కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
భోగవతిలో నర్జునుఁడు ఉలూచి విభ్రమము చూచి సంభ్రమాశ్చర్యముల నొందుట
సీ. దట్టంపుఁదెలి నీటి తరఁగచాల్‌ కడ కొత్తి నెలఱాల జగతిఁ దా నిలుచు టేమి?
కొలఁకుఁ దెమ్మెర గందములఁ గ్రిందఁ బడవైచి కపురంపుఁ దాఁవిఁ దాఁ గవియు టేమి?
చివురు జొంపపు మావి జీబు మాయము సేసి పసిఁడి యుప్పరిగఁ దాఁ బ్రబలు టేమి?
నిద్దంపు టిసుము తిన్నియ పాన్పు దిగ ద్రోచి యలరుల పాన్పుఁ దా హత్తు టేమి?
 
తే. మసమసక సంజ కెంజాయ మఱుఁగువెట్టి మిసిమి కెంపుల కాంతిఁదా మెఱఁయు టేమి?
మొదల నే గంగతటి నున్న యదియు లేదొ మాయయో కాక యిది? యంచు మరలిఁజూడ
75
సీ. బెళుకుఁ గాటుకకంటి సొలపుఁ జూ పెదలోనఁ బట్టియుండెడి ప్రేమఁ బట్టి యీయఁ
జికిలి బంగరువ్రాఁత జిలుగు టొయ్యారంపుఁ బైఁట గుబ్బల గుట్టు బైటవేయ
సొగసుఁ గుచ్చెల నీటు వగలు కన్నుల పండు గలుగ మాయపుఁ గౌనుఁ గలుగఁజేయ
నిడుద సోగ మెఱుంగు జడకుచ్చు గరువంపుఁ బిఱుఁదు రేఖకు గెల్పుబిరుదు చాటఁ
 
తే. గంటసరి నంటు కస్తురి కమ్మవలపు కప్పురపు వీడియపుఁ దావి గలసి మెలఁగ
నొఱపులకు నెల్ల నొజ్జయై యుండె నపుడు భుజగ గజగామిని మిటారి పొలుపు మీఱి
76
క. అటులున్న కొమరుఁ బ్రాయపుఁ
గుటిలాలకఁ జూచి, మదన గుంఫిత మాయా
నటనంబో యది! గంగా
ఘటనంబో! యని విచార ఘటనాశయుఁడై
77
ఉ. తియ్యని వింటివాని వెనుతియ్యక డగ్గఱఁ జాలు నయ్యసా
హాయ్య తనూవిలాసి దరహాసము మీసముఁ దీర్ప నప్పుడా
తొయ్యలి వంకఁ గన్గొని "వధూమణి! యెవ్వరిదాన నీవు? పే
రెయ్యది నీకు? నొంటి వసియింపఁగఁ గారణ మేమి?" నావుడున్‌
78
ఉ. మేలి పసిండి గాజుల సమేళపుఁ బచ్చల కీల్కడెంపు డా
కేలు మెఱుంగు గబ్బి చనుఁగ్రేవకుఁ దార్చుచు సోగ కన్నులన్‌
దేలగఁ జూచి, "యో మదవతీ నవమన్మథ! యీ జగంబు పా
తాళము; నే నులూచి యనుదాన, భుజంగమరాజ కన్యకన్‌
79
క. సరిలేని విలాసము గని
వరియిం చిటఁ దోడికొనుచు వచ్చితి నిన్నో
కురువీర! వసింపఁగ నీ
కుఱువీర దృఢాంకపాళిఁ గోరినదానన్‌
80
ఉ. మంపెసఁగన్‌ గటాక్ష లవమాత్రము చేతనె ముజ్జగంబు మో
హింపఁగఁ జేయు భార మిఁక నీవు వహించితి గానఁ గేళినీ
చంపకగంధి బిత్తరపుఁ జన్నుల మీఁద సుఖించుచుండు నా
సంపెఁగమొగ్గ ముల్కిగడ సామరి సోమరి గాక యుండునే?"
81
క. అను నచ్చెలి వాక్యంబులు
విని యచ్చెరువొంది, "రూప విభ్రమ రేఖా
ఖను లెందు నాగకన్యలె"
యని విందుము; నేఁడు నిక్క మయ్యెన్‌ జూడన్‌
82
క. అన్నన్న! మొగము వెన్నుని
యన్నన్న జయించుఁ; గన్ను లన్నన్‌ నలినా
సన్నములు; నడుము మిక్కిలి
సన్నము; మాటలు సుధా ప్రసన్నము లెన్నన్‌
83
ఆ. నువ్వుఁ బువ్వు నవ్వు జవ్వని నాసిక,
చివురు సవురు జవురు నువిదమోవి,
మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి,
మెఱపు నొఱపుఁ బఱపుఁ దెఱవ మేను
84
క. రవరవలు నెఱపు నీలపు
రవ రవణముతోడఁ జెలి యరాళ కచంబుల్‌;
కవకవ నవ్వున్‌ వలి జ
క్కవ కవఁ గలకంఠ కంఠి కఠిన కుచంబుల్‌
85
ఉ. చెక్కుల యందమున్‌, మొగము చెల్వముఁ, జన్గవ నీటు, వేణి తీ
రెక్కడఁ జూడ; మన్నిటికి నెక్కువ దే మన సైకతంబుతో
నెక్కటి కయ్యముల్‌ సలుపు నిక్కటి యొక్కటి చాలదే మరున్‌
డక్కగొనన్‌ రతిన్‌ గెలిచి డక్కగొనన్‌ నవమోహనాంగికిన్‌
86
చ. అని మది మెచ్చి యొచ్చె మొకయందును లేని మనోహరాంగముల్‌
గనుఁగొని, "యౌనెకా! వ్రతము గైకొని యుండెడి నన్ను నేల తో
డ్కొని యిటఁ దెచ్చె నీ వెడఁగుఁ గోమలి? భూజగ మేడ, మారుతా
శనజగ మేడ? యెంత ఘనసాహస మింతుల?" కంచు నెంచుచున్‌
87
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )