కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు వజ్రాయుధమును నొడిచిపట్టుట
సీ. తలలు వీడంగ విద్యాధరు ల్పఱచిరి - గగ్గులకాండ్రైరి ఖచరవరులు
చట్టుపైఁబోఁక లై చనిరి గంధర్వులు - గరుడులు పంచబంగాళ మైరి
కన్నది గతి గాఁగఁ గిన్నరు లరిగిరి - పన్నగేంద్రులు పటాపంచ లైరి
పోయినపోక లై పోయిరి సిద్ధులు - దిక్కు మొగము లైరి దిగధిపతులు
 
తే. హరిహయ త్రాణ నాయత్తు లగుచు వచ్చి
మునులు సంప్రార్థనా వచోముఖరు లైరి
పూని తనమీఁద వచ్చు దంభోళి నిట్లు
పంకజోదరుఁ డొడిసి చేపట్టుటయును.
37
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )