కావ్యములు పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం ఐదవ సర్గ
ఐదవ సర్గ
అంబటి వా
రటుకులు దంచం బిలిచిన వల్లెయని
బ్రసాపడి
మధ్యాహ్నంబే రంగమ్మ చనెన్‌
కంబము బోల్‌
రోకలొకటి గైకొని వేగన్‌.
అటుకుల దంపకమ్మన
మహాశ్రమ దాయకము -
అగ్గిరేగు గుప్పిట.
ఉడికించి వడ్ల, నొకపెద్ద పెనమ్మున వేసి
రోటిలో పిటపిటలాడ దంచవలె;
పీకల మీదుగనుండు;
నల్గు రొక్కటి తరువాత నొక్కటి
చకాచక పోటులు వేయగావలెన్‌.
చేతులు బొబ్బలెక్కె,
నలసెన్‌ బదముల్‌, దగవుటె
గుండెలున్‌ కూతలువెట్టె
రక్తము రగుల్కొనె.
ముక్కుల నూపిరాడుటే
మోతగనుండె,
కన్ను లరమోడ్పులకుం దగవయ్యె.
ఱెప్పపాటే తడవైన
రోకలి పెఠిల్లను,
రెక్క శఠించు ఠక్కునన్‌.
చేయి మార్చి మార్చి
        చేతి కొలది దంచె
ఒక్క క్షణము గూడ
        నూర కొనక;
మూడు పెనములందు
        మూలుగు ధాన్యము
వరుస మీద వరుస
        వచ్చుచుండె.
నిప్పు చెఱగు నెండ
        దుప్పటే పైకప్పు
మూడు ప్రొవ్వులందు
        మొద్దుమంట
వాయిమీద వాయి
        వడి దంపక మ్మింక
చెప్పనేల వారి
        తిప్పలంత!
నలుగురిలోకల్లా
గంగులు చిన్నది, దూడపిల్ల
కోమలమ్ముగా
కలకలలాడుచున్నది -
విలవిలలాడెన్‌
పెనాన పేలగింజయై.
దగవుట్టుచున్నదని
వేరుగనిలిచిన, తోడివారు
రుంజుకొందురన్‌ దిగులున
నెట్లో పండ్లన్‌ బిగబట్టి,
కరమ్ము నెత్తి
బిరబిర దంచె\న్‌.
అందులో నొక్క
పెద్ద ముత్తైదు వీమె
తన కలాటనుజూచి జాలిని వహించి,
'అలత దీర్చుకోవే పిల్ల!' అనెనుగాని
బింకమున దంచుచున్నది
పెద్ద ప్రొద్దు.
ప్రొద్దు మునింగెగాని పని పూరితిగాదు;
ఒడలున్‌ వశమ్ములో కద్దని చెప్పలేము;
తనకంటె బలమ్ము జవమ్ము గల్గువా,
రద్దరి యెండుటాకులటు
లల్లలనాడగ!
నేవళమ్ముగా
సుద్దుల ముద్దులం బెరుగుచుండిన
తానిక ఓపగల్గునా?
'ముంతెడు గింజలైన
మన భుక్తికి చాలును;
నేను దెత్తునా యింత;
రవంత పై పనులనే
సరిపోవును వెచ్చ;
మింతలో నంతకు నింతకున్‌
బరువులైన పనుల్‌ తలవేసుకోకు',
మంచెంతగ మామ జెప్పిన,
తనే వినదాతని తోడునీడయై,
మామ మాత్ర
మూరక క్షణమాత్ర ముండలేడు గద;
కోడితో లేచి,
వాడవాడ మాటు మణిగిన దాక
చెమ్మటల నోడ్చుచుంట జూచి
తనెట్లు కూర్చుండ గలదు!
నల్తుము వడ్లు పెండ్లికని
నాగుకు తెచ్చిన వట్లె యుండె;
కుప్పల్తను గొట్టి తెచ్చినది
వల్లెకు చీరకు చాలదయ్యె;
ఆ కొల్తల కూలి
కొట్టమునకు\న్‌ సరిపోవనిదయ్యె;
ఇంక తానల్త యటంచు
నెట్టులను నాయమ
మామ యవస్థ జూచుచున్‌.
దాపఱికమ్ము లేదు,
తను దానయి చిక్కుల నన్ని జెప్పు,
చూపోపమి నేరు దప్పిన
నెదో ఒక చీర ఉగాదినాడు,
తానే పనిమీద వెళ్ళినటులే చని
తీసుక వచ్చు;
కంటిలో పాపగ తన్ను జూచు;
తన పాలిటి దేవుడు మామ యింతకున్‌.
తానయి చేతనైన పని
తప్పక సేయదలంచె గంగులు,
ఆపైన, ఒకొక్కనాడు
తన ప్రాణము సొంపకయున్న
లోనలోనే నలతన్‌ బిగించుక
పని\న్‌ విడనాడదు;
మూడు ప్రొద్దులు\న్‌
లేనివి ఉన్నవేవి కదలింపక
బువ్వను బెట్టు మామకు\న్‌.
తనకేమో నెలనుండి పై దిరుగు
పొంతంబట్టి నిల్చుండి పోయెనుగానీ -
పదినాళ్ళనాడు తన కేమేమయ్యెనో;
కండ్లులేవన చీకట్లు గ్రసించె కొట్టము;
శిరోభారమ్ముతో ప్రొద్దుగ్రుంకినదాకా
పడియుండె;
నద్గది మొదల్‌
గీపెట్టు కర్ణమ్ములున్‌.
సందకాడ జొన్న
        సంగటి గెలకంగ
తెడ్డు చూరినుండి
        తీయుచుండ,
మసక గ్రమ్మి పొయ్యి
        మంటలో పడబోయి
మల్లి, పట్టుకొనగ
        మనిషి దక్కె.
మడికలుపు లప్పు డిట్లే
తడిపచ్చిక గోసి,
        మోపు తలనిడి తెచ్చెన్‌;
తడికకు మోపానించుచు
పడిపోయెను,
        సుంకులమ్మ ప్రాణము నిలిపెన్‌.
నిమ్మకాయ బొప్పి,
నెమలీక, జీలకఱ్ఱయును
తేనె రంగళించి
నాకు మనెను;
దాన నాల్నాళ్లు బాగుండె;
బొట్టులేక తేనె పుట్టదిపుడు,
మొన్నరాత్రి,
కడుపు సన్నసన్నగ జొచ్చి,
తెల్లవారుజాముకల్ల హెచ్చి
చుట్టజుట్టుకొనుచు
తట్టుకోలేక
ఎంత లపరించినదియొ దైవమెఱుగు!
కానీ లేత వయస్సుది!
లోనున్న ఒకింత బలిమి రోజు రోజుకున్‌
కానల వట్టుచు నుండె, జ
గాన నిగారమ్ము నిగ్గు కలదె లేమిడి\న్‌?
పలు కడగండ్ల గాసిలి,
యవాంతర భేదము మ్రింగికొంచు,
నా ఎల జవరాలు
మామ గనిపించిన పొంగులువారు
పోడుముల్‌ పులకలు గూర్ప,
నన్ని వగపుల్‌ బొయివెట్టి
శ్రమించుకొంచు,
రోజులు గమియించుచుండె
తల సూపెడు కోర్కులు
తీవ సాగగ\న్‌.
తానొకనాడు, సందు మొన
తక్కువలో
నొక మట్టి మిద్దెనో దేనినొ
వేసుకోవలె!
పదింబది రెక్కల వంచి యెట్లొ
బాకీని తెగించి తీర్చవలె;
కేరుచు త్రుళ్ళుచు నుండు పాపని\న్‌
తానయి మామ కిచ్చి,
సులతానువు! నీవని
చెప్పగావలె\న్‌.
ఈ మాట దోచినపుడా
కోమలి చెక్కులను బూసె కుంకుమ పూవుల్‌
గోముగ మోమిడి మామను
మామూలిమ్మనుచు నడుగ మానసమయ్యె\న్‌.
తటుకున దోచె
నా పగ లతండొక యించుక తల్లడిల్లి,
వేసటపడి తొందర\న్‌
కొలది సాదముతో జనె
బావి సేవక\న్‌
గటుతర భావము;
ఆ ముగుదకాల్వడకె\న్‌,
మెయి చెమ్మఱించె,
నొక్కట కనుచీకటుల్‌
తలమొగ\న్‌
సుడిగాలిని ఱేపె గిఱ్ఱున\న్‌.
'పడె పడె' నంచు నందఱు
గబాలున చేతులనున్న
వచ్చటే దడదడ వేసి, చుట్టుకొని,
'దయ్యము వట్టినదేమొ?
వాత మొక్కెడ గనిపించెనేమొ?
వెనుకే గలదేమొకొ మూర్ఛ?
కుప్పగా బడు పసిపిల్ల లుందురె?
విపర్యయ మియ్య' దటంచు నెంచుచున్‌.
మొగమున నీరుగొట్టి
పదముల్‌, కరముల్‌, ముకుగంబ
మంత చల్లగ గనిపించినన్‌
బసపు, రాగుల పిండియు రుద్ది,
వేడిగంజి గుటకవేయనిచ్చి,
మతి జేకుఱునంతకు వీచివీచి
కన్నగవను విచ్చినన్‌
మనసు నూఱట జెంద
అనంత తృప్తితో.
ఇరు ప్రక్కల నిద్దఱుగా
తరుణిం బట్టుకొని,
సందు దాటించుక వచ్చిరి
కొట్టమ్మునకు -
అక్కడ పురులెక్కిన చీకటుల్‌
గుబుల్‌కొనుచుండెన్‌.
ప్రమిద, వత్తీ, ఆముదము, నగ్గిపుల్ల
నొక్కొక్క రొకటి తెచ్చి,
గూడు దెఱచి,
ఈతచాప వేసి యెటొ
పడుకొన బెట్టి
వారి పనులమీద వారు చనిరి.
అంతకంటె
వార లందింపగల సాయ
మేమి గలదు?
చేత నేమిలేని పుట్టు పేదవారు
పొలతులందఱు పాప?
మైన నేమి హృదయ మంత మృదువు;
పొరలుచున్న దామె చిఱుచాపపై బడి
తెఱలు తెఱలు పొరల తెరలు గ్రమ్మ,
కనుల నీరు లురల నును చెక్కు లదరగా
ఎఱుక మఱపు దారి యిఱుకులందు.
కొంత సేపటి
కొక కొంత కోలుకొనుచు,
తడక చప్పుడుకాగ
రంగడని తోచి
ముంచుకొని వచ్చు దుఃఖమ్ము
మూతవెట్టబోయి,
బిగ్గఱగా నేడ్చివేయసాగె.
పిల్లికూన బెదరి చల్ల ముంతను ద్రోసె
మామ కెట్టు లనుచు నామె లేచె;
చెవులు గింగు రనియె, చేతు లాన్చగ లేక
విసురు కొనుచు బోయి పసరు గ్రక్కె.
రంగన్నవచ్చె, బారెడు
నంగలతో తడకలాగి యవలకు ద్రోసె\న్‌.
గంగమ్మ దుర్గతిం గని
చెంగున చేతులను నెత్తి చేఱిచె చాప\న్‌.
ఏమి జరిగినదో!
తనకేమి బోధపడుటయేలేదు!
తనగొంతు పలుకలేదు
అట్లె నిర్విణ్ణుడై
గంగులమ్మ తలను
తొడపయిం బెట్టుకొని
గ్రుడ్లు విడుచుచుండె.
ఒక్కచేత నామె చెక్కిలి నిమురుచు,
నొక్కచేత తలను నొక్కిపట్టి,
తేమలేని గొంతు తెమలక,
తాకిడి మాటలాడునేమొ
        మమత నతడు!
ఆ చెయిసోకి,
గంగమ హృదంతర మందలి జీవనాడి
ఏదో చలియించె;
కన్నుగవ దోవలు విచ్చె;
కడింది మక్కువల్‌
పూచిన మొగ్గవోలె
తనువు\న్‌ వడదేర్చెను;
మానసాంతరాశాచిర దీర్ఘికాపతిత
కైవల జాల మొకింత తొట్రిలె\న్‌.
