కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
వ్రతోత్సవ వైభవము
సీ. యదు వృష్ణి కుకుర భోజాంధ కాదికముగా - నాత్మకీనం బైన యాప్తగణము
సంబంధులైన భీష్మక మహీశాదులు - పదియాఱువేల భూపతుల కులము
పాండవ కౌరవ పాంచాలు రాదిగాఁ - బరమ హితంబైన బంధుసమితి
నందాది గోపాల బృందలు మఱియును - నెయ్యురై వర్తించు నృపచయము
 
తే. వారివారల చుట్టముల్‌ వారిసఖులు
గా జగంబునఁ గల్గిన రాజలోక
మెంత యంతయు సకుటుంబ మేఁగుదెంచెఁ
బుణ్యకాఖ్య వ్రతోత్సవాభ్యుదయమునకు.
64
క. నగముల నదులఁ బయోధుల
దిగంతములఁ గాననముల దీవుల మఱియుం
దగునెడలఁ బుణ్యకవ్రత
జగ దుత్సవమునకు వచ్చె సంభారంబుల్‌.
65
తే. అసురహరునాజ్ఞ రైవతకాద్రి పొంత
విస్మయము గాఁగ నిర్మించె విశ్వకర్మ
యాత్మ నిర్మాణ చాతురి కవధి గాఁగ
మణిమయోజ్జ్వల మగు దానమంటపంబు.
66
సీ. చూడ్కికి వ్రేఁకమై సుర విమానములచే - గగన మార్గంబెల్లఁ గ్రందుకొనియె,
మనుజనాయక వర్గమకుటాగ్రమణులచే - దిగ్భిత్తు లధిక చిత్రితము లయ్యె,
నాహూతులైన మహామౌనివరులచేఁ - బొడవడ దయ్యె భూ భువనతలముఁ,
సందర్శనాయాత జనభరంబునఁ గ్రింద - భుగ్న ఫణుండయ్యె భుజగభర్త,
 
తే. సమయ బహుముఖ ముఖర తూర్యములవలనఁ
బద్మజాండంబు ఘోష సంభరిత మయ్యె,
సకలలోక మహాశ్చర్య జనక మయిన
పుణ్యకాఖ్య వ్రతోత్సవాభ్యుదయమునను.
67
ఉ. దానవభేది సత్యయును దాను యథోచితవృత్తి మంగళ
స్నాన మొనర్చి శుభ్రవసనంబులు గట్టి యనర్ఘరత్నభూ
షానివహంబు పూని హరిచందన చర్చ వహించి వృద్ధ స
భ్యానుమతి న్సులగ్నమున నా వ్రతదీక్ష వహించె నయ్యెడ\న్‌.
68
క. వ్రత కల్పోచిత దాన
ప్రతిగ్రహార్థముగ నిఖిల పరిష దనుజ్ఞం
గృతనిశ్చయుఁడై సవినయ
నతిచే సమ్మతిలఁ జేసి నారదమౌని.
69
సీ. మదవతీ కరముక్త మణికుంభ సంభృత - సౌరభోదకముల జలక మార్చి,
హిమధామ కిరణ విభ్రమ విడంబక శుభ్ర - కౌశేయ యుగళంబు గట్ట నిచ్చి,
ఘనసార మృగమద గంధ బంధురమైన - గంధసారము మేనఁ గలయ నలఁది,
విసృమర పరిమళ ప్రసవ మాల్యంబులు - ఘన జటాజూటంబు మునుఁగఁ జుట్టి,
 
