కావ్యములు పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం రెండవ సర్గ
రెండవ సర్గ
రంగనికి గలట్టి
బ్రదుకుటాదరువు 'యర్రోని చేను' పాలు
రొంపి రొచ్చు;
ఉన్న దొక్క యెకర మూపిరి దీయును,
కాల్వ త్రొవ్వ కమ్మె
కండ లూడ్చు.
ఒకనా డతని నాన్న
ఊరిలో పెద్ద సంసారి;
నాలుగు కాండ్ల సాగుబడిని సేయు
పట్టాదారు;
వేయారు రైతుల కిస్తీల కస్తీల,
కేలు సాపి ఆదుకొనుచు
మంచి యనిపించు కొన్నాడు;
పేదసాదల కింత పెట్టినాడు;
ఊరి దేవళమున
కొకనెల కొకరోజు పూజ కిచ్చు
పెద్ద పుణ్యవంతు డనుచు
తంబళ్ళ సుబ్బమ్మ దినదినమ్ము
నొప్పుకొనుచుండు;
దాసరి ఓబిళేసు -
గరుడ గంబమ్ములో
వెండికాసు వేయు పరమ భాగవతుం డని
పాడు నతని.
గుడిసె ముందట నీడలో గూరుచుండి,
అలతి యీతాకు చాపల నల్లుకొనుచు,
దొంగ సుంకన్న తిరణాల తోదులోన
పాటగట్టె నీయనపయి మేటి యనుచు.
"సై సై నారపరెడ్డి నీ
పేరే బంగరు కడ్డిరా॥
పారబోస్తివి దాన్యమంతా
ఊరడిస్తివి పేదవోళ్ళను
కోరమీసం మెలీపెడితే
సీరాముడు నీవే నయ్యా॥
అంతపూరం బాటలోనా
చింతలపల్లె చెఱువుమీనా
పంతమేసీ బండిదోల్తే
పటుకలాసనె కలెకటేరూ॥
పప్పూరూ అసీవెర్తం
పరషలో కోలన్నగాళ్లు
పాడుతాంటే సంచి రూకలు
పారేస్తివి బట్టమీదా ॥సైసై॥"
అది పల్లెపాట నె
        మ్మదిలోని మాట;
మొద లుండునే కాని
        తుదలేని బాట;
పదినోళ్ళలో పడి
        పదిరూపు లెత్తి,
కదలి పోయెడు కైత
        కమ్మని యూట.
బట్ట లచ్చుమయ్య, బండారు బసవయ్య,
పంచ రత్నములను బట్టిపెట్టి
ఊరి సుంకులమ్మ
        తేరునా, డీయన
సన్నిధానమందు చదివినారు.
"శ్రీసుంకులాంబ నీ కే
గాసియు రాకుండ జూచి గ్రమ్మఱ బ్రోచు\న్‌
భాసుర కీర్తి పతాకా
ధూసరితాజాండకుండ దోర్బలశుండా!
పాకారి ప్రభృతులలో
శోకారి యటంచు పేరు సొగసుగ గను, నా
కాకాసుర సంహారి, ని
రాకృత దుష్టారి బ్రోచురా నారప్పన్‌.
ఇంద్రుడ వీవె చండ్రుడవు
        నీవె యటం చని మాదు డెందముల్‌
సందడి సేయుచుండె నర
        సన్న కుమారుడ, నారపాఖ్య! నిం
బొందిన మా పురీ విభవ
        పూర్ణత నెంచగ నాదిశేషుడున్‌
తొందరవోవు! పత్తికుల
        దుగ్ధ పయోధి సుధాకరా! వరా!
ఇల్లాలు నీకు రామమ -
చెల్లెలు నాగన్నరెడ్డి సింహునకున్‌; నీ
వల్లుడవు దుబ్బిరెడ్డికి
ఫుల్లాంభోజాత నేత్ర! పూతచరిత్రా!
ఎద్దులబండి నెక్కి, పయ
        నించుచు నుండగ ధూళి రేగి, ఆ
ప్రొద్దున మూసివేయగనె
        పో సురవైరులు లేచి వచ్చి, రా
యెద్దుల తోకలం గలుగు
        నింతటి మారుతమంత వీచినన్‌
దద్దయు ప్రొద్దుదోచె - పిశి
        తాశను లంతట పారిపోవరే!"
ఈ పంచరత్నముల విని,
కోపమ్మున మొగము ద్రిప్పుకొనె పురోహితుం;
డీపాటి చాల్‌ సెబా సనె
పాపయ్య తానొక్క పెద్ద పండితు డనుచు\న్‌.
రూకల సంచి దీసి, పెద రుద్రయ బిల్చి
        పదార్‌ పదాఱుగా
ఆకవు లొక్క రొక్కరికి
        నప్పణ వెట్టు మటంచు రెడ్డిగా
రే కరమందు నుంచి, యొనరించిరి
        గౌరవ, మంతతోనె, చా
మీకర భూష లిచ్చినటు
        మేనులు పొంగి నుతించి రందరున్‌.
ఇన్ని పొగడ్తల నా నర
సన్నకొడుకు పెద్ద పేరు సంపాదించె\న్‌,
కొన్ని దినాలకు దస్త్రము
సన్నవడం జొచ్చె, కీర్తిసంపద బలిసె\న్‌.
సర్కారు సిబ్బంది సరిజేయుటకు కొంత,
        సాలు జమాబంది పాలు కొంత;
పొరుగూరి మన్నీల సరఫరా కింత,
        ఆలేకార్ల లంచాలలోకి కొంత;
పేట పెద్ద వకీలు పిళ్లెకు కొంత,
        కాంపౌండరు మునుసామి పాలు కొంత;
కోడెరెడ్లకు కొంత, గుఱ్ఱాలకై కొంత,
        బగ్గీలకై కొంత, భటుల కింత;
పెద్ద మహడీలు కట్టిన పేర కొంత,
పూటపడి అచ్చవలసిన పాలు కొంత,
తన వివాహాలు నాల్గింటికిని మఱింత,
కొంత కొంతయె ఖర్చు కొండంత యయ్యె.
ఎదిగిన కూతు లిద్దఱకు
        నెన్మిది రోజుల పెండ్లి సేతకే
వదలెను వేలు వేలు; నిరు
        వాగుల వచ్చిన పెండ్లి బండ్లతో
కదలెను ధాన్యలక్ష్మి; కడ
        కాకియునుం దినె నేతి వంటకా;
లది గది పెద్ద పెండ్లి యని
        నారు జనా, లది చాలు రెడ్డికిన్‌.
ఒక పెండ్లాము గతించె దూమున; మఱిం
        కోభార్య కాల్జాఱి కొ
ట్టుకపోయెన్‌ పెదవంకలో, మఱొక
        బొట్టుం గట్టగా నామె, యిం
చుక సంసారము జేసి, కూతు గని,
        రెండోసారి కాన్పుం గమిం
చకపోయెన్‌, సరికొత్త రామమయె
        వేసారంగ పుత్రు\న్‌ గనె\న్‌.
వా డీ రంగడు, పుట్టిన
వాడు ముసలి ముప్పునందు, వానితల్లియు\న్‌
దూడ వయస్సుదె కద, మఱి
నా డేమో వణకుచుండె నార ప్పొకడే!
రొక్కములేక, దర్పము
        తఱుంగక, నారపరెడ్డి రూకలు\న్‌
గుక్కను గొట్ట రాలు నను
        కూతలు విస్మరియించగాక, ఈ
చిక్కుల నేమి దోచక,
        వశిత్వము చాలక, చుట్టుజేరి కు
మ్మ క్కొనరించు నాశ్రితుల
        మాటలకు\న్‌ చెవి జాల వేసినన్‌.
మఱునాడే పొరుగూరికి
బిరాన తన తలారి వెళ్ళి పెద్దిరెడ్డికిన్‌
'యరమంచికయ్య' ఆయక
మిరికించిన పత్ర మిచ్చి ఏదో తెచ్చె\న్‌.
ఇక మొదలయ్యె, రెడ్డి
        గడియించిన ఆస్తికి కత్తరింపు, లొ
క్కొక మహసూలున\న్‌ ఫలము
        కూడ ఒకించుక కమ్మి యయ్యె, నిం
చుక ధరలుం బడెన్‌, వఱపు
        సూపెను, వానలు బిగ్గబట్టె, నె
ట్లిక సవరించ నేర్చు, ఋణ
        మింతకు నంతకు మిద్దె లెక్కగన్‌.
చదలంటు వాములు చదు నయిపోయె,
        గాదెల కణజాల గబ్బిలము జేరె;
నాగలోకము దాకునట్టి పాతరలలో
        ముగ్గిన గింజలు తగ్గిపోయె
కట్ట గట్టుక నిన్పపెట్టె నిండుగనున్న
        పత్రాల దస్త్రాలు పారిపోయె;
ఏ కుండలో జూచినా కానవచ్చు
        బంగరు నగానట్ర అక్కఱల కేగె
ఒక్కటే రోజు
        మూడు రూప్యముల మణుగు
వేరుసెనగ నాలుగణాల
        వెలకు తగ్గె;
ఒక్క రూకకే యిరువదియొక్క సేర్ల
కొర్రలును జొన్నలును
        అమ్ముకొనగ వలసె.
పెద్దిరెడ్డి ఒకొక్కటే
        పద్దువేసి,
పత్తి నారప్పచేలన్ని
        కత్తరించె;
అంటు మిద్దెలు నాల్గు
        కృష్ణార్పణమ్మె
కాగ - పసులు జీవా లెద్దు
        లాగగలవె?
ఊరచావడిని చేరిరి బాకీ
దారు లందరును
        తమ రొక్కమునకు;
ఊరిపెద్ద లీమారు పూర్తిగా
తీరుమానమే
        తేలిచి చెప్పిరి
తాడూ తలుగూ
కాడీ మేడీ
పారా పలుగూ
కాఱూ కంపా
చెట్టూ చేనూ
        చేరి సమస్తము
కట్టివేసినా
        కట కట యయ్యెను.
ఎఱ్ఱ ఏగానియే గాని
        యివ్వననక,
నల్లపూసలతో
        ఆస్తినెల్ల జూపి
కట్టె వడ్డీ మొదల్‌
        కడ బొట్టు వఱకు -
పత్తినారపరెడ్డి
        నిబద్దిమనిషి.
ఏరు చెప్పిరో మఱి
        తెల్లవారు సరికె -
పత్తి నారపరెడ్డి దివాల - యనుచు
పసుల పిల్లలు గూడ
        దివాల రెడ్డి
అనగ ఊరెల్ల
గప్పున నందుకొనియె.
ఈమాట విన్నతోడనె
రామమ్మ భరించలేక, రామాయనుచు\న్‌
ఆమూల చీరె చెఱగు త
నే ముట్టించుకొని కన్యకే యయి పోయెన్‌.
నారపరెడ్డీ నారప్పయ్యెను
ఊరి మోతుబరి ఉప్పరి యయ్యెను
దారిమోటులో పూరికొట్టమున
చేరెను
        తోడొక చిన్నరంగడే.
కుళ్ళి కుళ్ళి యేడ్చి
        కుక్కి మంచమునుండి
లేక లేక,
        చేయు చేవలేక,
చిన్ని రంగడిచ్చు
        చిన్నలోటా నీళ్ళు,
త్రాగి, ముసలి రెడ్డి
        సాగి పోయె.
తల్లి దండ్రి లేని,
        తనవారెవరు లేని
చిన్నవాని గతిని
        విన్నగూడ
బంధుమిత్రకోటి
        పదరనైనను లేదు -
సాయపడుట కింక
        కాయ మొకటె.
వాడే రాంగాడయ్యెను
పాడా కసవులను దీసి, పసులగాసి, కూ
లోడా యనిపించు కొనె\న్‌
లేడా నారప్ప వీని లేమిడి చూడ\న్‌.
ఎన్ని బడబాగ్నులా చిన్ని యెడద
రగులు చున్నవో?
ఎన్ని కార్చిచ్చు లున్న యవియె?
ఎన్ని సంవర్త ఝంఝల కెదురు నిలిచి
వాడి వత్తయి పోయెనో
వాని బ్రతుకు!
ఒకరింటి గాటిలో నూరిన గంజెల్ల
        నెత్తిపోయుట కెంత యేడ్చినాడొ!
ఒకరింటి దొడ్డిలో నుండిన కసవెల్ల
        నూడ్చివేయుట కెంత ఉడికినాడొ!
ఒకరింటి నట్టింట నున్న కొఱ్ఱలనెల్ల
        దంచుట కెంత కంపించినాడొ!
ఒకరింట గంపలకున్న రాగులనెల్ల
        విసరుట కెంతగా విసివినాడొ!
ఒకరి యింటిలో
        పిల్లల నూచుటకు,
మరొక్కరింట
        పక్కలు వేయ,
నొక్కరింట
        అరవచాకిరీ
చేయుట కొఱకు -
ఎంత యెంత దురపిల్లెనో
        వాని యింత యెడద!
కటిక కారము సంగటి
        గుటక వడక
ఎన్ని బిందెల నీళ్ళు
        త్రావించినదియొ!
ఎండు రొట్టె ముక్కలు
        అఱిగింపుగాక
ఎన్ని మిరప గింజల
        నమిలించినదియొ?
ఇవియుం దొరకక పుడిసెడు
గవినీళ్ళం ద్రావి ముడుచుక పరుండిన పా
డు విభావరు లెన్నో, లె
క్కవిలేవరి యేది?> వల్లకాటి మనుగడ\న్‌.
రంగడు -
        తొలికోడి కూత క
        న్నులు నులుముకొనును!
        పిలిపించగానె, చె
        ప్పులు తొడుగుకొనును;
        గల గంటమ్రోత చే
        తుల మ్రొక్కుకొనును -
        వెలుగెక్కగానె పం
        టలు చూచుకొనును;
        మలి సంజలోన కం
        డలు తడువుకొనును;
        చలివెట్టగానె ప్ర
        క్కలు దాచుకొనును;
        నెల ఎక్కగానె గ
        జ్జలు కట్టుకొనును;
        కల కంఠ మెత్త కో
        యిల లూడి పడును -
కల మెఱుంగడు గాని వలపుతుంపురుల
నిలువెత్తువోసి చిన్నెలు సూపగలడు
        బళిబళీ రంగన్న
        గళమె కావ్యమ్ము.
'కోలుకో' లని కోలగొట్టిన జాలు
        జాలువాఱును 'భరతా'లు వేలు;
'ఓ-' యంచు నొక యాల సాయించితే చాలు
        జాఱు 'గాథాసప్తశతు'ల శతులు;
'మచ్చుదిగవే' యన్న మరులు పాటయె చాలు
        పొదుగు సేపును - 'అష్టపదుల' పదులు;
'గరుడగమనా' యరచు గాత్రమెత్తిన చాలు
        పొంచిచూచును 'మూక పంచశతులు' -
వేల వేల పదాల
        సామేల వలయు
ఖంగుమనగల గుండె చిక్కనయెయున్న -
వేయిరూకల మాణిక్య వీణయేల?
వెదురు చాలదె
        పలికించు పదిలమున్న?
పుట్టుకవి, గాయకుడు,
        నటరాట్టు నతడు -
కట్ట తెగగొట్టుకొని
        రస ముట్టిపడగ
ఉట్టిపాటున
        కన్నీరు లురలి పొరల
చెట్టు పుట్టలకే
        గుండె పుట్టజేయు.
ఆ రంగన్నే కాలువ త్రవ్వకానికి పోతూ యాల పాడుతున్నాడు.
        వాని తియ్యని గొంతుక లోన లోన
        తీగ సాగుచు నున్న దుద్వేగ రవము
        వాని చిక్కని గుండియ లోన లోన
        పూవు పూయుచు నున్న దుద్బుద్ధ రసము.
        వేకువ రేకు
        లొక్కొకటి విచ్చుచు నున్నవి;
        వేప కొమ్మల\న్‌
        కాకులగుంపు లొక్కొకటిగా
        తొలిమున్కల కేగుచున్నవి;
        ఆ కోకిల ఒక్కటే -
        గుబురు కొమ్మల రెమ్మల వీడలేక
        కూకూ కుహు అంచు
        నొక్కొకట గూయుచు నున్నది
        తెల్లవారగన్‌.
ఆ ప్రశాంత ప్రభాత
        సంయాతమంద
మంద మరుదంకురముల
        మైమఱచి సొక్కి,
కలతలన్నిటి మఱచి
        రంగన్న
కంఠమెత్తి పరిసర ప్రకృతి
        మంత్రించి లేపె.
ఆ క్షణమ్మున,
        గాన లయామృతమున
లీనమై పోయి
        ప్రకృతికి - మానవులకు
నడుమ నున్నట్టి
        యవనిక ముడిచివేసి
మధుర నిర్మల
        పరమ సమాధి నిలిచె.
జీవితమ్మున
నట్టి రసావబోధ సిద్ధి
ఎన్నడోగాని వాసించబోదు!
వేయి యుగముల
సాధనవిధు లవెల్ల
అట్టి తృటికోసమే
తప మ్మాచరించు.
అటుమీదట నందఱు, మి
క్కుటమగు సంతసము గుండె గూడుగట్ట, ని
ట్టటు కదలక నిలుచుండిరి;
తటాలుమని "పిన్న పెద్ద" దరిసెనమయ్యె\న్‌.
సరి! పిమ్మట మామూలే!
చరచర పారలను బట్టి సాలుమేఱ, కా
ల్వ రమారమి మైలున్నర
వఱకుం ద్రవ్వకము రోజువారి రివాజే.
అంబటి ప్రొద్దు కాగనె
        రవంత విరామము గూడ లేక, వా
రుం బరువెత్తి రింటికయి
        రొప్పుచు రోజుచు, నంగకమ్ము లె
ల్లం బులకాపుజేసి నటుల\న్‌
        జెమటల్‌ జెమఱింప, ప్రేవులు\న్‌
దంబుర మోతమ్రోయ
        నిరత శ్రమదగ్ధు లుదాత్త జీవనుల్‌.
ఇది రెండవ సర్గ
AndhraBharati AMdhra bhArati - kaavyamulu - pennETi pATA - Vidvan Viswam - Vidvan Visvam( telugu andhra )