కమలిన కన్నులన్‌ విరిసె
కమ్మని జీవలతాంత వాసనల్‌;
బ్రమసిన గుండెలోని
పరువమ్ముల గింజలు మోసులెత్తె;
నే యెముకలలోనికో
కలిసి యేగిన నెత్తుటిచాయ
మేనిపై గమగమలాడజొచ్చె;
తమకముల కమ్ముల
నీనె నూరుపుల్‌.
ఆ క్షణమందు రంగడు,
సమాధి గతుండగు యోగివలె
నే అక్షర నిత్య సత్య
మధురాంతర భూమిక చెంత నిల్చి.
చిత్తక్షయ లక్ష్యసిద్ధి
గను దార్పుల, నూర్పుల జిక్కవట్టి
ప్రత్యక్ష పరాత్పరత్వ
చరమావధిలోన లయించు చుండెనో!
గంగమ మామా! యని, బి
గ్గం గౌగిలి హత్తి గుండె గంటలు మ్రోయ\న్‌
నింగి నరుంధతి కన్నుం
జెంగలువలు నీరుగ్రమ్మ చెక్కుల నిమిరెన్‌.
రంగడు పిల్లా! యని బి
గ్గం గౌగిలి హత్తి గుండె కన్నుల పూయన్‌,
నింగి పురూరవు కన్ను\న్‌
చెంగలువల నీరు గ్రమ్మ చెక్కుల నిమిరె\న్‌,
కొక్కొరొకో!
అటంచు నదిగో!
బరువెక్కిన గొంతునెత్తి,
కొమ్మెక్కి, ఒకింత కొప్పు గదలించుచు
ఱెక్కల నార్చుకొంచు.
నీదిక్కయి కోడికూసినది;
ఇదే ప్రణవమ్ము,
దరిద్రమానవాసృక్కణ హోమ
మంత్రమున
కింక మొదల్‌ మఱి నిన్నచావులే;
నిన్నయే నేడు వీరికి;
నేటివలెనె రేపు వచ్చును -
గుండెల నూపివదలు;
మాపులే రేపులైన
ఈ మాయ వదలు
రేపకడ కోసమే
వీరి యీ ప్రతీక్ష!
కండలుగోసి, పాళ్ళిడి
బికారుల జేసి
జనాల నెత్తురుల్‌ పిండుచు,
కుక్క కూడయిన బెట్టక,
పొట్టల గొట్టి
కూళలన్‌ దిండుల కానబెట్టి,
జగతిన్‌ గరుణార్ద్రత కగ్గివెట్టు
పాషండుల వల్లకాడు
మనసా!
యిది మానవసంఘ మెట్లగున్‌?
గుండెలుకోసి యివ్వగల కూరిమి
కొండలు మోయు తాల్మి,
కట్టెండకు నిల్చి
బండల పెఠిల్లున బ్రద్దలు గొట్టి
బంగరున్‌ చెండుల
పైకి దీయగల చేవ.
జితించిన వీరి
కర్మ మార్తాండుల
ఱాచి ఱాపడు చెఱన్‌ గను
పాతకమేల దైవమా!
దైవమా; ఉంటివా? చచ్చినావ నీవు?
ధర్మమా! గెంటిరా? నిన్ను ధరణినుంచి?
సంఘమా; తలకెక్కెనా? సన్ని నీకు?
హృదయమా! మానవుడు ని\న్‌ బహిష్కరించె
ధరణి గంపింప, కులగిరు లురలిపడగ,
మేరు శిఖరమ్ము నెక్కి, మిన్ను లదర,
చచ్చె నీలోకమున నాత్మసాక్షి యనుచు
నెత్తి నోరిడి కొట్టుకోనిండు నన్ను,
ఇదే పెన్న! ఇదే పెన్న!
నిదానించి నడు!
విదారించు నెద\న్‌ వట్టి
ఎడారి తమ్ముడు!
ఇది అయిదవ సర్గ.
సర్వం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - kaavyamulu - pennETi pATA - Vidvan Viswam - Vidvan Visvam( telugu andhra )