కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
నారదుఁడు శ్రీకృష్ణునిచే నూడిగములు సేయించు కొనుట
సీ. మేళవించినవి సుమ్మీ దీని మెట్లని - మాంసలాంసంబున మహతిఁ జేర్చి,
మిన్నేటి జలము సుమ్మీ తొలంకెడు నని - డాచేత మణికమండలు వొసంగి,
యిది జపోచితము సుమ్మీ జతనంబని - వలచేతఁ బద్మాక్షవలయ మిచ్చి,
యీశానుఁ డిచ్చె జుమ్మీ మాకు నిదియని - శార్దూలచర్మంబుఁ జంకఁ జొనిపి,
 
తే. పొమ్ము పొమ్మని యొక పోవఁ బోవ,
రమ్ము రమ్మని మరలఁ జేరంగఁ బిలిచి,
కపట నటనా పరుం డైన కంసవైరిఁ
బరమముని నవ్వుటాలకుఁ బనులు గొనియె.
86
మ. నిగమాంత ప్రతిపాద్యు నాద్యు నభవు న్నిత్యు న్గుణాతీరు వి
శ్వగురు\న్‌ జిన్మయు నవ్యయుం బరము నిశ్శంకం బనుల్గొంచు మౌ
నిగరిష్ఠుండు కృతార్థుఁ డయ్యె నన సందేహింపఁగా నేల! భ
క్త గణాధీనుఁ డనంగ నవ్విభుఁడు లోకఖ్యాతిఁ బెంపొందఁడే?
87
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )