కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
శ్రీకృష్ణుని సత్యభామ నారదునకు దాన మొసఁగుట
చ. అనవుడు సత్యభామ హృదయంబున లజ్జయు సమ్మదంబునుం
బెనఁగొనఁ బ్రాణవల్లభునిఁ బ్రేమరసాలస వీక్షణంబునం
గనుఁగొని మోము వాంచి మధుకైటభమర్దన చిత్తగించితే!
మునిపతిమాట నావుడును మోవిపయిం జిఱున వ్విగుర్పఁగ\న్‌.
77
మ. నవచంద్రాలిక! నీకు నేల యనుమానం బాగమోక్తంబు గా
న విచారింపక ధారవోయు మనిన న్లజ్జాభరా క్రాంతలై
సవతు ల్వాంచిరి వక్త్రపంకరుహము, ల్సంబంధి భూపాలక
ప్రవరు ల్నవ్విరి నర్మగర్భిత వచః ప్రాగల్భ్యమేపారఁగ\న్‌.
78
చ. మునిపతి యానతిం జకిత ముగ్ధ మృగీ తరలాక్షి ప్రాణనా
థుని గనకాంబరాంచలముతోఁ గుసుమాయుధ వాగురా నిబం
ధనమునుబోని క్రొవ్విరులదండఁ దగుల్కొనఁ జుట్టె వేడ్కఁ గ
ల్పనగముఁ గూడఁ గంకణ ఝుణంఝుణ మంజుల దోర్యుగంబున\న్‌.
79
తే. పరమముని మానసాలాన బంధనమునఁ
గుదురుపడకుండు యాదవకుంజరంబు
వికచ రాజీవనేత్రచే వేల్పుమ్రానఁ
గమ్మఁ బూవులదండచేఁ గట్టువడియె.
80
చ. బలి దనుజేంద్రుఁ గట్టితని పల్కఁగ విందుము గాని, నేఁడు మా
చెలి యిదె పుష్పదామకముచే నినుఁ గట్టఁగఁ గంటి, మింక నె
మ్మెలు పచరింప రాదనుచు మేలము లాడెడు సత్యబోట్ల స
న్నల నెసకొల్పుచుం గెలన నవ్విరి ధర్మజ భీమ ఫల్గునుల్‌.
81
మ. సమయజ్ఞుం డయి గర్గసంయమి మహాసంకల్పముం జెప్పఁ గ
ల్ప మహీజంబు సదక్షిణాకము నిజప్రాణేశుఁగూడ న్సుప
ర్వమునిశ్రేష్ఠున కిచ్చె దానముగ ధారాపూర్వ మవ్వేళఁ 'దు
భ్యమహం సంప్రదదే నమో నమ' యటం చద్దేవి మోదంబున\న్‌.
82
ఆ. ధారవోసి మఱియుఁ దద్వ్రతాంగంబుగా
దాన మిచ్చె నపుడు తలిరుఁబోఁడి
మణి సువర్ణ ధాన్యమయ పర్వతంబులు
గోసహస్ర వాజి కుంజరములు.
83
క. ఇవ్విధమున దానము గొని
చివ్వల యోగిరపుఁ దపసి చెట్టును గూడం
బువ్వులసరులం జుట్టిన
యవ్విభుని చెఱంగు విడిచి యల్లన నగుచు\న్‌.
84
క. సత్యముగ నిన్ను నిప్పుడు
సత్యాసతి మాకు నిచ్చె సకలామ్నాయ
స్తుత్య! యిఁక సలుపు మభీప్సిత
కృత్యంబులు సలుపు మనుచుఁ గేళిపరుండై.
85
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )