కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
శ్రీకృష్ణుఁ డింద్రు నూరార్చుట
ము. లెమ్ము సురేంద్ర! నీవలన లే దొకతప్పును, నీమఱంద లీ
కొమ్మ వదాన్యభూరుహముఁ గోరినఁ దెచ్చితిఁగాని; కొమ్ము నీ
సొ మ్మని వజ్రమిచ్చి మధుసూదనుఁ డాతరు వీఁ దలంచినం
గ్రమ్మఱ మ్రొక్కి వాసవుఁడు కందళిత ప్రమదాంతరంగుఁడై.
39
ఉ. సొమ్మన నెద్ది! యే ననఁగ సొమ్మున కెవ్వఁడఁ! గర్తవీవు, నీ
సొ మ్మఖిల ప్రపంచమును, శూరకులంబు నలంకరించు నీ
వమ్మహి నుండునంతకు ననన్యదురాపము పారిజాతభూ
జమ్మును నుండు నన్న వికసన్ముఖుఁడై హరి వీడుకొల్పుచు\న్‌.
40
శా. గంధ ర్వోరగ సిద్ధ సాధ్యవరులం గారుణ్య దృష్టి క్రియా
సంధానంబున వీడుకొల్పి, సురభూజంబు న్సతి న్వాహన
స్కంధాగ్రంబున నుంచి, విక్రమకళా సంలబ్ధ తత్ప్రేయసీ
సంధాసిద్ధిఁ గృతార్థుఁ డై మఱలె నిచ్ఛ న్వేడ్క లుప్పొంగఁగ\న్‌.
41
ఉ. వాసవుతోడి కయ్యమున వార్తలు సెప్పుచు, మోముఁదమ్మి ను
ల్లాసము మందహాసముఁ దొలంకఁగ వేలుపుమ్రాని పూవులం
జేసిన సొమ్ము లంగములఁ జేర్చి వధూమణి నాదరించుచు\న్‌
వాసుకిభోగతల్పుఁడు సువర్ణగిరీంద్రము దాఁటెఁ జయ్యన\న్‌.
42
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )