| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| గదుఁడు గావించిన సుభద్రా సౌందర్య ప్రశంస | ||
| పంచ చామరము. |
కనన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగీ విలో కనన్; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా కనన్; దదీయ వర్ణనీయ హావ భావ ధీ వయః కన న్మనోజ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్? |
32 |
| ఉ. |
ప్రాయపుఁ డెక్కునన్ జెలువ పల్కులు చిల్కల గారవించుఁ; గ న్దోయి చకోరపాళి దయతోఁ బెనుచున్; జనుకట్టు మచ్చిక ల్సేయు సదా రథాంగ యుగళిన్; నడ లంచల బుజ్జగించు; నౌ నే యెడ నింపు గావు గణియింప నవీన వయో విలాసముల్? |
33 |
| చ. |
అతివ కుచంబులున్, మెఱుఁగుటారును, వేనలియున్, ధరాధిపో న్నతియు, నహీనభూతి కలనంబు, ఘనాభ్యుదయంబు నిప్పు డొం దితి మని మాటిమాటికిని నిక్కెడు, నీల్గెడు, విఱ్ఱవీఁగెడున్; క్షితి నటు గాదె యొక్కొకరికిన్ నడమంత్రపుఁ గల్మి కల్గినన్! |
34 |
| సీ. |
కేళికా సరసిలోఁ దేలియాడుటఁ జేసి శైవాల లత కొంత సాటి వచ్చుఁ; బుష్పమాలికలతోఁ బొందు సల్పుటఁ జేసి యెలదేఁటి గమి కొంత యీడు వచ్చుఁ; గంటి కింపగు రేఖ గల్గియుండుటఁ జేసి మినుకుఁ గాటుక కొంత దినుసు వచ్చుఁ; బిఱుఁద నొయ్యారంబు మెఱయుచుండుటఁ జేసి చమరి వాల మొకింత సమము వచ్చుఁ; |
|
| తే. |
గాక నీలత్వమున సరి గావు తెలియ నెఱి గలిగి, యొక్క మొత్తమై, నిడుదలై, ద ళమ్ములై, మెర్గు లై, కారు క్రమ్ముచున్న వికచకమలాక్షి నును సోగ వెండ్రుకలకు. |
35 |
| ఆ. |
నలిన లీల సంచు నలినలి గావించు నించుమించు లాడు నించు మించు లేమ నగవుఁజూపు లేమన నగు బాపు! జగ మెఱుంగు దాని జగ మెఱుంగు |
36 |
| చ. |
జలరుహ గంధి వీనుల పసల్ నవసంఖ్య నదేమి లెక్కనున్; జెలువ నఖాంకురాళి నెల చేడియ సైకముఁ దాను చుక్కనున్; బొలఁతుక గబ్బి చన్నుఁగవ పువ్వుల చెండ్లను లేదు బంతనున్; గలికి ముఖారవింద మల కల్వలరాయనిఁ ద్రోసి రాజనున్ |
37 |
| క. |
అయ్యారే చెలు వెక్కడ? న య్యారే గెలువఁ జాలు నంగజు నారిన్ వెయ్యాఱులలో సరి లే రయ్యా రుచిరాంగరుచుల నయ్యంగనకున్. |
38 |
| క. |
కడు హెచ్చు కొప్పు; దానిన్ గడవన్ జనుదోయి హెచ్చు; కటి యన్నిటికిన్ గడు హెచ్చు; హెచ్చులన్నియు నడుమే పసలేదు గాని నారీమణికిన్ |
39 |
| ఉ. |
అంగము జాళువా పసిఁడి యంగము; క్రొన్నెలవంక నెన్నొసల్; ముంగురు లింద్రనీలముల ముంగురు; లంగజు డాలు వాలుఁ జో పుంగవ; యేమి చెప్ప నృపపుంగవ! ముజ్జగ మేలఁజేయు న య్యంగనఁ బోలు నొక్క సకియన్ గన; నెన్నఁగ మించు నన్నిటన్ |
40 |
| ఉ. |
ఎక్కడఁ జెప్పినాఁడఁ దరళేక్షణ చక్కఁదనమ్ము? నింక న మ్మక్క! యదే మనంగ నిపు డందు శతాంశము దెల్పలేదు నే; నొక్కొకయంగ మెంచవలయున్, బదివేల ముఖంబు లాయెఁబో; చొక్కపుఁ జూపులో సొలపు చూచినఁ గాక యెఱుంగ వచ్చునే |
41 |
| చ. |
అని బహుభంగులం బొగడ నంగన ముంగల నిల్చినట్లుఁ దాఁ గనుగొనినట్లునై నృపశిఖామణి డెందమునందుఁ బట్టఁజా లని యనురక్తి 'నవ్వర విలాసిని నెన్నఁడు చూడఁ గల్గునో' యని తమకించుచున్న సమయంబున గ్రక్కున దైవికంబునన్. |
42 |