కావ్యములు పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం మూడవ సర్గ
మూడవ సర్గ
రంగన్న గబగబా పా
రం గడగా ద్రోసి మొగ, మురమ్ముం గాళ్ళు
ముంగల చేతుల కడుగుకొ
నెం గంగను దెచ్చి యిచ్చు నీటి ముంతతో.
కుండలోని సంగటి నంత గోకితీసి,
మూకటిని బెట్టి,
        మజ్జిగ మునుగ బోసి,
పచ్చిమెరపకాయొక్కటి తెచ్చి యిచ్చె -
ఉదయ భోజన మతని
        కియ్యదియె సుమ్ము.
గంగమ్మ పదారేండ్లది
కొంగు నిలుచునంత వయసుగూడ లేని, దా
సింగారపు బొమ్మే మన
రంగన్నకు బ్రతుకులో చిరత్న రత్నమౌ.
అంగమ్ముల నిగనిగ, సా
రంగమ్ముల లగువు బిగువు రంగుల సొగసుల్‌
ఖంగున మ్రోగెడు కంఠము
బంగరు బొంగరము పుణికి పట్టిన దపుడే.
రంగు వెలిసిన నీలిచీర చె
ఱంగులకు సౌరుంగడించి, తు
రంగలించు కురంగనయనా
        స్నిగ్ధ వర్తనముల్‌;
చెంగు చెంగున చెంగలించి, బె
డంగు సొబగుల రంగలించి, వి
హంగ భంగుల వింగడించు - ల
        తాంగి చందమ్ముల్‌.
సిల్వరు కడియాలే ఆ
చెల్వకు సొగసులను గూర్చె -
        చెవుల బెండు గ
మ్మ ల్వయ్యారము మిసిమి పసిమి
        కలకలలాడన్‌.
చెండుమల్లె చాలు
        నిండుదనమ్మిచ్చు
కొండగోగుచాలు
        దండి దండి!
వెండి బిళ్లచాలు
        వెలుగుల విరియించు
కొప్పులోనె గలదు -
        గొప్పదనము.
తిప్పలెన్ని పడిన,
        ముప్పుల మున్గిన
ఉప్పు పప్పు లేని యునికియైన,
కప్పురంపు టెడద
        కమ్మని తలపులు
నిప్పువంటి బ్రదుకు
        గొప్పనిచ్చె.
అమ్మలేదు,
        నాన్న అంతకంటెను లేడు;
కొమ్మలేదు, పట్టు గొమ్మలేదు;
నిమ్మళమ్ముగ నెట్లొ
        నెగడించె జీవిక
సొమ్మసిలక
        బాప జూచువఱకు
అక్క, బావ పిదప
        నల్లారు ముద్దుగా,
సొంతపిల్లలాగ జూచుకొనిరి;
తమకు పిల్లలేల?
        తలిదండ్రులే, తా
మటంచు పెంచినారు, మంచివారు.
చాకి, సంతరించి
        చదువు చెప్పించిన
బావ యెద్దు పొడిచిపోవగానె,
అక్క గడ్డిమోపు
        లమ్మి పోషించెను
లేమియేమి సేయు ప్రేమయున్న?
మగవాడు పోయెనే యని
పొగలుచు గంపంత దిగులు పొడుచుచునున్నన్‌;
మిగులో సగులో తా దిని,
తెగించి చెల్లెలిని సాకె దేవమ్మొకతే
అక్కదేవమ్మ దేవత!
చిక్కులెన్ని నొక్కు చున్నను,
చెల్లెలి జిక్కనీక,
మిక్కుటమ్మగు మక్కువ
రెక్కవట్టి నడుపుకొని వచ్చె
తక్కువన్నదియె లేక.
పేదరాలు గనుక,
పేదకుటుంబము చిదికి
నిలిచినట్టి చిన్నవాని,
వెదకి వెదకి,
కడకు వీని రంగన్నను జూచి
పిల్లనిచ్చి చొక్కి పోయె.
గంగమ్మకు రంగన్నకు
సింగారముజేసి, పెండ్లిచేసిననా, డా
యంగనకనులన్‌, మాలిమి
పొంగులు రంగులను సూపి పూర్ణత నందెన్‌.
మాలిమి తాలిమిన్‌
గొలుచు మానము లేదు;
కులాద్రులం దలం దాలిచి
సప్తసాగర వితానము నీదుచు
కల్పముల్‌ తపఃపాలన సేయనీ,
ఎడద బాకుల పోటుల బ్రువ్వనీ -
వసంతాల, వనాల,
పూల పవనాల
విలాస విహారమే యగున్‌.
పెనుబలము గలది మక్కువ
తనుదానై తన్నుదాను తఱుగు
        కొనుటకున్‌.
వెనుదీయనీదు, నిన్నెం
తె నిరామయ దివ్యకర్మ నిష్ఠునిజేయన్‌.
