కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
ఇంద్రప్రస్థపురీ వైభవము
శా. చంద్రప్రస్తర సౌధ ఖేలనపర శ్యామా కుచ ద్వంద్వ ని
స్తంద్ర ప్రత్యహ లిప్త గంధ కలనా సంతోషిత ద్యోధునీ
సాంద్ర ప్రస్ఫుట హాటకాంబురుహ చంచచ్చంచరీ కోత్కరం
బింద్రప్రస్థ పురంబు భాసిలు రమాహేలా కళావాసమై.
1
ఉ. ద్వారక ముద్దుఁజెల్లె లఁట తన్నగరీమణి; సృష్టి యన్నిటం
దేరుగ డైనచో నిదియ నేర్పుల మే రని యెంచి చేసెఁ బో
ధారుణి విశ్వకర్మ; గుఱి దానికి నెక్కడ నీడు లేని సిం
గారము గల్గు టందు వెనుకన్‌ సృజియింపక యుండుటే సుమీ.
2
క. వెండియుఁ బైఁడియుఁ దడఁబడు
చుండుం బురి నెందుఁ జూడ; నుగ్రాణములై
యుండంగా వలె నందలి
యిండులఁ గైలాస మేరు పృథ్వీధరముల్‌.
3
సీ. తడఁబాటు గలదు వేదముల నాతని కంచుఁ బరమేష్ఠి మెచ్చరు ధరణిసురులు;
కడమాటు పగవానిఁ గని చేమఱచె నంచు భార్గవు మెచ్చరు బాహుజనులు;
పనికి రా కొకమూలఁ బడియె నాతనివస్తు లని కుబేరుని మెచ్చ రర్యజనులు;
వీటిపా టైన నాఁగేటి పాటున నేమి యని హలాయుధు మెచ్చ రంఘ్రిభవులు;
 
తే. పాడి దప్పక, ధర్మంబు పట్టువిడక, లక్షలకు నమ్మఁ జాలి, నల్గడల భూమి
వరులు మే లనఁ దగి, యిట్లు పురిఁ బొలుతురు చదువు సాముల ధన ధాన్య సంపదలను.
4
ఉ. 'నీ సరి యైన దేవతటినిన్‌ గలఁగించెద నీ వడంపుమా
నాసరి శేషపన్నగ ఫణానివహంబు' నటంచు నప్పురిన్‌
బాసలు సేసికొన్న వన భాసిలు సాలశిఖాళి ఖేయముల్‌
మోసమె యైన విష్ణుపదమున్‌ బలిపీఠము ముట్ట నేటికిన్‌?
5
ఉ. రే లమృతాంశులో శశము రెమ్ముద మంచుఁ దలంచి జాళువా
మేలి పసిండి సోయగపు మేడల గుజ్జెనగూళ్ళ సందడిన్‌
బాలిక లుండి, యావలఁ జనం గని చింతిలి 'వంటయింటి కుం
దే లిది యెందుఁ బోఁగలదు నేఁటికి నే' మని యందు రందులన్‌.
6
ఉ. పున్నమరేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళి దాఁకి, వి
చ్ఛిన్నగతిన్‌ సుధారసము చింది పయిన్‌ దిగువాఱ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నది నిక్కము గా దనిరేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁ బని యే మిల సౌధనామముల్‌?
7
ఉ. వేడుక నప్పురీహరుల వేగముఁ గన్గొని లేళ్ళు గాడ్పుతోఁ
గూడి చనన్‌ వలెన్‌ మనము; గూడఁగ నోపక యోడినట్టి వా
రోడనివారి మోచు టని యొద్దికఁ బందెము వైచి కూడలే
కోడెనొ కాక, మోయఁగఁ బ్రయోజన మే మనిలున్‌ గురంగముల్‌?
8
ఉ. చుట్టును గట్టియుండు నొకచో నెడ మించుక లేకయుండఁ ద
త్పట్టణ బాహ్యభూముల మదావళ మండల మేమి చెప్ప! ని
ట్టట్టుఁ దెమల్పరా కరి భయంకర మై దివితోడ రాయు; నౌఁ;
బెట్టనికోట గాదె గజబృందము లెందును రాజధానికిన్‌.
9
ఉ. గాళకు లాపురీ భటశిఖామణు లెక్కటి యుక్కుతున్క; లా
భీలత రాశనుల్‌ చిదిమి పెట్టిన బంటులు వైరి కెల్ల; బే
తాళుఁడు వచ్చి డగ్గఱిన దబ్బర గా దొకదెబ్బ తీయఁగాఁ
జాలుదు; రేమి చెప్ప మఱి సాదన నేటును సాహసంబునున్‌.
10
సీ. ఆరామ సీమలయందు నుండి పవళ్లు ముదమెసంగ వసంతుఁ డెదురుచూచు;
మునిమాపుకడలఁ గ్రొన్ననవింటి నెఱజోదు కేళిమందిరముల కెలనఁ జూచుఁ;
బ్రొద్దు వోయిన వేళ రోహిణీప్రాణేశుఁ డుదిరి మేఁడల మీఁద వెదకి చూచుఁ;
దెలతెలవాఱంగ మలయ గంధవహుండు సోరణగండ్లలోఁ జొచ్చి చూచు;
 
తే. నా పురి విలాసవతుల యొయ్యారములకుఁ గడు సొగసి, వారి రాకలు కాచి కాచి
విరహులఁ గలంచువారె యివ్విధము గాఁగ నున్నవారల నిఁక వేఱె యెన్న నేల?
11
క. మగవానిని మగవాఁడును,
మగువను మగువయును వలచు; మఱి యే మన న
న్నగరపు రాజకుమారుల
జిగిబిగి సోయగము, చెలుల సింగారంబుల్‌!
12
చ. పొలయలుకల్‌ వహించి, వలపుల్‌ మొలిపించు పిసాళి గబ్బి గు
బ్బల జవరాండ్రు మై గగురుపాటున 'నేటికి వచ్చెనమ్మ? యీ
పిలువనిపేరఁటం' బనుచు బెగ్గిలి, నాథులఁ గౌఁగిలింపఁగాఁ
బొలుపుగ నందుఁ బెండ్లి నడుపుల్‌ నడుచున్‌ వలినాలి తెమ్మెరల్‌.
13
ఉ. ప్రాయపు నాయకుల్‌ వెల నెపాన నెగాదిగఁ జూడ 'నేర్పు లౌ
రా యివి దండ మీఁద గొసరం దొరఁకొంటిరి; మంచి సాములే
పో యటు లైనచో సరసముల్‌ గద మీ కిపు!' డంచు నప్పురిన్‌
గాయజు తూపు లమ్ముదురు కందువ మాటలఁ బుష్పలావికల్‌.
14
సీ. గొప్పలై మిన్నందు చప్పరా లెక్కి లాఁ గులు వైచుచోఁ జంద్రకళ లనంగఁ,
గనకంబు వర్షించు ఘనుల మ్రోల నటించి మెఱయుచోఁ దొలకరి మెఱపు లనఁగ,
మాటికిఁ జూపర మది కాస గొల్పుచోఁ బ్రతిలేని బంగారు ప్రతిమ లనఁగఁ,
గుపిత నాథులఁ గూర్మిఁ గొసరు జంకెన నాటఁ గనుచో మరు శిలీముఖము లనంగఁ,
 
తే. జెలఁగి యింపుగ నగఁ, బాడఁ, జెప్పఁ, జదువ, వలవ, వలపింప నేర్చిన యలరుఁబోండ్లు
విపుల భరత కళాశాస్త్ర నిపుణ లైన బిరుదుపాత్రలు గలరు తత్పురమునందు.
15
సీ. అతివినోదము గాఁగ రతుల మెప్పించు నీ పచ్చల కడియాల పద్మగంధి;
చక్కెర మో విచ్చి చవులఁ దేలించు నీ ముత్యాల కమ్మల మోహనాంగి;
తృణముగా లోఁజేయు నెంతటివాని నీ నీలాల ముంగఱ నీలవేణి;
వెలలేని పొందిక విడివడి మెఱయు నీ కెంపులబొగడల కీరవాణి;
 
తే. యనుచుఁ దమలోన నెఱజాణతనము మీఱ, వారకాంతామణుల మేలు వార్త లెల్లఁ
దెలుపుచును వెన్నెల బయళ్ళఁ గలసి నగుచు విటులు విహరింతు రప్పురి వీథులందు.
16
తే. పోఁక మ్రాఁకుల మహిమ, కప్పురపు టనఁటి
యాకుఁదోఁటల సౌభాగ్య మందె కలదు;
ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ
వీటి రహి మెచ్చ వలయుఁ బో వేయు నోళ్ళ .17
 
ఉ. ఆణి మెఱుంగు ముత్తెపు టొయారపు మ్రుగ్గులు, రత్నదీపికా
శ్రేణులు, ధూపవాసనలు, హృద్య నిరంతర వాద్య ఘోషముల్‌
రాణఁ బొసంగఁ బ్రోలు మిగులన్‌ గనువిం దొనరించు నిత్య క
ల్యాణముఁ బచ్చతోరణమునై జను లందఱు నుల్లసిల్లంగన్‌.
18
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )