కావ్యములు పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం నాల్గవ సర్గ
నాల్గవ సర్గ
గబగబ బువ్వన్‌
నాలుగు కబళమ్ములు మ్రింగి,
రెడ్డిగారింటికి
రోజు బరాతము రాగా
కడవ బుజానం బెట్టి
ఊర బావికి వెడలెన్‌.
పోటు కడవ;
గుండెపోటు వచ్చును
నింపి యెత్తుకొన్న మాత్ర;
ఇంక నేడు మట్ల లోతునుంచి
మెట్ల నెక్కుటయన్న,
నెంత కండయున్న, నేమి చాలు;
ఎన్ని కడవలు పోసిన
నెంత పెద్ద ఔతుఖానాయొ కాని,
పైకైన రావు;
అన్ని నీళ్ళేమి సేతురో ఉన్నవారు;
పాపము;
        ఆ రంగనికి బోధ పడనె పడదు.
మాటయేగాని వీరిచ్చు మూట లేదు;
ఏటి పట్టెల పాలన్న దాటిపోయె,
పూట కొక ముంత మజ్జిగ బోతు రంతె -
పేదవాని కదే అమృతోదనంబు.
కూరనార వాని పేరైన తెలియదు
మెరపకాయ కంటె దొరకదేమి
ఉల్లగడ్డముక్క, చల్ల -
        ఇవొక్కటే
సాదమందు,
        వారి సాధకములు.
దేవళాలు తిరుగగానె
బావి సేవ మొదలు;
దోవ అఱిగిపోయి, గుండె
చేవ దప్పు వఱకు.
మఱి యిరస వడ్లు, రోకలి
దరిసెనమయ్యెన్‌; సరే
ఎదల్‌ పగులగ
నా వరుస ముగించెడు సరి
కస్తరవిప్రభ
ఊరి నెత్త్రు సంద్రము జేసెన్‌.
లాందరాలు తుడిచి,
లాంపులు ముట్టించి,
మిద్దెమీద వరుస మిగులకుండ
మంచములను వేసి,
మనిషెత్తు పరుపులు
దులిపి, పరచి, దోమతెఱల గట్టె.
ఈ యింట నున్నంత సేపు -
కోయన్న కోటి సామాను;
ఈ యిల్లు దాటితేనేమొ -
రాయెత్తితే రాయి నీను.
ఈ యింట నేమూలనైన
చేయి వెట్టిన రాల్‌ వరాలు;
ఈ యిల్లు దాటితేనేమొ
వేయంచులన్‌ దెగు నరాలు;
ఈ యింట నేపెట్టెనైన
ఈయూరి సిరులెల్ల పూచు;
ఈ యిల్లు దాటి పారాడ
ఈ యూరి కడగండ్లు వేచు;
ఈ యింటిలో తొంగిచూడ
ఈ యూరి చెమట నీరాడు;
ఈ యూరిలో తొంగిచూడ
ఈ యింటి భూతమ్ము నీడ;
ఈ యింట చలువఱా
        లిమిడిచి చెక్కిన
నేలపై నీనీడ
        వాలుదోచు;
ఈ యింట నున్నట్టి
        యిటుల గోడల, పాల
గారలో అద్దాలు
        కలసి పోవు;
ఈ యింటి మహడీల
        నెక్కిన చానల
వేనలిలో మబ్బు
        సోనలూరు;
ఈ యింట దిరుగాడు
        నింతపిల్లియు, నూరి
పెద్ద రైతుల
        నిలవేయ జాలు -
ఇచట త్రేన్పులెకాని విన్పింప వూర్పులు -
ఇచట రూకల గల గల లెత్తిపోవు;
ఇచట లక్ష్మీ సరస్వతులే వసింతురు -
ఇచట లేనిది - మానవ హృదయ మొకటె.
ఈ యింటి యజమాని
                ఎంతో విద్యావంతు
        డెపుడు భాగవతమ్ము
        నే పఠించు;
ఈ యింటి యిల్లాలు
                పూయించు గన్నుల
        కొల్లలు కొల్లలు
        మల్లెపూలు;
ఈ యింటి కొడుకొక్క
                డింగ్లాండులో, ప్రజా
        స్వామ్య శోధన నెంతొ
        జఱిపి వచ్చె;
ఈ యింటి కూతురు
                పోయిన యేడె,
        సాంఘిక శాస్త్రమున
        పట్ట మొకటి గొనియె;
ఎచట జూచిన చిత్రాలు
నెన్నొ శిల్ప ఖండములు గనిపించు,
నెక్కడను మలిన మన్న దేలేదు -
కాని, సంపన్న గృహము
చొచ్చి చూచిన
        నాత్మయే
        శూన్య మిచట.
మున్నూరు మట్టి మిద్దెల
క్రొన్నెత్తములెల్ల దీని కొత్త యరుగులం
దన్నగలే విది యొకటే
ఉన్నది ఊరెల్ల మ్రింగి యుబ్బినట్లుగ\న్‌.
కోటి కొక్కరిది ఇ
        చ్చోటి రాయలసీమ;
పేట కొక్కెడలేని
        పెద్ద రాయలసీమ;
వేటాడి వేటాడి
        వెదకినా ఇందులో
నేటి పేదల సీమ
        నిజరూపు కనబడదు.
ఇది ఎడారిలోని ఒయాసిస్సే కానివ్వు
వడగొట్టిన పేదకేమొ వట్టి ఎండమావు.
ఇంత ధనమున్న
చదువున్న
నింత బలగమున్న
నీయింట నెవరికి సున్న హాయి;
ఒక్కొకరు నొక్క లోకము -
ఒక్కరి దొకొక్క తీరు -
నెయ్యము లిచట
        ప్రాదెనుగులయ్యె.
ప్రొద్దు పోకకె చదువు
ప్రొద్దు పోకకె నులివు
ప్రొద్దు పోకకె మెదుకు
ప్రొద్దు పోకకె బ్రతుకు.
మొద్దు వాఱెను మనసు
మొద్దు వాఱెను తనువు
మొద్దు వాఱెను బ్రదుకు
సుద్దియే యిచట -
ఎటు చూచినా
        ప్రక్కలెండి యున్నారు
ఎటు చూచినా
        విలాపించు చున్నారు
ఎటు చూడలేక
        తమ కిటికీలు మూసుకొని
కటు జీవిత -
        యధార్థ కథ చూడకున్నారు.
చుట్టుం జుట్టు
దరిద్రతా విధుర సంక్షుబ్ధ క్షుదంబోధిపై
తెట్టుంగట్టు నుఱుంగు కొంపయిది,
బోదెల్‌ పాదులు\న్‌ గుళ్ళె;
నీ పుట్టి\న్‌ మోసెడువారు పీన్గులయి
రేపోమాపో చానుండ
వీ రెట్టు\న్‌ నిల్వరు, చూచుకోరు దరులు -
అట్లే చుక్కల\న్‌ జూచుచు\న్‌.
దారుణ కల్మష
        దగ్ధ మారుతో
చ్ఛూన రోదసీ
        క్షుద్ర భూమిపై,
ఘోర నారక
        క్రూర జ్వాలా
ఘూర్ణమాన సం
        చూర్ణమాన, బా
ధాధరా ధరా
        ధిత్యకపై, జం
బూక రోదనా
        పూర్ణ శ్మశాన
కాష్ఠచ్యుతాస్థి
        కా శిఖరముపై,
ఎట్లు నిలుచు నీ
        కృత్రిమలోక,
మ్మెట్లు నిలుచు నీ
        కృత్రిమజీవ,
మ్మెట్లు నిలుచు నీ
        కృత్రిమ హృదయ
మ్మిట్లిట్లే చిట్లి
        పెట్లి పోవును.
పరిసరాలు దరిద్రతా
పరిదగ్ధము కాగా,
సరి నరాళి ననరాలన్ని
పురుగుబట్టి పోగా,
ఉరికి ఆర్పలేక పురుగు
తరిమి వేయలేకా
ఉరిమి చూచుచుంటి వట్టి
దరి బేసితనమ్ము.
ఎచటికో పోవుచుండి,
        కాసింత సేపు
ఆగియున్నట్టు లుందు రీ
        ఆస్తి పరులు,
పలుకరించ రెవ్వారి
        సంజ్ఞల వెలార్చి
ఉత్తరువులిత్తు రంతియే
        ఊడిగముల.
ఇంటి ముసలమ్మ మాత్ర
        మా పెంట దరిని
కుక్కి మంచమ్ములో, పండు
        కొని, ఒకపుడు
రంగనిం బిల్చి మాటాడు
        పొంగి పోయి
వీని నాన్న నెఱింగిన
        వెఱ్ఱి దామె.
పని ముగించి రంగ
        డనుదిన వర్తన
పుల్లగూర కొంత చల్ల కొంత
తీసుకొని, రవంత
        తెఱపి వచ్చెనటంచు
ఇంటి ముఖముపట్టె నిఱ్ఱివోలె.
మాటు మణిగిన దూరు,
నిర్మానుషములు దారులన్నియు
చాకలి గేరిలోన మటుకు
మగని గుద్దులుతిన్న మల్లి యేడ్చు -
ఊరకుక్కలు మాత్రమే
ఊరడింప.
చీకటి ముంచివేసినది
చింతల పల్లెను;
గుట్ట కొంప ముందే; కడలేని ఱాలు -
అడుగు దీసి ఒకించుక
ముందు వేయుటే
నాకము నెక్కు నంతపని!
నాలుగు బారల కొక్క గుంతొ మిట్టో
కనిపించు;
వాడుక నెటో నడువ\న్‌వలె
మెల్లమెల్లగన్‌.
గూటిలో దీపముం బెట్టి,
        నోటిలోన
కబళముల బెట్టుకొందురు
        గ్రామజనులు!
అంత చుక్కల వెలుతురే
        యైన జాలు
వారి కనులకు గనిపించు
        వస్తు తతులు.
అసలు దీపము ముట్టించు
        నంగణమువలె
చాల తక్కువ;
        ఉన్న దీపాలుగూడ
తమ్ము దాము
        జూపించుకో దగిన జాలు
అన్ని వస్తువుల\న్‌
        జూపినంత ఫలము.
ఒక్క కోమటి సుంకన్న,
ఒక్క బట్ట లచ్చుమయ్య,
పంచాంగము రామశాస్త్రి,
ఒక సరాబు వీరాచారి,
ఒక్క భజన గురువు -
- వీరిండ్ల లోననే
        ఉరువు దివ్వె.
ఊరి ముందట
        కరణముగారి విడిది;
ఊరి కాదట
        రెడ్డిగా రున్న మేడ;
ఉన్నవని తోచు రాత్రులు;
        నూరు మొత్త
మంధ కారాంతరమ్ములో
        నావులింప.
వేకటి చీకటి, ఆకటి
కూకటి విరియించి రాత్రి
        గుబగుబ లాడున్‌.
మూకటి పగిలిన బ్రదుకులు
రోకటి మనుగడలు మాత్ర
        రొప్పుచు నాడున్‌.
అక్కడక్కడ
నొక్కొక్క ప్రక్క సందు మోటులో,
మాటులో,
ఱెప్పపాటు నిలిచి -
మోటు జీవాల
తొందరపాటు గన్న
నేటి బ్రదు కిదియని
ఏవగింపు గల్గు.
దయ్యమ్ము వోలె చీకటి
గొయ్యిని ముసుగుం దగుల్చుకొని, ఒక్కండా
వయ్యారి బసివి గొట్టము
కొయ్యం గదలించె, కుక్క కొయ్యో మనియెన్‌.
వామి దొడ్ల లోన
        దోమల గుంపులో
పాముపుట్ట ప్రక్క
        పండుకొన్న
పసల పిల్లవాడు
        భయపడి, ఎనుముల
ప్రక్కజేరి, తోక
        బట్టుకొనియె.
దుబ్బ నాగిరెడ్డి
        దూడ రాలేదని
వెదకబోయె, దొరువు
        పొదలలోన;
గూని సుంకిరెడ్డి
        గొడ్డు, బందెల దొడ్డి
లోన పడినదన్న
        మ్రానువడియె.
రచ్చకట్ట మీద
        రామన్న సుబ్బన్న
వఱపు తప్పదనుచు
        వంతపడిరి;
బోయ చిన్నిగాడు,
        బొరుగుల రంగమ్మ
అప్పుపెట్ట దనుచు
        నఱచు చుండె.
సుంకలమ్మ, పసుల
        చొప్పదీయుచు నుండ,
తేలుగుట్టె నెడమ
        కాలిమీద;
మంతరించమనుచు
        మరియప్ప దఱికేగ,
గొఱ్ఱె చచ్చివాడు
        గొణుగుచుండె.
సంతలోన సరుకు
        దొంతర నెత్తించి
బండిలోన వచ్చు
        బద్దరయ్య
వల్లలేని యెద్దు
        వాటు వేసిన గొంతు
చించుకొనుచు నుండె
        చెడితి ననుచు.
సందు మూల గుంపు;
కందిరీగల వోలె తిరుగుచున్న వారు;
బరువు గొంతు;
కడుపు తఱుగు నేడ్పు,
కళకళపాటులు -
రంగడేమి టనుచు తొంగిచూచె;
ముసలిదేమొ మంచముం బడి మూడేండ్లు
రాత్రి గడప దనెను రామదాసు
ఇంటి మనిషి నాగి ఈరోజు కన్నది
ఆకు చేను బోయె నంట వాడు.
పురుగు కుట్టెనంట;
నరసన్న నోటిలో నురుగు వచ్చుచుండె;
సొరుగువచ్చె;
నోటి కొక్కమాట;
బాట పల్లెకు వెళ్ళి;
మంత్రగాని దెచ్చు మార్గమేది?
రొమ్ము గొట్టు కొనుచు
        రోదించు నాగిని;
వట్టి మాటలాడు
        వారి జూచి;
నేను పోయి మంత్రగాని
        దెత్తు నటంచు
ముంత నచటబెట్టి
        పొంత బట్టె.
"పాము గఱచెను
నే డమావాస్య గూడ,
కష్టమే" నని రామయ్య
కట్టమీద గూరుచుండి
అనెన్‌ పోవువారితోడ
ఆకుమూటలో నున్న
పొగాకు దీసి.
మాలపున్నమైన
        మరుసనాడే కదా
పాము గఱచి చచ్చె
        రాముడనుచు,
సాలె నారణమ్మ,
        చాల విచారించి
కట్లపొడిని నోట
        గలుపుకొనియె.
రంగ డొక్కక్కటే విని
        రగులుకొనుచు
చెంగు నెగబెక్కి,
        బర్రైన చేతలేక,
ఆ తమోగర్భమున బడి
        అరుగుచుండె
భయము తోచదు కర్తవ్య భారమున్న.
కన్ను పొడుచుకొన్న
        కనరాని చీకటి
పురుగుపుట్ర యిచట
        పుట్ల కొలది;
అసలువాడు, దారి
        నైన చూచుటలేదు
కలదు దృష్టి
        మంత్రగాని మీదె.
గుండెతీసిన బంటైన
కొండదోవ, కనుమదాటి,
చీకటిపడి చనుటయన్న
ఒప్పుకొన లేడు;
కాని, ఆ ముప్పు జూచి
తప్పుకొనలేదు
        రంగని గొప్ప మనసు.
కళ్లలోన మెదలు
గంగమ్మ సంగతే తట్టలేదు;
రంగడుట్టిపాటు పయనమయ్యె
రెండు పరువుల పల్లెకు;
ఎద కరంగునప్పు డేది నిలుచు.
ఊరు మండిపోవుచున్న సరే!
రెడ్డిగారి మేడమీద
భారతమ్ము,
రాగశయ్యతో పురాణమ్ము సెప్పును
రామశాస్త్రిగారు
రాత్రి రాత్రి.
ఊరిబయటకు వినిపించుచుండె
నతని పెద్ద గొంతుక,
ఊరెల్ల దద్దరిల్ల;
"తనకు తోడయి వచ్చును ధర్మమొండె"
అన్నమాట ఒక్కటె
కొండ అనువదించె.
ఇది నాల్గవ సర్గ.
AndhraBharati AMdhra bhArati - kaavyamulu - pennETi pATA - Vidvan Viswam - Vidvan Visvam( telugu andhra )