కావ్యములు విజయ విలాసము పీఠిక
రఘునాథ నాయకుని రమణీయ గుణగణములు
క. ఆ పుణ్య ఫలంబుననె ద
యాపాథోరాశి యైన యల యచ్యుత భూ
మీపతికిన్‌ రఘునాథ
క్ష్మా పాలుం డుదయ మయ్యె జైవాతృకుఁడై.
16
ఉ. పుట్టిన దాదిగాఁ దనదు పుణ్యమె దాదిగ, వైరిభూమి భృ
ద్ధట్ట మదంబు దాదిగ, సదా దిగధీశ నుత ప్రతాపుఁడై
పట్టమహాభిషేక బహుభాగ్య ధురంధరుఁడై యయోధ్య య
న్పట్టణ మేలు సామియె యనన్‌ రఘునాథ విభుండు వర్ధిలున్‌.
17
మ. రసికుండౌ రఘునాథు కీర్తిసతి యౌరా! తొల్త వాగ్బంధమున్‌,
రసవాదంబును, రాజవశ్యవిధి నేరంబోలుఁ; గాకున్న వె
క్కసపుం బ్రౌఢి వహించి శేషఫణి మూఁగం జేయఁ, దారాద్రి ను
ల్లసముల్‌ వల్కఁగ, ఛత్ర చామర మహా లక్ష్ముల్‌ నగన్‌ శక్యమే?
18
చ. నలువగ నెన్ననైన రఘునాథ నృపాలుఁడు గల్గఁగా మహీ
స్థలి నిఖిలైక ధర్మములుఁ దామర తంపరలై చెలంగెఁ; గొ
ల్లలుగ నశేష సజ్జన కులంబు సుఖంబు గనెన్‌; సమస్త వి
ద్యలుఁ గసటెల్లఁ బాసి మెఱపై వెలపెట్టె సభాంతరంబులన్‌.
19
ఉ. శైలము లెక్కి, యష్ట మద సామజ మౌళుల మీఁదుగా, మహా
కోలకులేంద్రు వాడి, బలు కొమ్ము మొనం బడి, సర్వదా విష
జ్వాలలు గ్రమ్ము శేషు తల చాయనె యోడక వచ్చి కూడె నౌ;
భూ లలితాంగి కెంత వలపో రఘునాథ నృపాలమౌళిపై?
20
సీ. రత్నాకరాంతోర్వరా విహారుం డౌట నగ్రహారము లసంఖ్యముగఁ జేసె;
నమిత దానవినోది యౌటఁ గక్ష్యాంతర భద్రకుంభీక్షణ పరతఁ దనరె;
దషిణ నాయకోత్తముఁ డౌట మేలైన మలయజగంధి మండలము నేలె;
భరత విద్యా ధురంధరుఁడౌట రంగస్థలంబు రామాలంకృతంబు చేసె;
 
తే. నౌర! కర్ణాట సింహాసనాధి రాజ్య భరణ నిపుణ రణోద్దండ బాహుదండ
జనిత సాపత్న్య సంవాద జయరమా మహీ లలిత కేళి రఘునాథ నృపతిమౌళి.
21
శా. రాజున్‌, భోగియు, సౌమ్యుఁడున్‌, గవియు, సర్వజ్ఞుండు నీ డౌననన్‌,
దేజః ప్రౌఢవచో వివేక నయ భూతి శ్లాఘలన్‌ మించు నౌ,
రాజున్‌, భోగియు, సౌమ్యుఁడున్‌, గవియు, సర్వజ్ఞుండు నెబ్భంగులన్‌,
యోజింపన్‌ రఘునాథ భూరమణ వర్యుండే ధరామండలిన్‌.
22
సీ. అరిది సింగపుఁబల్ల మమరించె నే రాజు మేలుఁ దేజికిఁ బదివేలు సేయఁ
జికిలి బంగరు దిండ్ల పికిలి కుచ్చుల యందలంబెక్కె నే రాజు లక్ష సేయఁ;
గనక మయంబుగాఁ గట్టించె నే రాజు సాటిలేని నగళ్ళు కోటి సేయఁ
గంఠమాలిక మొదల్‌ గాఁ బెట్టె నే రాజు గొప్ప సొమ్ములు పదికోట్లు సేయ;
 
తే. నతఁడు విభుమాత్రుఁడే! బహుళాగ్రహార నిత్య సత్త్ర మహాదాన నిరత పోషి
తాహిమాచల సేతు ద్విజాభిగీర్ణ పుణ్యవిభవుండు రఘునాథ భూవిభుండు.
23
చ. త్రికరణ శుద్ధి నచ్యుతుని శ్రీరఘునాథ నృపాలు వైఖరిన్‌
సకల మహీసురావళికి సత్త్రము లెప్పుడుఁ బెట్టలేఁడకా
యొకదొర, యందు లెక్క విని యొక్కొక నాఁటికె యింత రొక్క! మిం
తకుఁ దెగసాగెనా! యనక తా ముద మందినఁ జాలు నెమ్మదిన్‌.
24
సీ. అడుగుమాత్రమె కాక యంత కెక్కుడుగ నీఁ జాలెనే యల బలిచక్రవర్తి?
యా వేళ కటు దోఁచినంత మాత్రమె కాక కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి?
తూఁగిన మాత్ర మిత్తు ననెఁగా కిచ్చ వచ్చినది కొమ్మనియెనే శిబి విభుండు?
కలమాత్ర మపు డిచ్చెఁ గాక కట్టడ గాఁగ ననిశంబు నిచ్చెనే యమృతకరుఁడు?
 
తే. వారి నే రీతిఁ బ్రతి సేయవచ్చు నెల్ల యర్థులఁ గృతార్థుల నొనర్చునట్టి యప్ర
తీప వితరణికి, మహా ప్రతాప తిగ్మ ఘృణికి, నచ్యుత రఘునాథ నృపతి మణికి?
25
ఉ. తప్పులు వేయుఁ గల్గినను దాళును నమ్మిన వారిపట్లఁ; దాఁ
జెప్పినమాట యూర్జితము సేయు; నొకండొరుమీఁదఁ గొండెముల్‌
సెప్పిన వానికై మనవి చెప్పిన రీతిగ నెంచు; నీడు గా
రిప్పటి రాజు లచ్యుత నరేంద్రుని శ్రీ రఘునాథ శౌరికిన్‌.
26
సీ. ఆకారమున నలునంతవాఁడౌనె కా హయ సమ్యగారూఢి నంతవాఁడె!
యతి దయామతి రాము నంతవాఁ డౌనె కా యసమాన గురుభక్తి నంతవాఁడె!
యమృషోక్తి ధర్మజు నంతవాఁ డౌనె కా యన్నసత్త్ర ఖ్యాతి నంతవాఁడె!
యాలంబునఁ గిరీటి యంతవాఁడౌనె కా యమిత నాట్య ప్రౌఢి నంతవాఁడె!
 
తే. రసికమాత్రుండె యంతఃపుర ప్రడీన సార సారస్వతాధార శారికాశు
కవన కృత ముఖ శుక కళా కలన హృష్ట బుధజనాస్థాని రఘునాథ భూమిజాని?
27
ఉ. మాటల నేర్పులా! సరస మార్గములా! కొలు వుండు రీతులా!
పాటల గంధులా! కళలభాగ్యములా! బహు దాన లీలలా!
నాటకశాలలా! యొకటనన్‌ వల దెన్నిటఁ జూడ నన్నిటన్‌
మేటియుఁ, గీర్తిలోలుఁడు జుమీ! రఘునాథ నృపాలుఁ డిమ్మహిన్‌.
28
వ. అని రఘునాథ మహీకాంతు ననంత శోభన గుణమ్ములలోన
గొన్ని యభివర్ణించి.
29
తే. నన్ను నడిపిన బహుళ సన్మాన మెంచి
యఖిల విద్యా విశారదుఁ డగుటఁ గాంచి
యవని నింతటి రాజెవ్వఁ డని నుతించి
కృతులొసఁగఁ గీర్తి కలదని మతిఁ దలంచి.
30
ఉ. తా రసపుష్టిమైఁ బ్రతిపదంబున జాతియు వార్తయున్‌ జమ
త్కారము నర్థగౌరవముఁ గల్గ ననేకకృతుల్‌ ప్రసన్న గం
భీరగతిన్‌ రచించి మహి మించినచో నిఁక శక్తు లెవ్వ ర
య్యా! రఘునాథభూప రసికాగ్రణికిన్‌ జెవి సోఁకఁ జెప్పఁగన్‌?
31
మ. కలిగెంగా తన సమ్ముఖం బనియు, సత్కారంబు తాఁజేయ నా
తల నెందే శిరసా వహింతు రనియుం, దాఁగాక లేదెందు సా
ధులకున్‌ దిక్కనియున్‌, దయన్‌ మనుపు రీతుల్‌ గాక శక్యంబె వి
ద్యల మెప్పింపఁగ నచ్యుతేంద్ర రఘునాథస్వామి నెవ్వారికిన్‌?
32
చ. అని గణియించి యైనను, గుణాంశ మొకించుక కల్గినన్‌ బళా
యను; నదిగాక మిక్కిలి నిజాశ్రిత పక్షము కల్గు సత్కృపా
ఖని, యణుమాత్ర మైన నొక కానుక దెచ్చినఁ గొండగాఁ గనున్‌;
మనమున నచ్యుతేంద్ర రఘునాథుఁడె శ్రీరఘునాథుఁ డెన్నఁగన్‌
33
క. కావున నే నొనరించిన
యీ 'విజయవిలాస' మనెడి కృతి రత్నంబున్‌
గేవల భక్తిని గానుక
గావించెద నని నితాంత కౌతూహలినై
34
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - pIThika - chEmakUra vEMkaTa kavi( telugu andhra )