అనురాగ హీన జీవిత
మనయము నిన్నడచి పుచ్చు నతిభారమ్మై
నిను నన్ను చేయిగలిపి, ఆ
వని మాఘవనిన్‌ బొనర్చు వలతి యదొకటే.
రంగన్న గంగమ్మ
రంగురక్తిమలు
రంగన్న గంగమ్మ
నింగి నీలిమలు.
రంగన్న గంగమ్మ
సింగారములు జిమ్ము
రంగారు బంగారు
పొంగారు గోపురాల్‌.
రంగడంటే ఒక్క గంగమ్మ మగడె -
గంగమ్మ అన నొక్క రంగన్న పడుచె.
రంగన్న బ్రతుకెల్ల గంగమ్మ బ్రతుకె
గంగమ్మ మనసెల్ల రంగన్న మనసె.
రంగని గంగన్నాయని,
గంగమ రంగమ్మయనుచు గ్రామప్రజలున్‌
భంగుల భంగుల పిలుచుట
కంగారునెకాదు, వారి కలయిక దెలుపున్‌.
గంగమ్మ నలనల్ల
        గాజుల రవళిలో
గంగమ్మ అఱనీలి
        కన్నుల మగతలో
రంగన్న రుచిచూచు
        రాగుల అంబలే
హంగైన భక్ష్యభో
        జ్యాల మరపించు\న్‌.
చూపులేగాని,
        మాటలజోలిబోక;
వలపులేగాని,
        వాంఛల వంకబోక;
పనిత్వరలెకాని
        సరసాల పాలుగాక -
గబగబా ముగియించి
        రంగన్న వెడలె.
కొడవలి పగ్గము చేకొని
నడచెన్‌ రంగన్న, కొండ నడుమకు ప్రొద్దున్‌
గడచుచు నున్నది, రావలె
వడి వడిగా - మోపు మేత వట్టి మాటలా!
ఊరికి చేరువనే గల
దోరగ ఒకకొండ, దాని దొరువుల వెంటన్‌
చేరగవలెనెత్త, మ్మా
చేరువనే పెద్ద యడవి చిక్కగ నుండున్‌.
ఒకడా యిద్దఱ! చాలమంది,
తమకెంతో కొంత
ఆపూట జీవికకుం దోడ్పడునంచు
వత్తురు సరే!
వేయేండ్ల కొక్కొక్క వానకదా!
అక్కడమాత్ర మెట్లు గఱకైనా పుట్టు?
ఏ పాతచెట్లకుగానీ చివురేది?
పచ్చనలు తాటల్‌ దీసినా చూడమే?
చినుకులు పడనే పడితే
అనుమానములేదు గ్రామమంతా సాకున్‌
వెనుదీయదుమల! కావల
సిన వన్నియు నడవిలోన చిక్కును సుమ్మీ.
కానీ యెపుడో, ఎచటో
నానుపు వానైన పడిననాళ్ల\న్‌, కొండల్‌
వేనలి విరియ\న్‌, మిన్నుల
చానవలె\న్‌ గానబడును చాయలుదేలు\న్‌.
కాసేపు రాల్చిన గంపల కొలదిగా
        కమ్మనికలివిపం డ్లమ్మవచ్చు;
కొంతసేపేచాలు కొల్లలు కొల్లలు
        బలసకాయలు గంప బట్టవచ్చు;
ఇంతసేపే చాలు నెన్నైన రేణగా
        యలు కోసుకొని అమ్మనైనవచ్చు;
ఒక యింతసేపు నోపిక గోసుకొన్న చాల్‌
        సీమచింతలు వడి జేర్చవచ్చు -
వీని యాదరువున
        ఊరిలోని పేద
చాన లెందఱో,
        ఆనాటి సారమునకు
చాలినంత గడింతు
        రా కాలమందు
కాయకసురుల కేమి!
        చాలాయె దొరకు.
తిండికి చాలని కక్కుఱితిం
డాపల వెలుపలనక
తేపతేప కొట్టండసిలెను
చిక్కని కొండ యడవి
అగ్గిపడుట కొంత నశించెన్‌.
తేనె తెట్టెలతో చాలు
తెలిసియున్న చాల
సాధించవచ్చు;
నచ్చటి రకాల ఆకులే చాలు
కొందఱి ఆకలణచు;
టేకులే తీర్చు
కొందఱి పీకులాట
మడక మొదలు
కాడి మానుదాకా,
గొఱ్ఱుతుంట మొదలు
మేడితోకదనుక,
బండి కుండ మొదలు
బారు నగలదాక -
కొండలోనె
దెచ్చుకొనగ వలయు.
కాని, ఇవన్నీ - పేదల
నోనాడిన పెద్దవారి నోటవడియె, నిం
కే నాయము సెల్లదు, నీ
వా నాయనగారి శరణమనుటే తప్ప\న్‌.
కావలివారి కన్నుగవ గప్పి,
ఒకప్పుడు పట్టుకొన్న
నే పావలొ అడ్డగో
వదలు పట్టు నెఱింగి,
మఱింత తప్పిన\న్‌
చావడిలోని కీడ్చుకొని చన్న
సరే అనుకొన్న వారె
ఏదో విధిలేక పోదు,
రదియు\న్‌ కొడవంటిని
        దోచు నెప్పుడో.
కానీ తప్పనిసరియై
ఈనాటికి గూడ కొందఱట్లే వీడు\న్‌
కానకు బోవును, చుట్టఱి
కానికి దాయాది తాను గ్రామస్థులకు\న్‌.
గడ్డిమోపు దెచ్చు,
కాకున్న గట్టెలమోపు దెచ్చు,
నదియు నోపకున్న -
మొద్దుకొట్టి తెచ్చి
మునియప్ప కమ్మును,
"మడకొ బడకొ ఏదొ
మిడుకు" మనుచు,
పొలము పనిలేని
        రోజులప్పుడు తనెట్లొ
బ్రదుకవలె మఱి!
        కూలికి ప్రాలుమాలి
కాదు; పనియేది?
        ఏడాదికంత కొక్క
మూడు నెలలే పనుల్‌
        కడముట్టు టెట్లు?
దొరికిన గడ్డీ గాదము
బరబర కోసుకొని
        గోగు పగ్గము బిగియిం
చి, రయమ్మున నడి ప్రొద్దున
విరవిర లాడుచును వచ్చి
        వేసెన్‌ మోపున్‌.
ఎఱ్ఱటెండ ప్రొద్దు;
ఏడు మూరల గడ్డిమోపు మెడలపైన;
మూడుమట్ల లోతు కనులు;
పొట్టలో వీపు జేరెను -
వగడు వోలె నతడు
వణకు చుండె.
ఆ నిమిష మతని జూచిన
ఏ నరమానవుని గుండెయే యయిన\న్‌, లో
కానికి శాపమిదేయని,
వేనోళ్ళను విచ్చి యేడ్చి విఱవిఱలాడు\న్‌.
గిరగిర కన్నుల నీరుం
దిరుగగ, గంగమ్మ చెఱగు దీసి యొత్తుచున్‌
చరచర లోనికి వెళ్ళెను
పురుషుడు తనకంటి నీరు పోల్చు నటంచున్‌.
మగడు కొండకు బోయిన
        మరు నిముసమె
గబగబా లేచి గంగమ్మ
        గవిని వారి
వడ్ల దంపకమున
        దనవంతు, తవ్వ
ముగ్గు చెన్నంగి వడ్లు
        ముమ్మారు జేసి -
చేట నారబెట్టి,
        బాటమీదే యున్న
చక్క రోటిలోన
        చక్కదంచి,
కుండ యెసరు వెట్టి
        కుతకుత మనిపించి,
చింతకాయ దంచి,
        పొంత నింపె.
పొంతనీళ్ళు దెచ్చి,
రవంత వంగి నిలుచుకొన్న
రంగన్న పైనిమిరి, నిమిరి
కడగుచున్న
ఆ యిల్లాలి కరయుగమ్ము -
వేయి సంజీవనుల
మేళవింపు సుమ్ము.
ఆ నిర్మల ప్రేమ
        హస్త సంస్పర్శతో
మానిపోయిన వేమొ
        వాని గాయములు;
లోని ఒక్కొక్క యెముక
        హూనమై యున్న
వాని తీపులు కొంత
        వదలినట్లయ్యె.
ఇన్ని యిడుములు
నీకోసమే భరియించుచుంటినని
ఆతడనడు;
నీ సుఖము కొఱకె
బ్రదుకుచుంటి నటంచు
ఆమె పలుక దెపుడు;
మాటలేటికి
మనసులో మరులు పొరల?
అతని యడుగుల చప్పుడే
ఆమె మొగము నింత విప్పార్చు,
మాట రవంత విన్నజాలు
కన్నులలో వసంతాలు విరియు
చూసెనా యిక -
        నిలువెల్ల చొక్కిపోవు.
మూడు నాలుగు మాటలే
మూడువేల ప్రేమ గీతాల
ఆవేగ సీమ దాటు
హృదయములె
మాటలాడుకో మొదలు వెట్ట
నాల్క నటునిటు
        కదలించు నాథు డెవడు?
చూపులతోనే వలపుల
రూపు దిద్దు కొనుచు,
ఆ పడంతి బువ్వబెట్టె
దాపున గూర్చొనుచు.
ఇది మూడవ సర్గ.
AndhraBharati AMdhra bhArati - kaavyamulu - pennETi pATA - Vidvan Viswam - Vidvan Visvam( telugu andhra )