కావ్యములు విజయ విలాసము పీఠిక
కృతి సమర్పణము
క. శుభ వాసరమున, సయ్యెడ,
నిభవాజిముఖోపదా నిరీక్షేచ్ఛ మహా
విభవాభిరాముఁడై భా
వభవాకృతి భద్రపీఠ వాసోజ్జ్వలుఁడై
35
సీ. కుందనంపుఁ బసిండి కుళ్లాయి జగలపైఁ జౌకట్ల నిగనిగల్‌ చౌకళింప;
హురుముంజి ముత్యాల యరచట్టపై గొప్ప పతకంపు హారముల్‌ పరిఢవిల్ల;
వెలఁ జెప్పరాని కెంపుల వంక జముదాడి పీతాంబరంబుపైఁ బెరిమె నెఱప;
గబ్బి మన్నె కుమార గండపెండేరంపు జిగి పదాగ్రంబుపైఁ జెంగలింప;
 
తే. దొరల మంత్రులఁ గవుల నాదరణ సేయు కరము కంకణకాంతి నల్గడల నిండ,
నిండు కొలు వుండెఁ గన్నుల పండువుగను ఠీవి నచ్యుత రఘునాథ భూవిభుండు
36
తే. అట్టు లొడ్డోలగం బున్న యవసరమున
వినయ భయ సంభ్రమములు నా వెంట నంట
ననుఁ గృపాదృష్టిఁ జల్లఁగాఁ గనుచు నుండ
సమ్ముఖమ్మున కరిగి, యంజలి ఘటించి
37
ఉ. ఏలిక మాత్రమే? మహిమ నీశ్వరుఁడే తలపోసి చోడ, నా
పాలిటి రామభద్రుఁ డని బంగరుఁబూవులఁ బూజ చేసి, నేఁ
జాల నలంకృతిం బొసఁగు సత్కృతి కానుక చేసి, కీర్తి భూ
శ్రీ లలితాంగులన్‌ వలవఁ జేసిన శ్రీ రఘునాథ శౌరికిన్‌
38
ఉ. శ్రీ రస భావముల్‌ వెలయఁ జెప్పి ప్రబంధము లెన్నియేని మీ
పేరిట నంకితం బిడిన బిడ్డల నెందఱఁ బేరు పెట్టినన్‌
దీరునె మీ ఋణం? బయినఁ దెచ్చితిఁ గాన్క పరిగ్రహింపు మ
య్యా! రఘునాథ భూప రసికాగ్రణి! మామక కావ్య కన్యకన్‌
39
సీ. ఘోటక ఖుర పుట క్షుణ్ణ ధరా జాత పాంసువు పై నుల్లభంబు గాఁగ,
భట సింహ విక్రమోద్భట సింహనాదముల్‌ స్వస్తి వాదంబుల చంద మొందఁ,
బది దిక్కు లొక్కటఁ బగిలి బీఁటలువాఱఁ భేరీ నినాదముల్‌ బూరటిల్ల,
విజయ సమారబ్ధ వేళఁ గౌతుకమున మొగమున గరువంపు మురువు దోఁప,
 
తే. నౌర! పెండ్లికి నేఁగిన ట్లనికి నేఁగి యక్ష తంత్రంబు లివి యేటి లక్ష మనుచు
రేక మోవక గెల్చుట నీకె చెల్లు సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
40
సీ. ఎంచి రంటివి గాని యీ సారి గట్టిగాఁ దెగుఁ గార్య మను వార్తఁ దెలుపవైతి;
మించి రంటివి గాని మేదిని యదరంగ నడిచె సైన్యం బని నుడువ వైతి;
వంటి రంటివి గాని యాభీలతర భటో ద్భట సంగరం బని పలుక వైతి;
మొగిసి రంటివి గాని ముకుటముల్తెగి రాజ శేఖరుల్‌ పడుట సూచింప వైతి;
 
తే. వనుచు నీధాటి కెరవాఱు నహితవీరు లదరునను మాట వెడలక బెదరి పల్కు
చారుఁ గని నేర మెంతురు సారె సారె సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
41
సీ. భిన్న కటంబులై పేరు పెంపును లేక గంధనాగంబు లెక్కడ నడంగె?
బాహ్లిక శక సింధు పారసీకోద్భవ హయ ధట్ట మే గొందియందు డిందెఁ?
బోటు గంటులఁ దూఱిపోవు దారుణ మైన మాస్టీల గమి యెందు మ్రగ్గిపోయె?
గర్వంబు మేనులు గన్నట్టు లుండెడు దొరల యామిక లెందుఁ దొలఁగి పోయెఁ?
 
తే. బరుల పాళెంబు లీ రీతిఁ బన్న మొంద మాయ వన్నెను నీ ఖడ్గ మంత్రవాది
గెలిచినను నేమి మేలైన గెలుపు గంటి! సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
42
సీ. రంభ వాకిటను దోరణములు గట్టెడు తీవర మొక కొంత దీలుపడియె;
మేనక యింటిలో మేల్కట్లు సవరించు సంరంభ మొక కొంత సడలువాఱెఁ;
గనకాంగి యింటిలోఁ గర్పూరవేదికల్‌ సవరించు టొక కొంత జాగుపడియె;
హరిణి బంగరు మేడ నరవిరి సెజ్జలు నిర్మించు టొక కొంత నిలుక డయ్యె;
 
తే. మబ్బు గొబ్బున నీ శౌర్యమహిమ వినక, తెగువ తోడుత నెదిరించి, తిరిగి, విఱిగి
పాఱిపోయిన మన్నీల పాటు సూచి సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
43
సీ. అతుల భూరి ప్రతాపార్క దీధితిచేత గట్టిగాఁ గాఁకలు పుట్టు పిదప,
ఘోరారి గళరక్త ధారాళ వృష్టిచే నాని దుక్కికిఁ బద నైనపిదప,
హయ ధట్ట ఖురపుట హల్యాముఖంబున నంతట దున్నిన యట్టిపిదప,
మొలచిన నీ కీర్తి మొలకలు తఱుచుగా వెదపెట్టి పైరు గావించుపిదపఁ,
 
తే. గాపు నిలుపవె బేతాళ గణమునెల్ల నట్టి పట్టుల కరిగి నీ వరుల నోదె
పాటు చేసితి వనుట యేపాటి తలఁప సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
44
సీ. ఒకరు వోయిన దెస కొకరు వోవక పాఱ నరివీరులకు దాహగరిమ మించె;
గడగడ వడఁకి నల్గడల కేఁగక భీతిఁ జెందిన వారిపైఁ జెమట పుట్టె;
మున్నాడి యెలగోలు మూఁకలఁ బోట్లాడు పరుల మైఁ బాటల ప్రభలు మీఱెఁ;
జేగ దెచ్చుక కొంత సిగ్గున నెదిరించు రాజుల యొప్పు బీరము తొలంగెఁ;
 
తే. దెగువతోడుత ధరియించి తీవ్ర కోప భరిత రూక్షాక్షి నియమిత ప్రభల పేర
నీవు ఘర్మార్క విస్ఫూర్తి నెఱపునపుడు సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
45
సీ. తలలు వీడఁగఁ బాఱు ధరణీశ్వరులఁ జూచి యంటి వెన్నాడని యట్టి మహిమ,
పడిన యేనుంగుల ప్రక్కల కొదిగిన రాజులఁ జూడని రాజసంబు,
జళిపించు చంద్రహాసములు పాఱఁగ వైచి మ్రొక్కువారల మీఁద మొనపు కరుణ,
నెత్తురు గనుపట్ట హత్తిన భీతిచేఁ గలవరించినవారిఁ గాచు గరిమ,
 
తే. మెన్నఁ దనమీఁద బలముతో నెనసి మొనసి విఱుగు రాణువఁ బొమ్మను వీరవరుని
కీర్తిఁ గంటివి జగదేక కీర్తనీయ సమరనిశ్శంక! రఘునాథ సాహసాంక!
46
క. అని విన్నవింపఁ జిత్తము
నన లొత్తఁ బరిగ్రహించి నాపై నింతిం
తనరాని వత్సలత్వము
కనిపింపఁగ హర్షభర వికస్వర ముఖుఁడై.
47
తే. కల నయిన మిమ్ముఁ గా కన్యుఁ గొలువనంటి,
కృతు లొకరి కీను మీకె యంకితములంటి,
పలికిన ప్రతిజ్ఞ చెల్లింప వలదె యిట్లు?
వాఙ్నియమ రూఢి నీయంత వాఁడిఁకేఁడి?
48
క. వాసించుఁ గవిత చెప్పిన
వీసర వో వొకట; భక్తి విశ్వాసంబుల్‌
నీ సొమ్ములు; సామాన్యుఁడ
వే? సూర్యవరప్రసాది విజ్జగమెఱుఁగన్‌
49
క. ప్రతి పద్యమునందుఁ జమ
త్కృతి గలుగం జెప్ప నేర్తు; వెల్లెడ బెళు కౌ
కృతి వింటి మపారము గా
క్షితిలో నీ మార్గ మెవరికిన్‌ రాదు సుమీ!
50
తే. క్షత్త్ర ధర్మమ్మె కద నీకుఁ గలది మొదలఁ
దమ్ములు సుతుల్‌ హితులు గూడ మమ్ముఁ గొలిచి;
తిపుడు కృతియును జెప్పి మా కిం పొనర్చి;
తొకటఁ గా దన్నిటను బ్రయోజకుఁడ వీవు.
51
తే. అని సుధా మధురోక్తుల నాదరించి
మంజుల పదార్థ భూషణాంబర కదంబ
కరి తురంగాది వాహనోత్కరము లిచ్చి
న న్నసాధారణముగ మన్నన యొనర్ప.
52
చ. అభినవ భోజరాజ బిరుదాంకుఁడు శ్రీ రఘునాథ శౌరి నన్‌
శుభమతి నేలినందులకు సూడిద చేసితి, నౌర! మిక్కిలి
న్సభల గణింప మన్నన లొనర్పఁ బ్రబంధము నింతయుత్తమ
ప్రభునకు నంకితం బొనరుపం గలిగెం గద! యంచు వేడుకన్‌
53
ఉ. ఆనతి యిచ్చెనా, యది శిలాక్షర; మెవ్వని నేని మెచ్చెనా,
వానిఁ గృతార్థుఁ జేయుఁ; బగవాఁ డయినన్‌ శరణంబుఁ జొచ్చెనా,
యా నరు నేర మెంచక తనంతటివాని నొనర్చు; నిచ్చెనా,
యేనుఁగుపాఁడి; యీడు గలదె రఘునాథ నృపాలమౌళికిన్‌?
54
ఉ. ఎందును విద్య మేలెఱుఁగ రెవ్వ; రెఱింగినఁ గొంతమాత్రమే;
యందును సాహితీ రస మహత్త్వ మెఱుంగ; రెఱింగిరేని యా
యంద మెఱుంగలే; రెఱిఁగినప్పటికిన్‌ విని మెచ్చి యీయ; రె
న్నం దగు నచ్యుతేంద్ర రఘునాథ విభుండె ప్రవీణుఁ డన్నిఁటన్‌
55
సీ. ఏ రాజు భుజశౌర్య మేదులఖానాది వజ్రీల చెలిమికి వశ్య విద్య,
యే రాజు విక్రమసారంబు విద్వేషి మహిమ పలాయన మంత్రశక్తి,
యే రాజు వీక్ష సమీహిత కర్ణాట రమ నాట్య విద్యకు రంగభూమి,
యే రాజు చరితంబు వారాశి వేష్టిత మేదినీ పతులకు మేలుబంతి,
 
తే. యతఁడు చెలువొందుఁ జినచెవ్వ యచ్యుతేంద్ర బహు జనన పుణ్య పరిగణ్య ఫలనిభాత్మ
పుత్త్రభావ ప్రమోద సంపూర్ణ హృదయ పంకజాక్షుండు రఘునాథ పార్థివుండు.
56
సీ. సింహాసనము మాట శిథిల మౌటలు విని గట్టిగా నిలుపఁ గంకణము గట్టెఁ;
గోటిసంఖ్యలు మీఱఁ గూర్చిన ధనరాశిఁ గొల్చు వారల కిచ్చెఁ గొల్చు వలెనె;
తుండీర పాండ్యాది మండలేశ్వరులపై దండెత్తి విడిసె నుద్దండ మహిమ;
నేల యీనినయట్లు నిలిచిన వైరులఁ బంచబంగాళమై పాఱఁ దఱిమె;
 
తే. గర్వితారాతి మస్తక ఖండనోత్థ రక్తధారానుషంగాతిరక్త ధార
నిజ కృపాణికఁ గావేరి నీటఁ గడిగె నిఖిల గుణశాలి రఘునాథ నృపతిమౌళి.
57
సీ. ఘన ఘనా ఘనముల కాల సంకెలఁ బెట్టు పాండ్యుని వెన్నాడి పాఱఁ దఱిమెఁ;
దుండీర నాథుండు దురమునఁ బఱవంగఁ జూచి ప్రాణము దయఁ గాచి విడిచెఁ;
గయ్యాన వెనుకఁ ద్రొక్కని రాజు లెదిరింపఁ జేరిన రాజ కౌశికులఁ బట్టెఁ;
బోరాడఁగా రాని వైరుల కోటలు పంపులచే లగ్గపట్టి తివిచె;
 
తే. నితఁడు సామాన్యుఁడే ధర నెంచి చూడ విజయ నిస్సాణ రావ నిర్విణ్ణహృదయ
భీత రాజన్య సైన్య నిర్భీతిదాన బిరుద నిజపాణి రఘునాథ భిదురపాణి.
58
ఉ. ఇచ్చునెడన్‌ బదార్థ మడి గిచ్చునొ; తా దయసేయఁ గాదనన్‌
వచ్చునొ; మించి యొక్కఁ డన వచ్చినఁ దా నది యిచ్చగించునో
యిచ్చిన నిచ్చెనే; సరిగ నెవ్వరిపై దయచేసెఁ జేసెనే;
యచ్చతురాస్యుఁడున్‌ దెలియఁ డచ్యుతు శ్రీరఘునాథుని చిత్తమున్‌
59
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - pIThika - chEmakUra vEMkaTa kavi( telugu andhra )