| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| అర్జునుఁడు గంగాభవానిని నుతించుట | ||
| భుజంగ. |
సునాసీర సూనుండు చూచెన్ నిమజ్జ జ్జనౌఘోత్పత త్పంక శంకాక రాత్మో ర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్నమ ద్భృం గ నేత్రోత్సవ శ్రీని గంగా భవానిన్. |
47 |
| క. |
సంతోష బాష్ప ధారలు దొంతరగాఁ జూచి, మ్రొక్కి, తోయధి వరసీ మంతిని, నా త్రిజగ ద్దీ వ్యంతిని, భాగీరథీ స్రవంతిని బొగడెన్ |
48 |
| శా. |
తా సైరింప కపర్ణ యుండఁగ భవ ద్గర్భంబునన్ దాల్చి, తే జోఽసహ్యున్ శరజన్ముఁ గాంచి, యల నీహార క్షమాభృత్కుమా రీ సాపత్న్యముఁ గన్న మోహపుఁ బురంధ్రీరత్నమౌ దీవ కా దే; సర్వజ్ఞుఁడు నిన్ను నేల తలపై నెక్కించుకో జాహ్నవీ! |
49 |
| క. |
పెల్లు సెగఁ జల్లు విస మా తెల్లని దొర కుతికమోవఁ దివి బ్రతుకుట నీ చల్లఁ దనంబునఁ గాదే? కల్లోలవతీమతల్లి! గంగమ తల్లీ! |
50 |
| క. |
పువ్వారుఁబోణివై, సరి యెవ్వా రన, భీష్ముఁ గాంచి యిం పొందితి వీ; వవ్వావి యెఱుఁగుదువె? మా యవ్వా! పోషింపఁ బాడి యగు నను నీకున్. |
51 |
| చ. |
సకల శుభమ్ము లిమ్మనుచు సన్నుతు లీగతిఁ జేయ నా స్రవం తిక దయఁ దెల్పఁ బంచిన గతిం జనుదెంచె నుదంచ దూర్మికా నికర విలోల ఖేల దళినీ కలగాన లసత్ప్రఫుల్ల హ ల్లక సుఖడోలికా విహృతి లాలస బాలసమీర మయ్యెడన్ |
52 |
| క. |
చనుదెంచిన హా! యని, య జ్జననాయకుఁ డలరుచున్ విశారదుఁ గని, "యీ యనుకూల మారు తాగతిఁ గనుఁగొన నామోద సూచకం బైనదిగా |
53 |
| క. |
తల నీ గంగాతీర్థము చిలికినవాఁ డీశ్వరుండు; చేరెడు లోఁ గోఁ గలిగినఁ, దరఁగలఁ దేలం గలిగినఁ దన్మహిమ లెన్నఁగాఁ దర మగునే? |
54 |
| క. |
మునుకలు గంగానదిలో నొనరించుటకన్న భాగ్య మున్నదె?" యనుచున్ మును కలుగంగా దిగి పరి జనములు కైలా గొసంగ స్నానోన్ముఖుఁడై |
55 |
| క. |
తమి నిగుడ గుడాకేశుం డమరనదీ విమలవారి నాడుచు నుండన్ యమునానదిఁ గూడిన తో యమునా నది తనరెఁ దత్కచామేచకమై |
56 |
| ఉ. |
దానము లెన్నియే నచటి తైర్థిక భూసుర సంఘ మెల్ల డెం దాన ముదంబు చెందఁగ నొనర్చి, దృఢవ్రతచర్య నిత్యమున్ దానము చేయుచున్, హరికథా శ్రవణం బొనరించుచుండె నం దా నముచిద్విషత్తనయుఁ డాశ్రిత కల్పమహీరుహం బనన్ |
57 |