కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
ధర్మరాజు ధర్మ పరిపాలనము
ఉ. ఆ పుర మేలు 'మేలు! బళి!' యంచుఁ బ్రజల్‌ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు, సత్య భా
షా పరతత్త్వకోవిదుఁడు, సాధుజనాదరణుండు, దాన వి
ద్యా పరతంత్రమానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై.
19
శా. దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యావైదుష్యము దిక్కు, ధర్మమునకున్‌ దార్కాణ, మర్యాదకున్‌
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హిత శిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి యజాతశత్రుఁడు మహీభృన్మాత్రుఁడే చూడఁగన్‌!
20
సీ. అవలఁ బోయిన వెన్క నాడు టెన్నఁడు లేదు, మొగము ముందఱ నంట మొదలె లేదు,
మనవి చెప్పినఁ జేయకునికి యెన్నఁడు లేదు, కొదవగా నడుపుట మొదలె లేదు,
చనవిచ్చి చౌక చేసినది యెన్నఁడు లేదు, పదరి హెచ్చించుట మొదలె లేదు,
మెచ్చినచోఁ గొంచె మిచ్చు టెన్నఁడు లేదు, మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు,
 
తే. మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్న నితఁడె పో సార్వభౌముఁ డప్రతిముఁ డనఁగఁ
బ్రజలఁ బాలించె సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు.
21
సీ. ఎంత లెస్సగ నున్న నంత వేడుకె కాని ప్రజల కల్మి కసూయపడుట లేదు;
తనుఁ గొల్వవలె నంద ఱను ప్రియంబే కాని మానిసి వెగ టించుకైన లేదు;
నిచ్చ వేఁడిన నర్థి కిచ్చు చిత్తమె కాని మును పింత యిచ్చితి ననుట లేదు;
రే వగల్‌ ధర్మ మార్జించు దృష్టియె కాని న్యాయంబు తప్పిన నడక లేదు;
 
తే. 'కలఁడె యిటువంటి రాజు లోకమున నెందు? జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల
నేలవలె శాశ్వతముగాఁగ నీ ఘనుండె; యేల వలె నన్యు?' లన నా నృపాలుఁ డలరు.
22
ఉ. కోప మొకింత లేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా
రూపము; తారతమ్యము లెఱుంగు; స్వతంత్రుఁడు; నూతనప్రియా
టోపము లేని నిశ్చలుఁ డిటుల్‌ కృతలక్షణుఁడై చెలంగఁగా
ద్వాపర లక్షణుం డనఁగ వచ్చునొకో యల ధర్మనందనున్‌.
23
క. దుర్జయ విమతాహంకృతి
మార్జన యాచనక దైన్య మర్దన చణ దోః
ఖర్జులు గల రతనికి భీ
మార్జున నకుల సహదేవు లను ననుజన్ముల్‌.
24
క. పంచామర తరులో! హరి
పంచాయుధములొ! గిరీశు పంచాస్యములో!
యంచున్‌ సకల జనంబులు
నెంచన్‌ బాండవులు వెలసి రేవురు ఘనులై.
25
చ. ఒరిమయు, భక్తియున్‌, నెనరు, నోర్పుఁ గనంబడఁ బెద్ద పిన్న యం
తరువు లెఱింగి, మాట జవదాఁటక, చెయ్వుల వేఱు లేక, యొం
డొరుల మనమ్ములో మెలఁగుచుండిరి 'పాండు కుమారు లెంత నే
ర్పరు? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ!' యనన్‌
26
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )