిష్ణుఁడు బోరనయ్యెడ\న్‌.
25
తే. ఘోరముగ మింటఁ బందిరి గొని జగంబు
నంధముగఁజేయు నిరువుర యంపగములు
నొండొకటి దాఁకి క్రొమ్మంట లొదవి తామ
చూర్ణమై పోవ ముదమయ్యెఁ జూపఱకును.
26
క. అలనాఁటి నన్ను మఱచితె!
నిలు నిలుమీ తగినయాజ్ఞ నీ కిదె! యంచుం
బులుఁగులఱేని సురేంద్రుం
డలుఁగుల పెనుగూఁటఁ జిక్కునట్టుగ నేసె\న్‌.
27
మ. అలుకం గంసవిభేధి నందకముచే నయ్యస్త్రము ల్ద్రుంచి వే
బలుతూపు ల్దృఢముష్టిఁ గూర్చి బలభి ద్భద్రేభ కుంభంబు వ్ర
క్కలుగా నేసిన బోరునం దొరఁగె ముక్తాశ్రేణి, పైపై హిమా
చల శృంగావతర న్నభశ్చర ధునీ చంచత్ప్రవాహాకృతి\న్‌.
28
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )