కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
ఉలూచి యర్జునుని సోయగమును మెచ్చుట
క. "సిగ సంపెఁగ పూ, లొసపరి
వగ, కస్తురి నామ, మొఱపు వలెవా టౌరా!
సొగ సిటు లుండఁగ వలె"నని
సొగసి, లతాతన్వి యతని సొగసు నుతించెన్‌
64
క. రాకొమరు నెఱులు నీలపు
ఱాకొమరు నిరాకరించు; రాకాచంద్రున్‌
రాకొట్టు మొగము; కెంజిగు
రాకుఁ గని పరాకు సేయు నౌర పదంబుల్‌!
65
ఉ. తీరిచినట్టు లున్నవి గదే కనుబొమ్మలు; కన్ను లంటిమా
చేరలఁ గొల్వఁగా వలయుఁ; జేతుల యందముఁ జెప్ప గిప్ప రా;
దూరులు మల్చివేసినటు లున్నవి; బాపురె! ఱొమ్ములోని సిం
గారము, శేషుఁడే పొగడఁగావలె నీతని రూపరేఖలన్‌.
66
క. అకటా! న న్నితఁ డేలిన
నొకటా? నచ్చికము లేక యుండఁగ వచ్చున్‌
నికటామృత ధారలు మరు
ని కటారి మెఱుంగు లీతని కటాక్షంబుల్‌
67
ఉ. ఆ దరహాస చంద్రికల యందము, నాప్తులమీఁదఁ జిల్కు న
త్యాదర శీతలేక్షణ సుధారస ధారయుఁ జూడఁ జూడ నా
హ్లాదము గొల్పఁగాఁ గల కలా మహిమంబుఁ దలంచి చూచిన
న్మాదిరి సేయవచ్చు జననాథు మొగంబును జంద్రబింబమున్‌
68
ఉ. ఊఁదుకపోవు శంఖము నహో గళరేఖ! శరాసనంబులన్‌
వాదుకుఁ బట్టుఁ గన్బొమల వైఖరి; వంకలు దీరుచున్‌ గటా
క్షోదయలీల సాయక సమూహములన్‌; విషమాస్త్రుఁ గెల్చుఁబో;
యే దొర సాటి యీ నరున కెన్నఁగ వీరవిలాస సంపదన్‌?
69
ఉ. కమ్మని జాళువా నొరయఁ గల్గిన చెక్కుల టెక్కువాఁడు, చొ
క్కమ్మగు జాతికెంపు వెలగాఁ గొను మోవి మెఱుంగువాఁడు, స
త్యమ్మగు రూప సంపద ధనాధిపసూనుని ధిక్కరించువాఁ
డమ్మక చెల్ల! నా హృదయ మమ్మక చెల్లదు వీని కియ్యెడన్‌
70
సీ. ముద్దాడ వలదె యీ మోహనాంగుని మోము గండ చక్కెర మోవి గల ఫలంబు?
రమియింపవలదె యీ రమణు పేరురముపై వలి గుబ్బ పాలిండ్లు గల ఫలంబు?
శయనింపవలదె యీ ప్రియుని సందిటిలోనఁ గప్పు పెన్నెఱికొప్పు గల ఫలంబు?
వసియింప వలదె యీ రసికు నంకమునందుఁ జెలువంపు జఘనంబు గల ఫలంబు?
 
తే. రాజసము తేజరిల్లు నీ రాజుఁ గూడి యింపు సొంపులు వెలయఁ గ్రీడింప వలదె
నాకలోకంబు వారికి నైన లేని యలఘుతర భోగభాగ్యముల్‌ గల ఫలంబు
71
క. అని యిటు లువ్విళ్లూరెడు
మనమునఁ గొనియాడి యంత మాపటి వేళన్‌
గనుఁబ్రామి, చొక్కుఁ జల్లిన
యనువున నందఱు వితాకులై యుండంగన్‌.
72
చ. "ఇటు జపియించినన్‌ విడుతునే నిను నేనిఁక" నంచు జాహ్నవీ
తటమున సంధ్యవార్చి జపతత్పరుఁడై తగువాని యామినీ
విటకుల శేఖరున్‌ గొనుచు వే పురికిన్‌ జని నిల్పె నట్టెయు
న్నటులనె మాయ యచ్చుపడ నల్ల భుజంగి నిజాంగణంబునన్‌
73
క. నిలిపిన జప మెప్పటివలెఁ
జలిపినవాఁ డగుచుఁ బాకశాసని యంతన్‌
దళుకుం బిసాళి వాలుం
దెలి గన్నులు విచ్చి చూచె నివ్వెఱతోడన్‌
74
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )