| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| అర్జునుఁ డులూచిని సుఖసాగరమునఁ దేల్చుట | ||
| ఉ. |
అంకి లెఱింగి యా సరసుఁ డంత "వివాహ విధిజ్ఞుఁ డైన మీ నాంకుఁ డొనర్చినాఁ డిది శుభైక ముహూర్తము, ర"మ్మటంచుఁ బ ర్యంకముఁ జేర నచ్చెలిఁ గరగ్రహణం బొనరించెఁ దన్మణీ కంకణ కింకిణీ గణ వికస్వర సుస్వరముల్ సెలంగఁగన్ |
105 |
| మ. |
ఒక మాణిక్యపు బొమ్మ యెట్టి వగ కీలో జాళువా జాలవ ల్లిక బాగాల్ కపురంపు టాకుమడుపుల్ వే తెచ్చి రాజున్న చా యకు నందీయ, నతండు లేనగవుతో నా వేళ నా వ్యాళ క న్యక కెంగేల నొసంగి కైకొనియె సయ్యాటంబు వాటిల్లఁగన్ |
106 |
| ఉ. |
శయ్యకుఁ దార్పఁగాఁ దుఱుముజాఱెఁ దనంతటఁ జక్కదిద్దఁబోఁ బయ్యెద జాఱె; నయ్యదిరిపాటునఁ గ్రక్కున నీవి జాఱె; రా జయ్యెడ నవ్విలాసిని యొయారముఁ జూచి కవుంగిలించె; నౌ, నెయ్యెడ మేలె చూతురు, గ్రహింపరు జాణలు జాఱుపాటులన్ |
107 |
| ఉ. |
కౌఁగిటఁ జేర్చునప్పటి సుఖంబె లతాంగికిఁ బారవశ్యము న్మూఁగఁగఁ జేసె; మోవి పలునొక్కులు రోజ నఖాంకముల్ మొద ల్గాఁగల కంతుకేళి సుఖలక్షణముల్ పయిపెచ్చులయ్యె, న ట్లౌ గద యెట్టి వారలకు నగ్గలపుం దమి గల్గియుండినన్ |
108 |
| చ. |
చనుఁగవ సాముకండెపుఁ బిసాళి యురంబున సారెఁ గాననే మన సునుచున్; సుధారసము మాటికిఁ గ్రోలనె చూఁచు; జొక్కుఁ గీ ల్కొను సరసోక్తులన్ విననె కోరు సదా; యిటు లాదిసంగమం బుననె విభుండు మూఁడువలపుల్ వలచెన్ ఫణిరాజకన్యకన్ |
109 |
| తే. |
నాగరిక ముద్ర గల మంచి బాగరి యఁట! నాగవాసములో వింత నటనల దఁట! కులుకు గుబ్బల ప్రాయంపుఁ గోమలి యఁట! వలచి వలపింపదే యెంతవాని నైన! |
110 |