కావ్యములు విజయ విలాసము ప్రథమాశ్వాసము
అర్జునుఁడు తన నెచ్చెలి విశారదునితో నులూచీ ప్రణయ ప్రసంగమును వర్ణించుట
చ. అని పలుకన్‌ బ్రసన్నముఖుఁడై విభుఁ డిష్టసఖున్‌ విశారదున్‌
గని "యొక వింత వింటె! ఫణికన్య యులూచి యనంగ నోర్తు నన్‌
గొని తమ నాగలోకమునకున్‌ జని తన్ను రమించు మంచుఁ జె
ప్పని ప్రియ మెల్లఁజెప్పి యొడఁబా టొనరించి కరంచె డెందమున్‌
116
ఉ. "చెప్పెడిదేమి! కన్నుఁగవ చేరల కెక్కుడు చంద్రబింబమే
తప్పదు మోము, మోవి సవతా చివు రెక్కడిమాట? గొప్పకున్‌
గొప్ప పిఱుందు, గబ్బి చనుగుబ్బలు కౌఁగిటి కెచ్చు జాళువా
యొప్పులకుప్ప మేను, నడు మున్నదొ లేదొ యెఱుంగ నింతకున్‌
117
ఉ. "చంగున దాఁటు చూపు లిరు చక్కని బేడిస లేమొ? మీటినన్‌
గ్రంగన వాఁగు గుబ్బలు చొకారపుఁ దాళము లేమొ, రూపమా
నం గననైన చెక్కిళులు నాణెపుటద్దము లేమొ, చొక్క మౌ
రంగున మీఱు దాని యధరంబును గెంపగునేమొ, నెచ్చెలీ!
118
ఉ. ఆ యెలనాగ వేణి మెఱుఁగారు కటారికి మాసటీఁ డగున్‌
బోయన వచ్చు; నమ్మెఱుఁగుఁబోఁడి పిఱుందు సమస్త భూమికిన్‌
రాయ లనంగవచ్చు; నల రాజనిభాస్య యెలుంగు గట్టివా
కోయిల కంచుకుత్తికలకున్‌ బయకాఁ డనవచ్చు నెచ్చెలీ!
119
క. మదిరాక్షి మోవి జిగి ప్రతి
వదనము గావించు గీర వదనముతోడన్‌
మదనుని విలు గొనవచ్చున్‌
సుదతీమణి కన్నుబొమల సుద తీరెంచన్‌
120
చ. అల జడ యందమున్‌, మెఱుఁగు టారు మిటారము నాకు ముందుగాఁ
జిలువ కొలం బటంచుఁ జెలి చెప్పక తొల్తనె చెప్పెఁ, దత్తనూ
విలసన మెన్నఁ గన్నదియు విన్నది గా, దిలలో లతాంగు లా
పొలఁతుక కాలిగోరులకుఁ బోలరు, పోలునొ యేమొ తారకల్‌!
121
సీ. మరుని గెల్పుల కథా మహిమమ్ము విలసిల్లు నొఱపుఁ జిత్తరుఠీవి నుల్లసిల్లు
వీనుల కమృతంపు సోనలై వర్తిల్లు శారికా ముఖ సూక్తి సందడిల్లుఁ
గస్తూరికాది సద్వస్తుల బ్రభవిల్లుఁ పరిమళమ్ముల జోకఁ బరిఢవిల్లుఁ
జెప్పఁ జూపఁగ రాని సింగారము ఘటిల్లు పెక్కుశయ్యల సొంపు పిక్కటిల్లు
 
తే. వింత హరువుల పసులచే విస్తరిల్లు దివ్య మాణిక్య కాంతులఁ దేజరిల్లు
నందముల కెల్ల నందమై యతిశయిల్లుఁ బాఁప జవరాలి బంగారు పడకటిల్లు
122
క. ఆ భోగము, తద్వస్తు చ
యాభోగము నెందుఁగన్నయవి గావు సుమీ!
నాభోగపురము సరి యౌ
నా భోగవతీ పురంబు సార్థంబయ్యెన్‌
123
ఉ. ఆ మదిరాక్షి భోగవతి యన్‌ నదిఁ గ్రుంకఁగఁజేసి, తత్పుర
స్థేముని హాటకేశ్వరు భజింప నొనర్చిటు తోడి తెచ్చి న
న్నీ మహి నిల్పి యేఁగె నిదె యిప్పుడె; నన్నెడఁబాయలేని యా
ప్రేమది యింత యంత యని పేర్కొనరా" దని తెల్పెఁ; దెల్పినన్‌
124
ఉ. మౌఖరి మించ నిట్టులను మంత్రిశిఖామణి "చోద్య మయ్యె నా
వైఖరి విన్న నే మనఁగవచ్చు? నహో! మనుజేంద్ర చంద్రమ
శ్శేఖర! చిల్వరా కొలము చేడియ నొక్కతెఁ జెప్పనేల? నీ
రేఖఁ గనుంగొనన్‌ వలవరే ఖచరీ ముఖ సుందరీమణుల్‌?"
125
క. అని పలుక నలరి బలరిపు
తనయుండటఁ గదలి మొదలి తైర్థికులను దా
నును మంచుఁగొండ యండకుఁ
జని తచ్ఛిఖరావలోక జనితాదరుఁడై
126
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - prathamAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )