కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
సమయభంగమునకై యర్జునుఁడు తీర్థయాత్ర కేఁగుట
మ. ఒక భూమీదివిజుండు చోరహృత ధేనూత్తంసుఁడై వేఁడికొం
టకుఁ రా ధర్మజు కేళిమందిరము దండం బోయి కోదండ సా
యకముల్‌ దెచ్చుటఁ బూర్వకౢప్త సమయ న్యాయానుకూలంబుగా
నొక యేఁ డుర్వి ప్రదక్షిణం బరుగు నుద్యోగంబు వాటిల్లినన్‌
43
ఉ. అన్నకు మ్రొక్కి, 'తీర్థ భజనార్థముగాఁ బనివిందు' నంచుఁ దా
విన్నప మాచరించుటయు, 'విప్రహితంబున కన్న ధర్మమే
మున్నది? గోప్రదక్షిణమె యుర్విప్రదక్షిణ' మంచు నిట్టు లే
మన్నను మాన కన్నరుఁడు ప్రార్థన సేయఁగ నెట్టకేలకున్‌
44
చ. తనదు పురోహితుం డయిన ధౌమ్యుని తమ్ముని గారవంపు నం
దనుని విశారదున్‌ సకలధర్మ విశారదు వెంట నంటఁగా
నొనరిచి, కొందఱన్‌ బరిజనోత్తములన్నియమించి, యాదరం
బెనయ సమస్త వస్తువులు నిచ్చి యుధిష్ఠిరుఁ డంపె వేడుకన్‌
45
చ. పరిణయ మౌట కేఁగుగతిఁ బౌరు లనేకులు వెంటరా శుభో
త్తరముగ నయ్యెడన్‌ గదలి, తద్దయుఁ దాలిమి మీఱ ధర్మత
త్పరుఁడయి, యందు నందు నులుపాలు నృపాలు రొసంగఁగా నిరం
తరమును బుణ్యతీర్థములఁ దానము లాడుచు నేఁగి యవ్వలన్‌
46
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )