కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
నారదుఁడు సత్యకుఁ బుణ్యక వ్రత ముపదేశించుట
చ. అతులిత తావకీన మహిమాతిశయోచిత మైన పుణ్యక
వ్రత మొనరింపఁగా వలయు వారిజలోచన! నీవు; న య్యరుం
ధతియును గౌరియు న్శచియుఁ దత్పరబుద్ధి నొనర్చువేళఁ జూ
చితి మును తద్విధం బెఱుఁగఁ జెప్పెద నే నిపు డానుపూర్విగ\న్‌.
55
చ. తెలతెలవాఱ మౌననియతి న్నదికిం జని, తీర్థ మాడి, ని
ర్మల వసనంబు గట్టి, నవరత్న విభూషణము ల్ధరించి, మైఁ
గలప మలంది క్రొమ్ముడిని గ్రమ్మవిరు ల్సవరించి, యత్తమా
మలకును నాత్మభర్తకు నమస్కృతి సేసి, తదీయసమ్మతి\న్‌.
56
చ. కువలయనేత్ర! తొంటి తనకోపము గర్వము మచ్చరంబు మా
ని, వినయముం బ్రమోదమును నిండి తొలంకెడు నెమ్మనంబున
న్సవతులయిండ్ల కెల్లఁదొలునాఁడు క్రమంబున నేఁగి, త ద్వ్రతో
త్సవమున కామతించి యతిసంభ్రమలీలలఁ దోడితేఁ దగు\న్‌.
57
చ. దినదిన మిట్లు తత్పరమతిం బదివేవురు పేరఁటాండ్ర క
ర్చన లొనరించి సార ఘనసార సుగంధములు న్విచిత్ర నూ
తన పట రత్నభూషణ వితానము లిచ్చుచు వేడ్కఁ జైత్రశు
ద్ధ నవమి యాదిగా నెల వ్రతం బొనరించిన యంతమీఁదట\న్‌.
58
మ. పరమాచారధురీణు, నధ్యయన సంపన్ను, న్శుభాకారు, శా
స్త్రరహస్యజ్ఞు, విశిష్టవంశజుఁ, బ్రశాంతస్వాంతు, నుద్య ద్దయా
పరతంత్రు న్విదితాత్ము, భూసురవరుం బ్రార్థించి యాచార్యుఁగాఁ
దరళాక్షీ! నియమింపఁగాఁ దగు వ్రతోద్వాస క్రియావేళకు\న్‌.
59
శా. ఆరీతి న్నియమించి యీవలయు మాద్యద్దంతి వాహావళుల్‌
నారీరత్నచయం, బనర్ఘ నవరత్న శ్రేణి గో భూ పరీ
వారంబుల్‌ ధనధాన్యసంతతి, రసవ్రాతంబుఁ, గర్పూర క
స్తూరీ సంకుమదాగురు క్రముకరాసు ల్కోటి సంఖ్యాకముల్‌.
60
శా. ఏతద్వస్తు సదక్షిణాకముగ నాత్మేశు న్సురానోక హా
న్వీతుంగాఁ దగ ధారవోసి, ద్విజుఁ డేయేయర్థము ల్వేఁడినం
జేతఃప్రీతిగ నిచ్చి, క్రమ్మఱఁ బతిం జేకొంట యుక్తంబు; వి
ఖ్యాతంబై తనరారు నీవ్రతము సాకల్యంబుగాఁ జేసిన\న్‌.
61
క. ధన కనక వస్తు సమితియుఁ
దనయ సమృద్ధియును గల్గి తానుం బతియు\న్‌
మనమున నఱగొఱ లెఱుఁగక
యనితర సులభైక సుఖము లందుదు రనుచు\న్‌.
62
క. నారదుఁడు పుణ్యక వ్రత
మారూఢిగ నెఱుఁగఁ జెప్ప నవహిత మతి యై
కోరిక లిగురొత్తఁగఁ ద
త్ప్రారంభ మొనర్చె సత్య ధవుని యనుజ్ఞ\న్‌.
63
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )