కావ్యములు విజయ విలాసము పీఠిక
షష్ఠ్యంతములు
క. ఏతాదృగ్గుణ ఖనికిన్‌,
సీతాదృఙ్మోహనాంఘ్రి సేవా ధనికిన్‌,
శాతాసికలిత బాహా
న్వీతాసిక విమతరాజ నిఖిలావనికిన్‌
60
క. సాక్షాన్మనోజునకు, క్షో
దక్షమ రస భావ సుకవితా భోజునకున్‌,
దాక్షిణ్య గణేయునకున్‌,
దక్షిణ సామ్రాజ్య విభవ ధౌరేయునకున్‌
61
క. సుస్థిర లక్ష్మీ మహిత మ
ణిస్థగిత గృహాంగణునకు, నేపాళ నృపా
ల స్థాపన చణునకు, సక
లాస్థాన ప్రణుత వర గుణాభరణునకున్‌
62
క. కీర్త్యౌదార్యాధరి తా
మర్త్య మహీరుహ సుధాబ్ధి మహికా ఘృణికిన్‌
ధౌర్త్యవదరి కరి సృణికిన్‌
మూర్త్యంబా గర్భశుక్తి ముక్తామణికిన్‌
63
క. అఘటన ఘటనా చాతు
ర్య ఘనోర్జిత కార్య నిర్వహణ ధూర్వహ ధీ
మఘ వాచార్యున కచ్యుత
రఘునాథ వసుంధరాధిరా డ్వర్యునకున్‌
64
వ. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన విజయ
విలాసంబను శృంగార ప్రబంధమ్మునకుఁ గథాక్రమం బెట్టి దనిన;
నైమిశారణ్య మహర్షులకు రౌమహర్షణి యిట్లని చెప్పం దొడంగె.
65
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - pIThika - chEmakUra vEMkaTa kavi( telugu andhra )