తే. లలిత మణిమయ భూషణావళులు దొడిగి,
యిష్ట రాజోపచార సంతుష్టుఁజేసి,
ఋత్విజులు గాఁగ ధౌమ్యాది ఋషుల నిలిపి
వారిఁ బూజించె సకలోత్సవంబు మెఱయ.
70
శా. భద్రేభంబులమీఁద నెక్కి వెనుకం బ్రద్యుమ్న శైనేయ సౌ
భద్రాదు ల్సన ధర్మజ ప్రముఖ భూపశ్రేణితో శౌరి తూ
ర్య ద్రాఘిష్ఠ రవంబు లుప్పతిలఁ జేర న్వచ్చె సంపన్న నా
నాద్రవ్యం బగు దానమంటపము నంత న్సంభృతానందుఁడై.
71
ఉ. ద్రోవదియు న్సుభద్రయును దోఁజనుదే విభవాగతాన్య పృ
థ్వీవర కామినీమణులు వేడ్క భజింపఁగ సత్యభామ ము
క్తా వినిబద్ధ పంజరయుతం బగుపల్లకి యెక్కి వచ్చె వృ
ద్ధా విసరంబు మున్నుగ వ్రత ప్రతిపాదన సావధాన యై.
72
చ. జలరుహపత్రనేత్ర మునిసత్తమ వృద్ధ సువాసినీ జనం
బులు వెనువెంట రాఁజని ప్రభుత్వముతో వ్రతదానమంటప
స్థలమున నర్చితంబగు వదాన్య మహీరుహ సార్వభౌమము\న్‌
వలగొని వచ్చి దేవమునివర్యున కిచ్చె యథోచితార్చనల్‌.
73
చ. సతులు పదారువేవురును సంగడి రా వదనాంబుజంబునం
గృతక వికాస మచ్చుపడఁ గృష్ణుని పట్టపుదేవి యిందిరా
ప్రతినిధి రుక్మిణీరమణి రాఁ దగ వౌ నని వచ్చెఁ బుణ్యక
వ్రతము గనుంగొనం గమలరాగ మణీ శిబికాధిరూఢయై.
74
వ. అట్టియెడ నమ్మహావ్రత దానోచితంబుగా వేర్వేఱ నేర్పరింపఁ బడు
సాలంకార ధేనుసహస్రంబులు విడువడు నిజవత్సంబులం బిలుచు నంభా
రవంబులవలనఁ బ్రత్యేకంబ పర్వతంబులుగాఁ గల్పింపఁబడు కనక
రజత తామ్ర కాంస్యాది లోహంబులుం, బద్మరాగ ప్రవాళ హరినీల
మౌక్తిక మరకతాది రత్నములుం, దిల గోధూమ యవ వ్రీహి మాష
ముద్గాది ధాన్యంబులుం, గనక నిర్మిత చ్ఛత్ర చామర శయ్యా
వ్యజన పాదుకాద్యుపకరణంబులుం, గజ తురగ స్యందనాది
వాహనంబులు మొదలుగాఁ గలుగు దాన ద్రవ్యంబులు సమకూర్చు
నధికారుల సంభ్రమాలాపంబుల వలన, నపూర్వ మహోత్సవ
సందర్శన సంతోషిత స్వాంతులగు దిగంత మహీకాంతుల పరస్పర
సరస సల్లాపంబులవలన, వివిధ దేశాగతంబులగు రాజలోక
శుద్ధాంత వర్గంబుల కెడ గలుగ జడియు వేత్రహస్తుల తర్జన
స్ఫూర్జనంబుల వలన, సంయమీశ్వర తిలకంబుల వికస్వర
సుస్వరంబుల నామ్రేడించు వేద మంత్ర పఠనంబులవలన,
వైభవాలోకన లంపటులై యాకసంబున గుంపులుగొని నిలింపు
లగ్గించు సంస్తవ రవంబుల వలనం, బటహ భేరీ ఝల్ల
ర్యాది వాదిత్ర నాదంబుల వలనను, నా సమయం బభ్యర్ణ
పూర్ణచంద్రోదయ ఘూర్ణమానార్ణవంబునుం గ్రేణి సేయుచుండె.
నట్టియెడఁ దత్కలకలంబు వినివారించి నారదుండు సత్యభామ కి ట్లనియె.
75
క. వికచాబ్జనేత్ర! యీపు
ణ్యక వ్రత విధానమునకు నాథుని ధారో
దక పూర్వ మీవలయు ని
య్యకొలుపుమా! యిపుడు యాదవాన్వయ తిలకు\న్‌.
76
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )