కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
ఉలూచి యర్జునుల సరస సంవాదము
క. "కాముకుఁడఁ గాక వ్రతినై
భూమి ప్రదక్షిణము సేయఁ బోయెడి వానిన్‌
గామించి తోడి తేఁ దగ
వా? మగువ! వివేక మించుకైనన్‌ వలదా?"
88
ఉ. నావుడు మోమునన్‌ మొలక నవ్వొలయన్‌, వలి గబ్బి గుబ్బ చన్‌
ఠీవికిఁ గాన టించుక నటించు కవున్‌ గనిపింపఁ బల్కె రా
జీవదళాక్షి "యో రసికశేఖర! యో జన రంజనైక లీ
లావహరూప! యో నుతగుణా! తగునా యిటు లాన తీయఁగన్‌
89
క. నిను గీతి సాహితీ మో
హన వాణులు చెవులు వట్టి యాడింపంగాఁ
గని యుండి 'కాముకుఁడ గా'
నని పల్కిన నాకు నమ్మికౌనె నృపాలా!
90
క. అతులిత విలాస రేఖా
కృతులన్‌ వలపించి యిటులఁ ద్రిభువన లీలా
వతుల నలయించుటేనా
వ్రత మనఁగా నీకు? రూపవంచిత మదనా!
91
చ. తెలియనిదానఁ గాను జగతీవర! ద్రౌపదియందు ముందు మీ
రల సమయంబు సేయుట, ద్విజార్థము ధర్మజు పాన్పుటింటి ముం
గలఁ జని, శస్త్రశాల విలు గైకొను, టందునిమిత్త మీవు ని
శ్చలమతి భూప్రదక్షిణము సల్పఁగ వచ్చుట, నే నెఱుంగుదున్‌
92
తే. చెఱుకువిలుకాని బారికి వెఱచి నీదు
మఱుఁగుఁ జేరితిఁ; జేపట్టి మనుపు నన్నుఁ;
బ్రాణదానంబు కన్నను వ్రతము గలదె?
యెఱుఁగవే, ధర్మపరుఁడవు నృపకుమార!
93
ఉ. నాయమె నీకు మేల్పడిన నాతి నలంచుట? యంత్ర మత్స్యము
న్మాయఁగఁ జేసి మున్‌ ద్రుపదనందన నేలవె? యంగభూ పతా
కాయత యంత్రమత్స్య మిపు డల్లనఁ ద్రెళ్ళఁగ నేసి యేలుకో
తీయఁగఁ బంచదార వెనుతీయఁగఁ బల్కి ననున్‌ ద్వితీయఁగన్‌"
94
క. అనుడు నుడురాజ కులపా
వనుఁడు "సమస్తమ్ము నెఱుఁగు వలఁతివి గద; యీ
యనుచితము తగునె? పరసతి
నెనయుట రాజులకు ధర్మమే యహిమహిళా?"
95
చ. అన విని పాఁప పూప జవరా లెదలో వల పాప లేక, యా
తని తెలిముద్దు నెమ్మొగముఁ దప్పక తేట మిటారి కల్కి చూ
పునఁ దనివారఁ జూచి, "నృపపుంగవ! యన్నిట జాణ; వూరకే
యనవల సంటిగా కెఱుఁగవా యొకమాటనె మర్మకర్మముల్‌.
96
ఉ. కన్నియఁ గాని వేఱొకతెఁ గాను మనోహరరూప! నీకు నే
జన్నియ పట్టియుంటి నెలజవ్వన మంతయు నేఁటిదాఁక; నా
కన్నుల యాన; నా వలపుఁ గస్తురినామము తోడు నమ్ము; కా
దన్నను నీదు మోవి మధురామృత మానియు బాస సేసెదన్‌
97
చ. ఇలపయి మత్స్యయంత్ర మొక యేటున నేసి, సమస్త రాజులన్‌
గెలిచిన మేలువార్త లురగీ వరగీతిక లుగ్గడింప వీ
నుల నవి చల్లఁగా విని, నినున్‌ వరియింప మనంబు గల్గి, నీ
చెలువము వ్రాసి చూతు నదె చిత్తరువందు ననేక లీలలన్‌
98
ఉ. చెప్పెడి దేమి నా వలపు చేసినచేఁతలు? కొల్వులోన ని
న్నెప్పుడు గంటి నప్పుడ పయింబడ నీడిచె, నిల్వఁ బడ్డ పా
టప్పు డ దెంత యైనఁ గల; దట్టి హళాహళి కింతసేపు నీ
వొప్పెడిదాఁకఁ దాళుట కయో! మది మెచ్చవుగా నృపాలకా!"
99
తే. అనిన "ఫణిజాతి వీ, వేను మనుజజాతి;
నన్యజాతిఁ బ్రవర్తించు టర్హ మగునె?
యేల యీకోర్కి?" యనిన రాచూలి కనియెఁ
జిలువచెలువంపుఁ బల్కులఁ జిలువ చెలువ
100
ఉ. "ఏ మనఁ బోయెదన్‌ దగుల మెంచక నీ విటు లాడఁ దొల్లి శ్రీ
రాము కుమారుఁడైన కుశరాజు వరింపఁడె మా కుముద్వతిన్‌?
కోమల చారుమూర్తి పురుకుత్సుఁడు నర్మదఁ బెండ్లియాడఁడే?
నీ మన సొక్కటే కరఁగనేరదు గాని నృపాలకాగ్రణీ!
101
ఉ. 'ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె? నా
హా కడుదూర మిప్పు!' డని యక్కునఁ జేర్పక జంపుమాటలన్‌
వ్యాకులపెట్టు టేల? విరహాంబుధి ముంపక పోదు నన్‌ జలం
బే కద నీకు, మంచి దిఁక నీఁతకు మిక్కిలి లోఁతు గల్గునే?"
102
చ. అని వచియించునప్పుడు ముఖాబ్జము నంటెడి విన్నఁబాటు, చ
క్కని తెలి సోగ కన్నుఁగవఁ గ్రమ్ముచు నుండెడి బాష్పముల్‌ గళం
బునఁ గనిపించు గద్గదిక ముప్పిరిగొన్‌వలవంతఁ దెల్ప ని
ట్లని మదిలోఁ గరంగి రసికాగ్రణి యా కరభోరు భోరునన్‌
103
ఉ. "చక్కెరబొమ్మ! నా వ్రతము చందముఁ దెల్పితి; నంతె కాక నీ
చక్కఁదనంబుఁ గన్న నిముసం బయినన్‌ నిలు పోప శక్యమే
యక్కునఁ జేర్ప?" కంచు దయ నానతి యీఁ, దల వంచె నంతలో
నెక్కడినుండి వచ్చెఁ దరళేక్షణకున్‌ నునుసిగ్గు దొంతరల్‌!
104
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )