కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
పారిజాత తరు ప్రతిష్ఠ
తే. ప్రాణవిభుఁ బెక్కుమాఱులు ప్రస్తుతించి
మంది రారామ వాటికా మధ్యసీమ
దివిజ భూమీరుహంబుఁ బ్రతిష్ఠ సేసి
యర్హపూజన మొనరించె ననుదినంబు.
50
చ. సతులఁట! ప్రాణనాథులఁట! సారెకు నైక్యము లైన మోహసం
గతులఁట! యేమి సెప్ప! బలఘస్మరుఁ బోర జయించి కల్పక
క్షితిరుహము న్నిజేశ్వరికిఁ గృష్ణుఁడు దానిటఁ దెచ్చెనంచు సం
స్తుతు లొనరించి రొండొరులతో సవతు ల్పదియాఱువేవురు\న్‌.
51
సీ. విరివిగా నొకవేళఁ బెరిఁగి వీటికి నెల్ల - నిజశీతలచ్ఛాయ నిగుడఁజేయుఁ,
బిన్నగా నొకవేళఁ బెనువ్రేలియంత యై - చూడ్కుల కెంతయు వేడ్క సేయు,
నింతగా నొకవేళ వివిధ భూరుహ పుష్ప - సురభిగంధంబుల సోడు ముట్టు,
వేర్వేఱ నొకవేళ వికచ కాంచన రత్న - పరిపక్వ ఫలములఁ బరిణమించు,
 
తే. నభిలషించిన రూపంబు నభినయించు,
నుల్లమునఁ గోరుకోరిక లెల్ల నొసఁగు
సత్యభామాగృహారామ నిత్య మైన
పారిజాతంబు విస్మయాపాది యగుచు.
52
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )