| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| అర్జునుని సౌశీల్యాదులు | ||
| ఉ. |
అన్నలపట్లఁ, దమ్ముల యెడాటమునన్ సముఁ డంచు నెన్నఁగా నెన్నిక గన్న మేటి, యెదు రెక్కడ లేక నృపాల కోటిలో వన్నెయు వాసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి సాత్త్వికుల్ దన్ను నుతింపఁగాఁ దనరు ధార్మికుఁ డర్జునుఁ డొప్పు నెంతయున్ |
27 |
| చ. |
అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్ బతగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్, క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతి జోదు సమిజ్జయమ్మునం, దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్ |
28 |
| తే. |
పాఱఁ జూచినఁ బరసేన పాఱఁ జుచు, వింటి కొరగిన రిపురాజి వింటి కొరగు, వేయు నేటికి? నల పాండవేయు సాటి వీరుఁ డిల లేఁడు; ప్రతి రఘువీరుఁ డొకఁడె. |
29 |
| క. |
అతిలోక సమీక జయో న్నతిచే ధర్మజున కింపొనర్చుచు వినయా న్వితుఁడై సమస్తజన స మ్మతుఁడై నరుఁ డుండె నిటు లమానుష చర్యన్ |
30 |
| ఉ. |
అంతట నొక్కనాఁడు గదుఁడన్ యదువంశభవుండు రుక్మిణీ కాంతుఁడు కూరిమిన్ బనుపఁగాఁ, గుశలం బరయంగ వచ్చి, యే కాంతపువేళ ద్వారవతి యందలి వార్తలు దెల్పుచున్ దటి త్కాంతి మనోహరాంగు లగు కన్నెల చక్కఁదనంబు లెన్నుచున్ |
31 |